భారీగా చెక్‌డ్యాంల నిర్మాణం


Wed,May 22, 2019 11:28 PM

వెల్దుర్తి: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీరు వృథా పోకుండా భారీగా చెక్‌డ్యాంలను నిర్మించనున్నట్లు ఇరిగేషన్ ఎస్‌ఈ అనంతరెడ్డి తెలిపారు. మండలంలోని కుకునూర్ గ్రామ సమీపంలోని చిన్నవాగు, మానేపల్లి సమీపంలోని సంగయ్యవాగులపై చెక్‌డ్యాంల నిర్మాణాల కోసం స్థలాలను బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా వచ్చే గోదావరి జలాలతో ఉమ్మడి మెదక్ జిల్లా సస్యశ్యామలం కానుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 55 చెక్‌డ్యాంలను రూ. 150 కోట్ల నిధుల అంచనాలతో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 55 చెక్‌డ్యాంలను నాలుగు విడుతల్లో నిర్మించనుండగా, మొదటి విడుతలో 27 చెక్‌డ్యాంలను నిర్మించనున్నామని, ఇందులో మెదక్ జిల్లాలో 6, సిద్దిపేట జిల్లాలో 17, సంగారెడ్డి జిల్లాలో 4 చెక్‌డ్యాంలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో నిర్మించే ఆరు చెక్‌డ్యాంలలో వెల్దుర్తి మండలంలో 2, హవేలిఘన్‌పూర్ మండలంలో 3, శివ్వంపేట మండలంలో 1 నిర్మాణాలు చేపట్టనున్నామన్నారు. గతంలో ఆరు కిలోమీటర్లకు ఒక చెక్‌డ్యాం నిర్మాణం చేస్తే, నేడు ఒక చెక్‌డ్యాం లో నిల్వ ఉన్న నీటి చివరన మరో చెక్‌డ్యాంను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

చెక్‌డ్యాంల ద్వారా నీటిని నిల్వ చేయడంతో పాటు భూగర్భ జలాలను పెంచడం, గొలుసుకట్టు కాల్వల ద్వారా చెరువులు, కుంటలను నింపనున్నట్లు తెలిపారు. ఇందుకోసం చెక్‌డ్యాంలకు అనుసంధానంగా కాల్వల నిర్మాణం, కాల్వలకు తూములు నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఎప్పటికప్పుడు నీటిని నిల్వ చేస్తూ, అధికంగా వచ్చే నీటిని తూముల ద్వారా చెరువులు, కుంటలను నింపుతామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతం కానుందని, కాళేశ్వరం నీటిని హాల్దీవాగులో వదులడంతో పాటు సింగూరు, నల్లవాగులలో నీటిని వదులుతామన్నారు. వీరి వెంట ఇరిగేషన్ ఈఈ ఏసయ్య, డీఈ శ్రీనివాసరావు, ఏఈ కరుణ, ఆయా గ్రామాల రైతులు, నాయకులు ఉన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...