బిరబిరా.. శరవేగంగా కొండపోచమ్మ రిజర్వాయర్ పనులు


Sun,May 26, 2019 12:02 AM

-15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
-తుది దశకు 15.8 కిలోమీటర్ల కట్ట నిర్మాణం
-త్వరలోనే బీడు భూముల్లో గోదావరి జలాలు
-ఐదు జిల్లాల వరప్రదాయినిఈ జలవనరు
-2,85,280 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
-ఉమ్మడి మెదక్‌తో పాటు యదాద్రి భువనగిరి,మేడ్చల్ జిల్లాలకు ప్రయోజనం
-ఆనందంలో కర్షక లోకం

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఐదు జిల్లాల వరప్రదాయిని కొండపోచమ్మ రిజర్వాయర్ పనులు బిరబిరా సాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మిస్తున్న ఈ జలవనరు పనులు రికార్డు స్థాయిలో నడుస్తున్నాయి. దాదాపు బండ్ నిర్మాణాలు పూర్తి కావొచ్చాయి. 4,636 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వాయర్ నిర్మిస్తుండగా, 15.8 కిలోమీటర్ల వలయాకార కట్ట పనులు తుది దశకు చేరాయి. గ్రావిటి కెనాల్, ప్రధాన కాలువ, పంపుహౌస్‌లు, స్లూయిస్(ప్రధాన గేటు) పనులు వేగంగా జరుగుతున్నాయి. బీడు భూముల్లో గోదారి జలాలు పారించి, సస్యశ్యామలం చేయాలని సంకల్పించిన సీఎం కేసీఆర్, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌తో ఐదు జిల్లాలకు ప్రయోజనం కలుగనున్నది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, యదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చనున్నది. ఇన్నాళ్లు బోరుబావులు, వర్షాధారంపై ఆధారపడి పంటలను పండించిన రైతులకు ఇక మేలు జరుగనున్నది.

ఇన్నేండ్లు బోరుబావులు, వర్షాధారంపై ఆధారపడి పంటలను పండించిన రైతులకు ఇక మంచిరోజులు రానున్నాయి.బీడు భూముల్లో గోదావరి జలాలు పారించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌తో ఐదు జిల్లాలకు ప్రయోజనం కలుగనున్నది. మర్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్ పనులను రికార్డు స్థాయిలో పూర్తిచేస్తున్నారు. దాదాపు బండ్ నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. రిజర్వాయర్‌ను 4,636 ఎకరాల విస్తీర్ణంలో 15.8 కిలోమీటర్ల వలయాకారంలో కట్ట నిర్మాణం చేపట్టి తుది దశకు తీసుకొచ్చారు. దీని నీటి నిలువ సామ ర్థ్యం 15 టీఎంసీలు. జిల్లాలోని అనంతగిరి రిజర్వాయర్ నుంచి రంగనాయక్ సాగర్ రిజర్వాయర్‌ను నింపుతారు. అక్కడి నుంచి మల్లన్న సాగర్‌కు రిజర్వాయర్ పూర్తి కాకున్న కాల్వల ద్వారా సుమారు 22 కి.మీ దూరం గ్రావిటి కెనాల్ ద్వారా కొండ పోచమ్మను నింపుతారు. ప్రధాన కాల్వల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేశారు. ఐదు జిల్లాల వరప్రదాయిని అయిన ఈ రిజర్వాయర్‌ను నిర్మించడానికి కట్టను రెండు రిచ్‌లుగా విభజించారు. మొదటి రీచ్‌ను 0.00 నుంచి 5.500 వరకు ఒక ఏజెన్సీ, రెండో రీచ్ 5.500 నుంచి 15.800 వరకు మరో ఏజెన్సీ దక్కించుకుంది. కాగా, రెండో రీచ్ దక్కించుకున్న ఏజెన్సీ మరో ఇద్దరిని భాగస్వాములను చేసుకుని జాయింట్‌గా పని చేస్తున్నారు. బండ్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. మొత్తంగా బండ్ నిర్మాణంలో భాగంగా అక్కడి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా గ్రౌండ్ లెవల్‌లో, వెడల్పులో తేడాలున్నప్పటికీ, కట్ట చివరి పైభాగంలో మాత్రం అంతా ఒక్కే తీరుగా 6 మీటర్లు ఉంటుంది. ఎక్కడా కూడా నాణ్యత లోపించకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. కాగా, ఉమ్మడి మెదక్ జిల్లాలోని 59 గ్రామాల మీదుగా 127 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ నిర్మాణానికి గత జనవరి మాసంలో రూ.1,326 కోట్ల పరిపాలన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.

ఐదు జిల్లాల వరప్రదాయిని కొండపోచమ్మ
కొండపోచమ్మ రిజర్వాయర్ ఐదు జిల్లాల వరప్రదాయిని. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను కొండ పోచమ్మ తీర్చనున్నది. ఈ ఐదు జిల్లాలో కలిపి మొత్తం 2,85,280 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే లక్షా 50వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. 15.8 కి.మీ వలయాకారంలో నిర్మాణం అవుతున్న కట్ట నుంచి మూడు పాయింట్ల వద్ద కెనాల్స్‌కు నీటిని పంపింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు పంపుహౌస్‌లు నిర్మాణం అవుతున్నాయి. ఒకటి అక్కారం, రెండోది మర్కూక్‌ల వద్ద నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికే పంపుహౌస్‌ల నిర్మాణం చివరిదశకు వచ్చింది. మూడు ప్రధాన స్లూయిస్ ఉంటాయి. వీటిలో ఒకటి సంగారెడ్డి ప్రధాన కెనాల్ దీనికి (కట్ట)1.775 వద్ద లింకును , రెండోది కేశవపూరు కెనాల్ దీనికి (కట్ట) 9.900 వద్ద లింకును, మూడవది జగదేవ్‌పూర్ కెనాల్ దీనికి (కట్ట) 6.9 వద్ద లింకును ఏర్పాటు చేస్తున్నారు. సంగారెడ్డి కెనాల్ నుంచి సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు నీటిని పంపిస్తారు. జగదేవ్‌పూర్ కెనాల్ నుంచి యాదాద్రి జిల్లాకు పంపింగ్ చేస్తారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట వద్ద నిర్మిస్తున్న కేశవపూర్ రిజర్వాయర్‌కు 10 టీఎంసీల నీటిని పంపింగ్ చేస్తారు. ఈ రిజర్వాయర్ నుంచి జంటనగరాలకు కూడా తాగునీరు అందిస్తారు.

2,85,280 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
ఈ రిజర్వాయర్ కింద ఐదు జిల్లాలోని 26 మండలాల్లోని 2,85,280 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గానికి 94,543, దుబ్బాక నియోజకవర్గానికి 42,796, యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి 35,543, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గానికి 35,593, మెదక్ నియోజకవర్గానికి 17,691, సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి నియోజకవర్గానికి 31,033, పటాన్‌చెరు నియోజకవర్గానికి 10,211, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గానికి 17,865 ఎకరాలకు సాగునీరు అందనున్నది. కాగా, ఆయా నియోజకవర్గాలకు నీటిని తీసుకవెళ్లడానికి 9 ప్రధాన కాల్వల నిర్మాణం పనులు చేపట్టి శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వీటిలో రామాయంపేట, గజ్వేల్, ఉప్పరపల్లి, కిష్టాపూర్ , తుర్కపల్లి, జగదేవ్‌పూర్, తుర్కపల్లి (యం), శంకరంపేట, సంగారెడ్డి ఉన్నాయి.

180
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...