తహసీల్డార్‌ ఆఫీస్‌ కేరాఫ్‌ పుల్లారెడ్డి కాలేజ్‌..


Mon,May 20, 2019 11:32 PM

గుమ్మడిదల ;గుమ్మడిదల మండలం తహసీల్దార్‌ అఖిల ప్రసన్న, బొంతపల్లి, గుమ్మడిదల, అన్నారం మరో రెండు గ్రామాలకు చెందిన 5 మంది వీర్వోలతో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్‌తో కలిసి సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం నుంచి దస్తావేజులను దోమడుగు గ్రామ సమీపంలో ఉన్న పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీకి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న అన్నారం గ్రామస్తులు తమ గ్రామానికి చెందిన 261 సర్వే నంబర్‌ భూములను బడాబాబులకు అప్పగిస్తున్నారని ఫార్మసీ కాలేజీ చేరుకుని తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ సిబ్బందిని నిలదీశారు. దీంతో రెవెన్యూ అధికారులు నీళ్లు నములతూ పోలీసులను ఆశ్రయించి వారి సహాయంతో దస్తావేజులను తీసుకుని తహసీల్దార్‌ కార్యాలయానికి పయనమయ్యారు. ఈ విషయంపై స్థానికంగా ఉధిృక్తత చోటు చేసుకుంది. అన్నారం గ్రామానికి చెందిన రైతులు సంజీవరెడ్డి, నరహరి తదితరులు తహసీల్దార్‌ను నిలదీశారు. ఉన్నట్టుండి పుల్లారెడ్డి కాలేజీకి ఎందుకు వచ్చారో తెలుపమని ప్రశ్నించారు. దీంతో తహసీల్దార్‌ గుమ్మడిదల తహసీల్దార్‌ కార్యాలయంలో సాంకేతిక లోపం ఉన్నందున పుల్లారెడ్డి కాలేజీకి వచ్చామని తెలిపారు. ఈ విషయమై ఆర్డీవోకు కూడా మెసేజ్‌ పెట్టామని తెలిపారు. ఈవిషయాన్ని ముందుగా సమాచార మాధ్యమంలో ఎందుకు ప్రకటన ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనికి ఆమె సరైన సమాధానం చెప్పలేకపోయారు. గుమ్మడిదల తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంతంలో నెట్‌వర్క్‌ పని చేయకపోవడం వల్ల పుల్లారెడ్డికాలేజీలో విధులు నిర్వహించడానికి వచ్చామని వివరణ ఇచ్చారు. నిజానికి పుల్లారెడ్డి కాలేజీ ప్రాంతంలో అసలు నెట్‌వర్క్‌ సిగ్నల్‌ ఉండదని అక్కడి స్థానికులు తెలిపారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద గుడుపుటాని ఉందని అన్నారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా ఉన్న విషయం ఏమిటని తెలుసుకోగా హైదారాబాద్‌కు కూత వేటు దూరంలో ఉన్న అన్నారం భూములకు కోట్లలో రియల్‌ దందా సాగుతుంది. ఎన్నికల కోసమే వచ్చిన తహసీల్దార్‌ వారం పది రోజుల్లో బదిలిపై వెళ్తుండడం వల్లే లక్షలను సంపాదించాలని అక్రమంగా భూములను ఇతరులకు అప్పగించడానికి ఇంతటి దుస్సాహసం చేస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. అన్నారం గ్రామానికి చెందిన 261 సర్వే నంబర్‌లోని కొంత భూమిని బడాబాబులకు అప్పగించడానికి లక్షలు తీసుకుని పనికి ఒడిగడుతున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి.

కొత్త పాస్‌బుక్కులు ఇస్తారని చాటింపు
మండల కేంద్రంలో ఇప్పటి వరకు కొత్త పాస్‌ బుక్కులు రాని వారికి సోమవారం పాసుబుక్కులు ఇస్తామని ఆదివారం దండోరా చేయించినట్లు సమాచారం. కాగా, సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఉండవలసిన రెవెన్యూ సిబ్బంది పుల్లారెడ్డి కాలేజీకి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తహసీల్దార్‌ అన్నారంలోని 261 సర్వేనంబర్‌లోని ప్రభుత్వ భూములను ఇతరులకు అప్పగించాలనే పుల్లారెడ్డి కాలేజీకి తరలించారని ఇక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. ఈవిషయంపై జిల్లాస్థాయి రెవెన్యూ అధికారులు స్పందించి తహసీల్దార్‌, సహకరించిన వీఆర్వోలను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మూడేండ్ల నుంచి పౌతీ కాలేదు
మూడేండ్ల నుంచి పౌతీ కాలేదని రైతు మహిళ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పడిగాపులు కాసింది. గుమ్మడిదల గ్రామానికి చెందిన అమ్మగారి బాలమణిభర్త సాయిరెడ్డికి చెందిన రెండెకరాల పొలం పౌతీ చేయాలని చెప్పులరిగేలా తిరిగిన కొత్త పాసు బుక్కులు రెవెన్యూ అధికారులు ఇస్తాలేరని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త చనిపోయి మూడేండ్లు అవుతున్నా తన పేరు మీద పౌతీ చేయాలని పలుమార్లు విన్నవించుకున్నా న్యాయం జరుగడంలేదు. సోమవారం కొత్త పాసుబుక్కులు ఇస్తారని తెలిసి తహసీల్దార్‌ కార్యాలయం వద్దే పడిగాపులు కాసినా అధికారులు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పేదవారికి న్యాయం జరుగాలని జిల్లా అధికారులను కోరుతున్నది.

ఆర్డీవో ఆదేశాల మేరకే విధులు నిర్వహిస్తున్నాం...
ఆర్డీవో ఆదేశాల మేరకే విధులు నిర్వహిస్తున్నామని గుమ్మడిదల తహసీల్దార్‌ అఖిల ప్రసన్న తెలిపారు. మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయంలో నెట్‌వర్క్‌ పని చేయకపోవడం వల్లే పుల్లారెడ్డి కాలేజీకి తరలించాం. శనివారం రోజు ఆర్డీవో ఆదేశాల మేరకు రికార్డులను పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే కాలేజీలో రెవెన్యూ పరమైన విధులు నిర్వహించాం. అన్నారం గ్రామానికి చెందిన 261 సర్వే నంబర్‌ భూములు కోర్టు పరిధిలో ఉన్నందున తాము అందులో ఎలాంటి జోక్యం చేసుకోలేదని వివరణ ఇచ్చారు. జిల్లాస్థాయి అధికారుల ఆదేశాల మేరకే విధులు నిర్వహించాం. కావాలనే అన్నారం గ్రామానికి చెందిన కొందరు తమపై అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
- అఖిల ప్రసన్న, తహసీల్దార్‌ గుమ్మడిదల

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...