అనంతగిరిలో కలకలం రేపిన భార్యాభర్తల దారుణహత్య


Mon,June 17, 2019 12:29 AM

;;;వికారాబాద్ రూరల్ : డబ్బుల కోసం వృద్ధ దంపతులను కారు డ్రైవర్ సతీశ్, మిత్రుడు రాహుల్‌తో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం అనంతగిరి అడవుల్లో కలకలం రేపింది. ఆదివారం అనంతగిరిలో గుర్తుతెలియని మృతదేహాలు కనిపించడంతో స్థానికులు వికారాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వికారాబాద్ రూరల్ సీఐ వి.దాసు, ఎస్సై లక్ష్మయ్యతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలుసేకరించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం .. పటాన్‌చెరు మండలం నందిగామకు చెందిన స్నేహలతరెడ్డి (75), నవరత్నారెడ్డి (77)గా ఉన్నారు. నవరత్నారెడ్డి హైదరాబాద్- కర్ణాటకలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. బుధవారం వీరు ఇద్దరు హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెంచర్ చూసేందుకు కారు డ్రైవర్‌తో బయలు దేరారు. అప్పటి నుంచి భార్యాభర్తలు తిరిగి రాలేదు. బంధువులు బుధవారం కర్ణాటకకు చెందిన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో అదృశ్యం అయినట్లు ఫిర్యాదు చేశారు. ఆ రోజు నుంచి డ్రైవర్ సతీశ్ కూడా కనిపించకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో సతీశ్ వికారాబాద్‌లో ఉన్నట్లు వికారాబాద్ పోలీసులకు కర్ణాటక పోలీసులు సమాచారం అందించారు. వికారాబాద్ పోలీసుల సహాకారంతో కర్ణాటక పోలీసులు డ్రైవర్ సతీశ్‌ను పట్టుకున్నారు. సతీశ్‌ను విచారణ చేయగా రూ.30వేలు అప్పు ఉందని, అప్పు తీర్చేందుకు స్నేహితుడు రాహుల్‌తో కలిసి పథకం ప్రకారం హత్య చేసి మృతదేహాలు గుర్తుపట్టకుండా ఉండేందుకు అనంతగిరి అడవిలో కిరోసిన్, పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిపారు. మృతదేహాలను పరిశీలించగా నాలుగు రోజుల కిందే హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్యాభర్తల మృతదేహాలను, నిందితుడిని కర్ణాటక పోలీసులకు అప్పగించినట్లు సీఐ వి.దాసు తెలిపారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...