ఇద్దరికీ పవర్


Mon,June 17, 2019 12:39 AM

సంగారెడ్డి చౌరస్తా: కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌ను కల్పిస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సోమవారం నుంచి జాయింట్ చెక్ పవర్ అమలులోకి రానున్నది. ఇప్పటికే సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌ను కల్పించాలని నిర్ణయించినప్పటికీ అమలు కాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేసి జాయింట్ చెక్ పవర్ అమలు చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. దీంతో పంచాయతీరాజ్ చట్టం 2018 సంపూర్ణంగా ఆచరణలోకి వచ్చినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మొత్తం 647 గ్రామ పంచాయతీలు ఉండగా, 647 మంది సర్పంచ్‌లు, 647 మంది ఉప సర్పంచ్‌లు తాజాగా ఎన్నికయ్యారు. జాయింట్ చెక్ పవర్‌ను ఇవ్వడంతో ఇకపై గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనున్నది. ఇదిలా ఉండగా జనవరిలో జిల్లాలోని మూడు డివిజన్లలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో జనవరి 30న జిల్లాలో చివరి విడుత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ డివిజన్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే.

జిల్లాలో మూడు విడుతల్లో ఎన్నికైన 647 మంది సర్పంచ్‌లు ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 647 గ్రామ పంచాయతీలుండగా సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ మూడు రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు జరిగాయి. అనంతరం రాజ్యంగ బద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఫిబ్రవరి 2న ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. ఆ రోజు నుంచి రానున్న ఐదేండ్ల పాటు వారు పదవిలో కొనసాగనున్నారు. అయితే ఇప్పటి వరకు చెక్ పవర్ మాత్రం లేక పోవడంతో సాదారణ పాలన కొనసాగింది. జిల్లాలో మొత్తం 647 మంది చొప్పున సర్పంచ్, ఉపసర్పంచ్‌లు, 5778 మంది వార్డు సభ్యులు ఇకపై గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కానున్నారు. కొత్త పాలక వర్గం, కొత్త పాలన మొదలైన నేపథ్యంలో నాటి నుంచి నేటి వరకు వరుసగా వివిధ ఎన్నికలు జరిగాయి. దాదాపు అన్ని ఎన్నికల ముగిసినందున ఇకపై అభివృద్ధి కోసం కృషి చేయనున్నారు.

అక్రమాలకు చెక్...
గ్రామ పరిపాలనలో భాగంగా సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌ను కల్పించడంతో అక్రమాలకు చెక్ పడుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అవినీతి రహిత పాలనలో జాయింట్ చెక్ పవర్ ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో కేవలం సర్పంచ్, కార్యదర్శికి మాత్రమే చెక్ పవర్ ఉండడంతో గ్రామాల్లో సందేహాలు ఉండేవి. సర్పంచ్‌లు, కార్యదర్శులు కుమ్మకై అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు కూడా అనేకం. అయితే గ్రామ జనరల్ బాడీ సమావేశంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య వాదన సాదారణం. ఈ వాదనలో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు కూడా గుప్తిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో వారిద్దరికీ కలిపి జాయింట్ చెక్ పపర్ కల్పించడంతో అలాంటి విమర్శలు కానీ, వాదనలు కానీ ఉండకపోవచ్చని ప్రజలు భావిస్తున్నారు. ఇద్దరు కలిసి కేవలం అభివృద్ధి వైపు ఆలోచించే చక్కని మార్గమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఏ పని చేపట్టాలన్నా నిధుల విడుదలకు చెక్కులు జారీ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో సదరు అభివృద్ధికి సంబంధించి చర్చ జరిగితే తప్ప చెక్ విడుదల కానీ పరిస్థితి ఉంటుంది. అవసరమైతే సర్పంచ్, ఉప సర్పంచ్‌లు తమ జనరల్ బాడీతో ప్రతి చిన్న విషయాన్ని చర్చించుకునే వెసులుబాటు కూడా కలుగుతుంది. కానీ ఏదేనీ ఉత్తర్వులకు సంబంధించి కేవలం సర్పంచ్‌కు మాత్రమే పూర్తి అధికారాలు ఉంటాయి.

సర్పంచ్, కార్యదర్శికి ఆడిట్ అధికారం...
అయితే గ్రామ పంచాయతీలో ఆడిట్ నిర్వహించేందుకు సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శికి అధికారం కల్పించారు. దీంతో గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులుగానీ, ఏదేనీ లావాదేవీలు జరిగినా అందుకు సంబంధించిన ఆడిట్‌ను ప్రతి యేటా నిర్వహిస్తారు. ఈ ఆడిట్ అధికారం కేవలం సర్పంచ్, కార్యదర్శిలకు కలిపి ఉంటుంది. ఏదేనీ అవకతవకలకు చోటు లభించినా అందుకు సంబంధించిన బాధ్యత కూడా సర్పంచ్, కార్యదర్శిపైనే ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించడం, సర్పంచ్, కార్యదర్శికి కలిపి ఆడిట్ అధికారం కల్పించడం స్వాగతించిన విషయమని పలువురు ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా గ్రామాల అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles