మరో టీఎంసీ


Fri,June 14, 2019 12:34 AM

తొగుట: సముద్రంలో వృథాగా కలుస్తున్న గోదారమ్మ నీళ్లను సద్వినియోగం చేసుకోవడానికి సీఎం కేసీఆర్ మరో ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక టీఎంసీ నీళ్ల కోసం సొరంగ మార్గం ద్వారా నిర్మాణ పనులు పూర్తి కావస్తుండగా, దానికి అనుసంధానంగా కాలువ, పైప్‌లై న్ ద్వారా మరో టీఎంసీ నీళ్లను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గోదావరి నీళ్లను ఎక్కువ స్థాయిలో వినియోగించుకోవడమే లక్ష్యంగా కాలువ నిర్మాణం చేపట్టనున్నారు. గో దావరి నుంచి నాలుగు నెలలు మాత్రమే నీళ్లను తీసుకునే అవకాశం ఉండడంతో, ఇప్పటికే పూర్తవుతున్న సొరంగ మార్గం ద్వారా ఒక టీఎంసీ నీళ్లకు తోడు మరో టీఎంసీ నీళ్లను తీసుకెళ్తే, సాగు, తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు పుష్కలంగా నీళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఉద్దేశంతోనే మిడ్ మానేరు నుంచి మల్లన్న అనంతగిరి రిజర్వాయర్ మీదుగా మల్లన్నసాగర్ వరకు మూడు పంప్ హౌస్‌ల ద్వారా పైప్‌లైన్, గ్రావిటీ ద్వారా నీళ్లు అందించడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నది. అనుకున్న మేరకు పనులు కొనసాగితే, మరో 18 నెలల్లో అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే కాలువల కోసం భూసేకరణపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు.

నిర్మాణం ఇలా..
సొరంగ మార్గం ద్వారా నిర్మించిన పైప్‌లైన్‌కు అనుసంధానంగా మిడ్ మానేరు నుంచి సిరిసిల్ల మండలం వల్లంపట్ల, వెల్జీపూర్, రహీంఖాన్‌పేట, అనంతారం, తిప్పాపూర్ నుంచి అనంతగిరి రిజర్వాయర్‌లోకి నీళ్లను మళ్లీస్తారు. అక్కడి నుంచి ఎల్లాయపల్లి, విఠలాపూర్, మాచాపూర్, చంద్లాపూర్, రామం చ, పుల్లూరు, చిన్నగుండవెల్లి, బూర్గుపల్లి, ఇర్కోడు, వెంకటాపూర్, ఎన్సాన్‌పల్లి, తడ్కపల్లి, బండారుపల్లి మెట్టు, ఘనపూ ర్, ఎల్లారెడ్డిపేట, తుక్కాపూర్ వద్ద పంప్‌హౌస్ వరకు నిర్మా ణం చేపట్టనున్నారు. మిడ్ మానేరు నుంచి పూర్తి స్థాయిలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం నీళ్లు రావడానికి గ్రావిటీ ద్వారా పూర్తిస్థాయిలో వచ్చే అవకాశం ఉండకపోవడంతో అందుకు మూడు ప్రాంతాల్లో పంప్‌హౌస్‌లు నిర్మించనున్నారు. సిరిసిల్ల మండలం వెల్జీపూర్, చిన్నకోడూరు మండలం ఎల్లాయపల్లి, తొగుట మండలం తుక్కాపూర్ వద్ద పంప్‌హౌస్‌లు నిర్మించనున్నారు. పంప్‌హౌస్ నుంచి ఎత్తు ప్రాంతాల వరకు పైప్‌లైన్ ద్వారా అక్కడి నుంచి పంప్‌హౌస్ వరకు కాలువ ద్వారా గ్రా విటీ రూపేనా నీళ్లను మళ్లిస్తారు. కాలువ ద్వారా నిర్మాణం కో సం 300-100 మీటర్ల వెడల్పుతో భూ సేకరణ చేయనున్నా రు. ఇప్పటికే భూ సేకరణ కోసం రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. భూసేకరణ అనంతరం పనులు చేపట్టనున్నారు. 18 నెలల్లో పనులు పూర్తి చేసేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అనంతగిరి ప్రాజెక్టులో 3.5, రంగనాయక సాగర్‌లో 3, మల్లన్న సాగర్‌లో 50, కొండపోచమ్మ ప్రాజెక్టు లో 21 టీఎంసీల నీళ్లు నిల్వ చేయనున్నారు. అలాగే, వీటిలో నీటిని నిల్వ చేయడంతో పాటు ఉమ్మడి మెదక్, నల్గొండ, వరంగల్, కామారెడ్డితో పాటు పలు జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చనున్నారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...