చీకటిని పారదోలిన హైమాస్టు బల్బులు


Sat,May 25, 2019 12:18 AM

-ఎంపీ బీబీ పాటిల్ చొరవతో తీరిన ఇబ్బందులు
- హర్షం వ్యక్తం చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు
కోహీర్ : గ్రామాల్లోని అంధాకారాన్ని తొలిగించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నది. రాత్రుల్లో చిమ్మచీకట్లకు స్వస్తి పలికి ప్రజల కండ్లలో వెలుగులు నింపుతున్నది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ చొరవతో మండలంలోని పలు గ్రామాల్లో హైమాస్టు లైట్లను ఏర్పాటు చేశారు. తమ గ్రామంలో లైట్లు లేక చిమ్మ చీకట్లు అలముకుంటున్నాయని ఎంపీ దృష్టికి తెచ్చిన వెంటనే వాటి మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మండల కేంద్రంతో పాటు కవేలి, రాజనెల్లి, మద్రి, గురుజువాడ, పీచెర్యాగడి, సజ్జాపూర్, ఖానాపూర్, పైడిగుమ్మల్, మనియార్‌పల్లి, తదితర గ్రామాల్లో హైమాస్టు లైట్లను ఏర్పాటు చేయించారు. బడంపేట రాచన్నస్వామి ఆలయ ఆవరణలో కూడా లైట్లను బిగించారు. కోహీర్‌లోని మెథడిస్టు చర్చితో పాటు అంబేద్కర్ చౌరస్తా, పాత బస్తాండు, పైడిగుమ్మల్ రోడ్డు వద్ద లైట్లను ఏర్పాటు చేయించారు. ఒక్కో హైమాస్టు లైటు విలువ లక్ష రూపాయల వరకు ఉంటుంది. టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, నాయకులు ఎంపీ బీబీ పాటిల్‌ను అడిగిన వెంటనే ఆయా గ్రామాల అవసరార్ధం కేటాయించారు. కవేలిలో హనుమాన్ మందిరం, చర్చి, దర్గా వద్ద మూడు లైట్లను అమర్చారు. దీంతో అక్కడికి వెళ్లిన ప్రతిఒక్కరి కండ్లలో కాంతి వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో వాటిని ఏర్పాటు చేయడంతో చాలా దూరం వరకు హైమాస్టు బల్బుల వెలుగు అగుపిస్తున్నది. గతంలో కొన్ని గ్రామాల్లో లైట్లు లేక రాత్రి వేళల్లో చీకట్లతో అనేక ఇబ్బందులు పడ్డారు. కొత్తూర్, ఖానాపూర్ తదితర గ్రామాల పర్యటనకు వచ్చిన ఎంపీ బీబీ పాటిల్ దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లారు. అందుకు స్పందించిన ఎంపీ తన ప్రత్యేక నిధులతో హైమాస్టు లైట్లను మంజూరు చేయించారు. దీంతో ప్రధాన కూడళ్లతో పాటు వీధి దీపాలు లేని ప్రాంతాల్లో కూడా వాటిని ఏర్పాటు చేయించారు. మొత్తానికి అడిగిన వెంటనే తమ గ్రామాలకు హైమాస్టు లైట్లను మంజూరు చేసినందుకు వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...