వామ్మో జూన్


Fri,June 14, 2019 12:38 AM

-మధ్యతరగతి కుటుంబాలకు దడ పుట్టించే మాసం
-పెరిగిన పుస్తకాలు, యూనిఫామ్‌లు, స్టేషనరీ ధరలు
-తల్లిదండ్రుల్లో మొదలైన గుబులు
-తడిసి మోపెడవుతున్న స్కూల్ భారం
పెట్టుబడుల కాలం ముంచుకొచ్చింది..
పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే తమ పాఠశాలల ప్రత్యేకతలకు మరిన్ని హంగులు జోడించి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకర్షించేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొద్దిపాటి పేరు ప్రఖ్యాతలు ఉన్న పాఠశాలలు, గత విద్యాసంవత్సరం కన్నా ఈ ఏడాది మరింతగా ఫీజులను పెంచి విద్యార్థులకు ప్రవేశాలను కల్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుని ఇప్పటికే వివరాలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. సాధారణ పాఠశాలలు మాత్రం ఉన్న ఫీజులను యథావిధిగా కొనసాగిస్తూ పుస్తకాలు, డ్రెస్సులు, తదితరాల నుంచి లాభాలను పొందేందుకు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో తమ పిల్లలకు పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన డబ్బులు సమకూర్చుకునే ప్రయత్నాలల్లో తల్లిదండ్రులు ఉన్నారు. అవసరమైతే అప్పులు చేసైనా తమ పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించేందుకు వెనుకాడటం లేదు.

జోరుగా ప్రచారం..
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. పదోతరగతి ఫలితాలతో కొన్ని పాఠశాలలు ప్రచారం నిర్వహిస్తుండగా మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలల్లో ఉన్న ప్రత్యేకతలను చాటుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఆకర్షణీయమైన రంగులల్లో తమ ప్రత్యేకతలను చాటుతూ కరపత్రాలను రూపొందించి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

అన్ని పాఠశాలల్లోనే..
ప్రైవేట్ పాఠశాలలో చేరే విద్యార్థులు పెన్సిల్, రబ్బర్ నుంచి యూనిఫాం వరకు ప్రతీది పాఠశాలల్లోనే కొనే విధంగా ఆయా పాఠశాలల యాజమాన్యాలు చర్యలు చేపట్టాయి. పాఠశాలలో విద్యాబోధన మినహా మిగతా వ్యాపారాలు జరుగకూడదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ వారి వారి మార్గాలల్లో విద్యార్థులకు అవసరమైన వస్తువులను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మార్కెట్‌లో లభించే ధరలకన్నా అధికంగా ధరలను ముద్రించి విక్రయాలు చేస్తూ లాభాలను గడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

నిబంధనలకు తూట్లు..
స్కూల్ ఫీజుల కట్టడి, ఇబ్బడి ముబ్బడి వసూళ్లు, పేద దళిత విద్యార్థులకు ఉచిత విద్య లాంటివి విద్యాహక్కు చట్టంలో పొందుపర్చి ఉన్నా అది ఎక్కడా అమలు జరుగుతున్న దాఖలాలు లేవు. రేకుల షెడ్డుల్లో తరగతి గదులు, క్రీడా ప్రాంగణాలు లేకపోవడం, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు మూత్రశాలలు లేకపోవడం, మరుగుదొడ్లు లేకపోవడం, సరైన వసతులు కల్పించకపోవడం, కనీసం తాగునీరు సరఫరా చేయలేని పాఠశాలలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సమస్యలు అనేకం కనిపిస్తున్నప్పటికీ ఆర్భాటంగా చేసే తప్పుడు ప్రచారంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక విధానం (అడ్మిషన్ టెస్టు) నిర్వహించరాదు. ఇలా చేస్తే మొదటి తప్పునకు రూ.25 వేలు ఆ తర్వాత ప్రతి సారి తప్పునకు రూ.50 వేల చొప్పున జరిమానా విధించవచ్చు. పాఠశాలలో ప్రవేశం పొందిన పిల్లలను ఆదే తరగతిలో మళ్లీ కొనసాగించడం, పాఠశాల నుంచి తీసివేయడం నిషిద్ధం. ఫీజుల నియంత్రణ పై అధికారులు దృష్టి సారించకపోవడంతో తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీలను ఏర్పాటు చేసి ఫీజులను నియంత్రించాల్సి ఉండగా ఏ పాఠశాలల్లోను అలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో ప్రైవేట్ యజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తు దండుకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అందరికీ అందుబాటులో ఫీజులు ఉండేలా చర్యలు చేపట్టాలని మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

జూన్ అంటేనే భయం..
పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో జూన్ నెల అంటేనే విద్యార్థుల తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ఈ మాసం పిల్లల తల్లిదండ్రులకు చదివింపులు, అప్పుల మాసంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పుల కోసం పరిచయస్తులు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. కొందరు ముందస్తు ప్రణాళికతో ఒక కటుంబంలో ఇద్దరు పిల్లలు కార్పొరేట్ పాఠశాలలో చదువాలంటే వారికి రూ.60 నుంచి రూ.80వేల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఒలంపియాడ్, ఏయిర్ కండీషన్స్ స్కూల్ అయితే ఈ ఖర్చు రెండింతలు అవుతుంది. కనీసం రెండు మూడు జతల యూనిఫాం, టైలరింగు ఖర్చులతో పాటు పుస్తకాలు, రెండు జతల షూస్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటిని బయటి మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తున్నా కొన్ని పాఠశాలలు తమ పాఠశాలల్లోనే అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. అధిక ధరలకు అయినా పాఠశాలలనే కొనాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇలా ఫీజులతో పాటు అన్ని ఖర్చులు లెక్కేస్తే సగటు దిగువ మధ్యతరగతి కుటుంబం జూన్ బడ్జెట్ తడిసి మోపెడు
అవుతున్నది.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...