హరిత దత్తత


Sun,June 16, 2019 12:10 AM

-16 పరిశ్రమలు.., 647 గ్రామాలు
-పచ్చదనం పరిరక్షణకు గ్రామాల దత్తత
-కలెక్టర్‌ పిలుపుతో ముందుకు వచ్చిన పరిశ్రమలు
-647 గ్రామాలను దత్తత తీసుకున్న 16 కంపెనీల యాజమాన్యాలు
-మొక్కలు నాటడం, సంరక్షణ బాధ్యత వారికే..
-ఐదో విడుత హరితహారం సక్సెస్‌పై ప్రత్యేక దృష్టి
సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధానప్రతినిధి: పచ్చదనం పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే హరితహారం కార్యక్రమాన్ని తీసుకువచ్చి పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడుతల హరితహారం పూర్తి కాగా ఐదో విడుత కార్యక్రమానికి అధికార యంత్రాంగం తగు ఏర్పాట్లు చేస్తున్నది. ఐదో విడుతను గ్రాండ్‌ సక్సెస్‌ చేయడానికి కలెక్టర్‌ హనుమంతరావు దృష్టి సారించారు. ఈ మంచి కార్యంలో అన్నివర్గాలు, సంస్థలను భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. ప్రధానంగా పరిశ్రమలకు పచ్చదనం పరిరక్షణలో కొంత బాధ్యత అప్పగించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే హరితదత్తత పేరుతో మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం పరిశ్రమలను దత్తత తీసుకోవాలని పరిశ్రమల యాజమాన్యాలను కలెక్టర్‌ కోరారు. హనుమంతరావు పిలుపుతో గ్రామాల దత్తతకు పరిశ్రమలు ముందుకు వచ్చాయి. మొక్కలు నాటి సంరక్షణకు జిల్లాలోని 16 వరకు ప్రధాన పరిశ్రమల యాజమాన్యాలు 25 మండలాల్లోని 647 గ్రామాలను దత్తత తీసుకున్నాయి. పరిశ్రమల దత్తతతో రానున్న రోజుల్లో గ్రామాలు పచ్చదనంతో నిండుకోనున్నాయి.

ఐదో విడుత టార్గెట్‌ 2.75 కోట్లు...
గ్రీనరీ పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా హరితహారం కార్యక్రమం చేపట్టిన విష యం తెలిసిందే. కాగా కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 2.75 కోట్ల మొక్కలు నాటాలని జిల్లా యంత్రాంగం టార్గెట్‌ పెట్టుకున్నది. ప్రభుత్వశాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. ప్రధానంగా డీఆర్డీఏ, పంచాయతీరాజ్‌, అటవీశాఖ, నీటిపారుదల, విద్య, వైద్యం ఇలా అన్ని శాఖలను భాగస్వామ్యం చేస్తున్నారు. ఆయా శాఖల కార్యాలయాల వద్ద, ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు విడుతలుగా కూడా అన్నిశాఖలు మొక్కలు నాటుతున్నాయి. అయితే గత ఏడాది అనుకున్న స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో హరితహారం కార్యక్రమం పెద్దగా సక్సెస్‌ కాలేకపోయిందని చెప్పుకోవచ్చు. ప్రభు త్వ కార్యాలయాల వద్ద నాటిన మొక్కలను సంరక్షిస్తున్నాయి. కాగా ఈ ఐదో విడుత కార్యక్రమాన్ని పెద్దఎత్తున సక్సెస్‌ చేయాలని యం త్రాంగం నిర్ణయించుకున్నది. డ్వాక్రా సంఘాల మహిళలతో సీడ్‌ బాల్స్‌ తయారు చేయించి అటవీ ప్రాంతాల్లో వేయించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా నాలుగు విడుతలతో పోల్చితే ఈసారి ఊహించని స్థాయిలో హరితహారం బాగా నిర్వహించాలని కలెక్టర్‌ హనుమంతరావు లక్ష్యంగా పెట్టుకున్నారు.

