హరితదత్తతను విజయవంతం చేయాలి


Wed,June 12, 2019 11:49 PM

- గ్రామ, మండల అధికారులతోసీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్
-పరిశ్రమలకు పూర్తి సహకారమందిస్తాం
సంగారెడ్డి చౌరస్తా: జిల్లాలో హరితహారం, హరితదత్తత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన గ్రామ, మండల స్థాయి అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగు విడుతల హరితహారం పూర్తయిందని గుర్తుచేశారు. ఐదో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. హరితహారం కింద జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలలో రోడ్డుకిరువైపులా మొక్కలు నాటడం ద్వారా పచ్చదనంతో ఆ రోడ్లు స్వాగతం పలకాలన్నారు. వచ్చే హరితహారంలో మూడు కోట్ల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించినందున అధికారులందరూ కృతనిశ్చయంతో పని చేయాలన్నారు.

హరిత దత్తతకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం...
సంగారెడ్డి చౌరస్తా: జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా పరిశ్రమలు హరితదత్తత కోసం ముందుకు రావాలని, వారికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అన్ని విధాల సహకరిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన హరితహారం, హరిత దత్తత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రియాంక వర్గీస్ కలెక్టర్ హనుమంతరావు, జేసీ నిఖిలతో కలిసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓఎస్‌డీ మాట్లాడుతూ హరితహారం 4 ఏళ్లు ముగించుకుని ఐదో వసంతంలోకి అడుగుపెడుతున్నదని తెలిపారు. వచ్చే హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో విహయవంతం చేయాలని ఆమె పారిశ్రామికులను కోరారు.

హరిత దత్తత కార్యక్రమం చాలా గొప్ప సంకల్పమని, హరిత ఉద్యమం కొనసాగాలని, హరితహారంలో పాల్గొనే వారికి జిల్లా స్థాయి అధికారుల నుంచి గ్రామస్థాయి అధికారుల వరకు అందరి పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. దత్తత తీసుకొన్న వారికి గ్రామాలలో మొక్కలను నాటి వాటికి కంచె వేయడంతో పాటు నీరు పోసి సంరక్షించే బాధ్యత పారిశ్రామిక వేత్తలదే అని స్పష్టం చేశారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందున నాటిన మొక్కలు వచ్చే ఏడాది వరకు చెట్లుగా ఎదుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా మొత్తం పచ్చదనంతో నిండిపోవాలని చెప్పారు. వచ్చే ఏడాది పచ్చదనంలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలువాలని ఆమె ఆకాంక్షించారు. అంతకు ముందు జిల్లాలోని మున్సిపాలిటీలు, 25 మండలాల్లో హరితహారంలో భాగస్వాములు అయ్యేందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తలకు ఆయా మండలాలను కేటాయించారు.

స్వచ్ఛందంగా పాల్గొనాలి...
కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 647 గ్రామాలు, అన్ని మున్సిపాలిటీలలో పచ్చదనం పూర్తిగా పెంచాలన్నారు. గ్రామాల్లోకి ప్రవేశించగానే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు స్వాగతం పలుకాలని సూచించారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం మన బాధ్యత అని కలెక్టర్ గుర్తు చేశారు. వర్షాకాలంలో మొక్కలు పెంచాలని పేర్కొన్నారు. ఖాళీ ప్రదేశంలో మొక్కలను విరివిరివిగా నాటాలని, వాటిని పరిరక్షించుకునే బాధ్యత మన అందరిపై ఉన్నదని కలెక్టర్ పేర్కొన్నారు.

అయితే జిల్లాలో హరితదత్తతలో పాల్గొనే పారిశ్రామికవేత్తలకు వారికి కేటాయించిన మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాలలో దత్తత తీసుకునే వారి పనితీరుపై ప్రభుత్వం ఒక కమిటీ వేసి పర్యవేక్షిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో తిరిగి మూడు ఉత్తమ మండలాలు, లేదా మున్సిపాలిటీలను ఎంపిక చేసి వారికి ఆగస్టు 15న సన్మానం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం హరితదత్తతకు ముందుకు వచ్చిన జిల్లాలోని ఆయా పరిశ్రమల ప్రతినిధులను ఓఎస్‌డీ ప్రియాంకవర్గీస్, కలెక్టర్ హనుమంతరావులు శాలువా, పూలమొక్కలతో సన్మానించారు. ఆ తరువాత కలెక్టర్ అందరిచే హరితహారం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జేసీ నిఖిల డీఆర్డీవో శ్రీనివాసరావు, కాలుష్య నియంత్రణ అధికారి భద్రగిరీశ్, డీపీవో వెంకటేశ్వర్లు, డీఎఫ్‌వో వెంకటేశ్వర్లు, ఆయా శాఖల అధికారులు, జిల్లాలోని వివిధ పరిశ్రమల యజమానులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

జడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యేకు సన్మానం...
నూతనంగా ఎంపికైన జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జడ్పీటీసీ రమేశ్, ఎంపీపీ బాలయ్యలను జోగిపేట ఆర్యవైశ్య సంఘం, మహిళ సంఘాల ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం మహిళ విభాగం అధ్యక్షురాలు గొలి పద్మ, ఉపాధ్యక్షురాలు మదిరె చందన, కోశాధికారి పోల అనిత, సభ్యురాలు శోభ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...