మెతుకు సీమ గులాబీ తోట


Sat,May 25, 2019 12:26 AM

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఉద్యమాల గడ్డ.., మెతుకు సీమగా పేరుగాంచిన ఉమ్మడి మెదక్ జిల్లాలో గులాబీ ప్రభంజనం కొనసాగించింది. ప్రజలంతా పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టినట్లు మరోసారి రుజువు చేశారు. పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిదింటా టీఆర్‌ఎస్ గాలే వీచింది. ఒక్క జహీరాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఊహించని విధంగా ఓట్లు తగ్గాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అధిష్ఠానం పోస్టుమార్టం ప్రారంభించింది. కాగా, ఉమ్మడి జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటాన్‌చెరు, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఒక్క జహీరాబాద్ మినహా అన్నిచోట్ల నుంచి టీఆర్‌ఎస్‌కు మెజార్టీ వచ్చింది. కాగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు జనం నీరాజనం పలికారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న సంగారెడ్డిలో కూడా టీఆర్‌ఎస్ బలపడడం గమనార్హం. మొత్తంగా టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన అనుకూల ఫలితాలు రావడంతో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు.

తొమ్మిది నియోజకవర్గాల్లో కారుజోరు..
ఉద్యమాల గడ్డ ఉమ్మడి మెతుకు జిల్లాలో మరోసారి టీఆర్‌ఎస్ తన ప్రభంజనాన్ని కొనసాగించిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. మెదక్ పరిధిలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అంతటా టీఆర్‌ఎస్‌కు మంచి మెజార్టీ రావడం గమనార్హం. శాసనసభ ఎన్నికల నాటితో పోల్చితే సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ బలపడింది. శాసన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి 2589 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి కాంగ్రెస్‌కు 49719 ఓట్లు రాగా టీఆర్‌ఎస్‌కు 62090 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌కు 12371 మెజార్టీ వచ్చింది. గజ్వేల్ నుంచి అత్యధికంగా 84187, సిద్దిపేట నుంచి 48051, దుబ్బాక నుంచి 61933, నర్సాపూర్ నుంచి 49884, పటాన్‌చెరు నుంచి 35486, మెదక్ నుంచి 24476 టీఆర్‌ఎస్‌కు మెజార్టీ వచ్చింది. అన్నిచోట్ల నుంచి మొత్తం ఓట్లలో 52శాతం టీఆర్‌ఎస్‌కే రావడంతో పార్టీ శ్రేణులంతా సంతోషంగా ఉన్నారు. పార్టీ నేతలను సమన్వయ పరిచి, మెజార్టీ సాధించడంతో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషి ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లా పరిధిలోని జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల నుంచి కూడా టీఆర్‌ఎస్‌కు 9 వేలకు పైచిలుకు ఓట్ల మెజార్టీ వచ్చింది.

జహీరాబాద్.. పోస్టుమార్టం..
ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒక్క జహీరాబాద్ నియోజకవర్గంలోనే టీఆర్‌ఎస్‌కు ఓట్లు తగ్గడం ఆ పార్టీలో చర్చనియాంశంగా మారింది. ఐదు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగగా ఇంతలోనే ఫలితాలు తారుమారు కావడంపై చర్చ జరుగుతున్నది. శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే మాణిక్‌రావుకు 96538 ఓట్లు వచ్చాయి. ఆయన 34473 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి టీఆర్‌ఎస్‌కు ఓట్లు భారీగా తగ్గిపోయాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 59799 ఓట్లు, కాంగ్రెస్‌కు 83358 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కంటే 23559 ఓట్లు టీఆర్‌ఎస్‌కు తగ్గిపోయాయి. శాసన ఎన్నికలతో పోల్చితే 36793 ఓట్లు తగ్గడంపై పార్టీ అధిష్ఠానం ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే పార్టీ అధిష్ఠానం పోస్టుమార్టం చేపట్టింది. స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పుంజుకోవడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ప్రచారం సరిగ్గా చేయలేకపోయామా..? కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేశామా..? అని స్థానిక నేతలు ఎవరికి వారు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు పెద్దగా ప్రచారం చేయలేదు..? అయినా టీఆర్‌ఎస్‌తో పోటీ పడ్డారు..? ఇందులో పార్టీ నేతల వైఫల్యం ఏ మేరకు ఉన్నదనే అంశాలపై టీఆర్‌ఎస్ పెద్దలు పోస్టుమార్టం చేపట్టారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...