కష్టపడితే వందశాతం ఫలితాలు


Sat,June 15, 2019 12:05 AM

-ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య
-విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్నా భోజనం
-విశ్రాంత ఉద్యోగులతో ‘మేముసైతం’ కార్యక్రమం
-ఐఐటీ, ఇంజనీరింగ్‌లలో రాణించేందుకు ‘ఫోకస్‌'
-బడిబాటలో కలెక్టర్‌ హనుమంతరావు
సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ : సమాజంలో సముచిత స్థానం రావాలంటే విద్యయే ముఖ్యం.కష్టపడి చదివిన విద్యార్థులు వందశాతం సాధించడంతో పదికి పది జీపీఏ ఉత్తీర్ణత సాధిస్తారని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. శుక్రవారం సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ రవీంద్రమోడల్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో బడిబాట కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరయ్యారు. విద్యార్థులు కలెక్టర్‌ ఘనస్వాగతం పలికి పూలు చల్లారు. పాఠశాల ఆవరణలో హరితహారాన్ని నెలకొల్పాలని ఉపాధ్యాయులకు ఆదేశిస్తూ మొక్కలు నాటారు. విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు రామకృష్ణతో కలిసి పాఠశాల గదులను పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు కలెక్టర్‌కు తమ పాఠశాలకు ప్రహారీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా, వెంటనే స్పందించి సంబంధిత అధికారులు అంచనాలు తయారు చేసి పంపాలని సూచించారు.

అలాగే, అసంపూర్తిగా నిర్మాణమైన భవనాన్ని వెంటనే పూర్తి చేసి ఆచరణలోకి తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. పాఠశాలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, ఆటలకు కావాల్సిన వస్తువులను సమకూర్చాలని అధికారులకు సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముద్రించిన కరపత్రాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. పాఠశాలలో సైనికుల సంక్షేమానికి విద్యార్థులు సేకరించిన నిధులు రూ. 1250 డీడీని కలెక్టర్‌కు చిన్నారులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేసి మెరుగైన విద్యా ప్రమాణాలతో ప్రభుత్వ విద్యను అందజేసి ఉత్తమ ఫలితాలను సాధిస్తుందన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల బట్టలు, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అం దించడంతో కుటుంబంలో మాదిరిగా తోటి విద్యార్థులతో కలిసి మెలిసి పోటీపడి చదువులలో రాణించడంతో పదికి పది జీపీఏ సాధించి సత్తా చాటాలన్నారు. వందశాతం ఉత్తీర్ణత పొందిన పాఠశాలలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇస్తుందని, ఇందుకోసం ప్రతి పాఠశాల మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కష్టపడి పని చేయాలని కలెక్టర్‌ అన్నారు.

‘మేము సైతం’కు శ్రీకారం..
సుధీర్ఘకాలం ఉపాధ్యాయవృత్తిలో విద్యార్థులను చదువుల్లో తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు పదవి విరమణ పొంది సమయాన్ని వృథా చేయకుండా వారి మెరుగైన సేవలను విద్యార్థులకు అందించేందుకు ‘మేముసైతం’ కార్యక్రమాన్ని ప్రారంభించామని కలెక్టర్‌ అన్నారు. దీంతో సమీపంలోని పాఠశాలల్లో విరమణ ఉపాధ్యాయులు ఖాళీ సమయాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించడానికి అన్ని వసతులు కల్పిస్తామన్నారు. సమయపాలన, క్రమశిక్షణ, ఆటల సమయాల్లో విద్యార్థులను చదువులతో పాటు వివిధ రంగాల్లో రాణించేందుకు విరమణ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.

పోటీ పరీక్షలకు ‘ఫోకస్‌'
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతిలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులను తీసుకుని వారికి సంగారెడ్డిలో ప్రత్యేక బోధనతో పాటు పోటీ పరీక్షలలో రాణించేందుకు ‘ఫోకస్‌' అనే కార్యక్రమాన్ని చేపట్టామని కలెక్టర్‌ వివరించారు. హైదరాబాద్‌ నుంచి విషయ పరిజ్ఞానం కలిగిన నిపుణులను తీసుకొచ్చి సలహాలు, సూచనలు ఇప్పించి ఐఐటీ, ఇంజినీరింగ్‌ లాంటి పోటీ పరీక్షల్లో రాణించి సీట్లు సాధించేలా తయారు చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. రవీంద్రమోడల్‌ పాఠశాలలో పదికి పదిశాతం జీఏపీ సాధించడంతో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, మండల విద్యాధికారి అంజయ్యను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. బడిబాట కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పట్నం విజయలక్ష్మి, జడ్పీటీసీ సంగమేశ్వర్‌, తహసీల్దార్‌ రాంరెడ్డి, సెక్టోరియల్‌ అధికారి మంగీలాల్‌, విజయ్‌కుమార్‌, ఆర్‌ఐ హరీశ్‌తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...