రైతుల ఖాతాల్లో రైతుబంధు


Tue,June 11, 2019 11:28 PM

-ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెరిగిన మొత్తం
-జిల్లాలో 2,87,079 మంది రైతులకు వర్తింపు
-సర్కార్ వెచ్చించనున్న మొత్తం రూ.371 కోట్లు
-ట్రెజరీల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ
-ట్రెజరీలకు చేరిన 89,873 మంది రైతుల డాటా
-40వేల మంది ఖాతాల్లోకి డబ్బులు...
-హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం
సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: పంటల సాగు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలబడుతున్నది. పెట్టుబడి సాయాన్ని అందిస్తూ రైతుకు భరోసా ఇస్తున్నది. ఈ వానకాలానికి సంబంధించిన పెట్టుబడి సాయం పంపిణీ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ట్రెజరీల ద్వారా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమచేస్తున్నారు. మంగళవారం వరకు దాదాపు 40 వేల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయి కూడా. జిల్లాలో మొత్తం 2.87 లక్షల మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులు కాగా వీరందరికీ సర్కారు రూ.371 కోట్లు పెట్టుబడి సాయం కింద అందించనున్నది. పెద్ద మనుసుతో సర్కారు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని తీసుకుంటున్న రైతులకు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని దీవెనలు అందిస్తున్నది. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినవి వచ్చినట్లుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు నమస్తే తెలంగాణ ప్రతినిధితో వెల్లడించారు.

రైతులకు అందనున్న రూ.371 కోట్లు...
రైతు బంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని రైతులందరికీ మొత్తం రూ.371 కోట్లు అందించనున్నది. జిల్లాలో మొత్తం 2,87,079 మంది రైతులకు ఈ పథకం వర్తించనున్నది. ఎకరాకు రూ.5 వేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అంత మొత్తాన్ని ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందించనున్నది. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.371.300 కోట్లు వెచ్చించనున్నది. ఇప్పటి వరకు ఏఈవోలు 89,873 రైతుల ఖాతాలను ట్రెజరీలకు అందించారు. ట్రెజరీల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమచేస్తున్నారు. మంగళవారం వరకు జిల్లాలో దాదాపుగా 40 వేల మంది వరకు రైతులకు పెట్టుబడి సాయం అందినట్లు వ్యవసాయశాఖ అధికారుల చెబుతున్నారు. రెండు రోజుల్లో మరో 40 వేల మంది ఖాతాల్లో డబ్బులు జమ ఖానున్నాయి. సాధ్యమైనంత త్వరగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కాగా పెట్టుబడి సాయం పొందుతున్న రైతులు సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నారు.

రూ.5 వేలకు పెరిగిన మొత్తం....
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి రైతు బంధు పథకాన్ని ప్రారభించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరిరీ ఈ పథకం ద్వారా ఎకరాకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించారు. గత ఏడాది యాసంగి, వాన కాలం రెండు పంటలకు పెట్టుబడి సాయం అందించడంతో రైతులంతా సంతోషపడ్డారు. కాగా పెట్టుబడి సాయం మొత్తాన్ని ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు సర్కారు పెంచిన మొత్తంతో పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేస్తున్నది. ఈ వానకాలానికి సంబంధించి రైతుల ఖాతాల్లోకి డబ్బుల జమ కార్యక్రమాన్ని మొదలైంది. ఎకరాకు రూ.5 వేల చొప్పున ఎన్ని ఎకరాలుంటే అంతా మొతాన్ని రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు.

ఏఈవోలదే కీలక పాత్ర...
రైతుబంధు పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడంతో వ్యయసాయ విస్తరణ అధికారులే కీలక పాత్ర పోషిస్తున్నారు. రైతులకు సంబంధించి భూమి, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు అకౌంట్ ఇతర వివరాలను ఏఈవోలు సేకరిస్తున్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పక్కాగా సేకరించిన సమాచారాన్ని ట్రెజరీలకు అందిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులను ట్రెజరీల నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 100 వరకు ఏఈవోలు ఉన్నారు. ఒక్కొక్కరు రోజువారీగా 250 నుంచి 300 మంది డాటాను పొందుపరుస్తున్నారు. ఈ లెక్కన రోజువారీగా 25 వేల నుంచి 30 వేల మంది రైతుల డాటా ట్రెజరీలకు అందుతున్నది. వాటి ఆధారంగా డబ్బులు జమ చేస్తున్నారు.

విడుతల వారీగా జమ చేస్తున్నాం...
ప్రభుత్వం నుంచి విడుతల వారీగా నిధులు వస్తున్నాయి. విడుతల వారీగా ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో వాటిని జమ చేస్తున్నాం. ఏఈవోలు రోజు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు దాదాపుగా 40వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ట్రెజరీలకు డాటా అందించిన వెంటనే అక్కడి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తాయి. ఎక్కడ పొరపాట్లు జరుగకుండా పకర్బందీగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నాం.
- నర్సింహారావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...