పరిశ్రమలకు రూ.12.40 కోట్ల ఖర్చు..
గ్రామాలను దత్తత తీసుకున్న పరిశ్రమలు గ్రామానికి వెళ్లే రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటించాలి. ఊర్లో కూడా ఖాళీ ప్రదేశాలు వీధుల్లో విరివిగా మొక్కలు నాటాలి. నాటిన మొక్కల చుట్టూ ట్రీగార్డ్‌లు ఏర్పాటు చేయాలి. మొక్కలు పెరిగే వరకు నీళ్లు పోయించాలి. ప్రత్యేక వలింటీర్లను ఏర్పాటు చేసి నీళ్లు పోయించడంతో పాటు ఒక్క మొక్క పాడవకుండా కాపాడుకోవడం హరితదత్తత లక్ష్యం. ఒక్కో పరిశ్రమలకు 20 నుంచి 50 గ్రామాలను అప్పగించారు. అత్యధికంగా అరబిందో పరిశ్రమ నారాయణఖేడ్‌ మండలంలో 50 గ్రామాలు, కంగ్టి మండలంలో 34 గ్రామాలు దత్తత తీసుకున్నది. మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ 3 మండలాల్లో 81 గ్రామాలను దత్తత తీసుకున్నది. మిగతా పరిశ్రమలు కూడా రెండు నుంచి మూడు మండలాలను కూడా దత్తత తీసుకున్నాయి. ఈ 16 పరిశ్రమలు 647 గ్రామాలను దత్తత తీసుకోగా మొక్కలు నాటి వాటిని సంరక్షించడానికి దాదాపుగా రూ.12.40 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. సంగారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో 288 గ్రామాల్లో మొక్కలు నాటి సంరక్షణకు రూ.5.76 కోట్లు, జహీరాబాద్‌ డివిజన్‌లో 169 గ్రామాల్లో రూ.3.38 కోట్లు, నారాయణఖేడ్‌ డివిజన్‌లో 190 గ్రామాల్లో మొక్కలే నాటి సంరక్షించేందుకు పరిశ్రమలకు రూ.3.80 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. మొక్కలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పగా పలు పరిశ్రమలు మాత్రం తామే మొక్కలను కూడా తెచ్చుకుంటామని ముందుకు రావడం హర్షించదగ్గ విషయం.

గ్రామాలు దత్తత తీసుకున్న పరిశ్రమలు...
ఐదు విడుతల్లో పరిశ్రమల్లో కూడా హరితకార్యక్రమం నిర్వహించారు. పరిశ్రమల ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టారు. అయితే ఈసారి మాత్రం గ్రామాల్లో హరితహారం సంరక్షణ బాధ్యత పరిశ్రమలకు అప్పగించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే బుధవారం కలెక్టరేట్‌లో సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ పారిశ్రామిక వేత్తలతో ప్రత్యేక సమావేశమయ్యారు. అంతకుముందే కలెక్టర్‌ హనుమంతరావు హరితదత్తత పేరుతో మొక్కల సంరక్షణకు గ్రామాలను దత్తత తీసుకోవాలని పరిశ్రమల యాజమాన్యాలను కోరారు. ఆయన కోరిక మేరకు జిల్లాలోని ప్రధాన పరిశ్రమల యాజమాన్యాలు ప్రియాంక వర్గీస్‌ సమావేశానికి హాజరయ్యారు. గ్రామాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించి పచ్చదనాన్ని పెంపొదించాలని కోరారు. కాగా జిల్లాలోని 16 ప్రధాన పరిశ్రమలు, 25 మండలాల్లోని మొత్తం 647 గ్రామ పంచాయతీలను దత్తత తీసుకున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటి సంరక్షిస్తామని కలెక్టర్‌కు హామీ ఇచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో గ్రామాల దత్తతకు ముందుకు వచ్చిన పరిశ్రమల యాజమాన్యాలను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...