టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు


Sun,May 26, 2019 11:12 PM

సంగారెడ్డి రూరల్: ఎన్నికల్లో అటు జహీరాబాద్ ఇటు మెదక్ పార్లమెంట్ అభ్యర్థులు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌లు భారీ మెజార్టీతో గెలిచారు. కాగా మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన కొత్త ప్రభాకర్‌రెడ్డి మూడు లక్షల పైచిలుకు మెజార్టీతో గెలువడంతో స్థానిక నాయకుల్లో ఆనందోత్సాహాలు మొదలయ్యాయి. అయితే మరికొద్ది రోజుల్లో వెలువడనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపు ఖాయమైపోయిందంటూ ఆ పార్టీ శ్రేణులు గట్టి ధీమాతో ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పోల్చుకుంటూ ఇక్కడి ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్ అభ్యర్థులకే పట్టం కడుతారని ధీమాతో ఉన్నట్లు సమాచారం. కొంతమంది నాయకులైతే ఏకంగా సంబురాలకే సిద్ధమవుతున్నారు. ఎలాగూ ఎంపీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టిన ప్రజలు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూడా తమను గెలిపిస్తారని ఫుల్ జోష్‌తో ఉన్నారు.
కొద్దిరోజుల్లో తేలనున్న భవితవ్యం...
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది మరికొద్ది రోజుల్లో తేలనున్నది. తొలుత ఈనెల 27వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం. మరికొద్దిరోజులు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా ఫలితాలు విడుదలయ్యే తేదీని ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా సంగారెడ్డి మండలంలో మొత్తం 7 ఎంపీటీసీ స్థానాలకు, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. అలాగే కంది మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. సంగారెడ్డి మండలం జడ్పీటీసీ స్థానానికి గాను టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సునీతా మనోహర్‌గౌడ్ పోటీ చేయగా, కంది మండల జడ్పీటీసీ స్థానానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండల్‌రెడ్డి పోటీ చేశారు. ఇప్పటికే ఇద్దరు నాయకులు గెలుపు తమదేననే నమ్మకంతో ఉన్నారు. వీరితో పాటు రెండు మండలాల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన ఎంపీటీసీ అభ్యర్థులు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారని గులాబీ శ్రేణులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్నికల్లో ఎవరు గెలిచి నిలుస్తారో 27న తేటతెల్లకానున్నది.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...