పోలీసు గ్రీవెన్స్‌లో వినతుల వెల్లువ


Mon,May 20, 2019 11:27 PM

సంగారెడ్డి టౌన్‌: నారాయణఖేడ్‌ ఎస్సీ బాలికల వసతిగృహం నుంచి అదృశ్యమైన తన కూతురి ఆచూకీ కనుగొనాలని కంగ్టి మండలానికి చెందిన ఒక ఫిర్యాదురాలు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేసింది. సోమవారం నిర్వహించిన పోలీసు గ్రీవెన్స్‌లో జిల్లా నుంచి పలు ప్రాంతాల వారు జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుని ఎస్పీకి వినతులు అందజేశారు. అవి ఇలా ఉన్నాయి.

నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతిగృహం నుంచి 9వ తరగతి చదువుతున్న మైనర్‌ కూతురిని ఫిబ్రవరి 11వ తేదీన ఆ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి తమకు తెలియకుండా అపహరించుకుపోయాడని, ఇప్పటి వరకు తమ కూతురు ఆచూకీ తెలియడం లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తమ కూతురుని తమకు అప్పగించాలని కంగ్టి మండలానికి చెందిన ఒక ఫిర్యాదురాలు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేసింది.
2014 సంవత్సరంలో తనకు పెళ్లి జరిగిందని, ప్రస్తుతం తమకు మూడు సంవత్సరాల కొడుకు అన్నాడని, తన భార్య గత సంవత్సరకాలంగా ఎటువంటి కారణం లేకుండా ఆమె తల్లిగారింటి వద్ద ఉంటూ ఎన్నిసార్లు పిలిచినా కాపురానికి రావడం లేదని. తన భార్యకు కౌన్సెలింగ్‌ ఇచ్చి తనతో కాపురానికి వచ్చేలా ఒప్పించాలని సంగారెడ్డి మండలానికి చెందిన ఒక ఫిర్యాదుదారుడు ఎస్పీకి విన్నవించారు.
ఒక వ్యక్తి తనని పెళ్లి చేసుకుంటాననే పేరుతో మోసం చేసి పెళ్లికి నిరాకరిస్తున్నాడని, తనకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని సదాశివపేట మండలానికి చెందిన ఒక ఫిర్యాదురాలు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించింది.
తమకు పది సంవత్సరాల క్రితం పెళ్లి జరిగిందని తన భర్త పెళ్లి జరిగిన మూడు సంవత్సరాల వరకు బాగానే చూసుకున్నాడని, తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడని, తన భర్త తనను పుట్టింట్లో వదిలేసి తన ఇద్దరూ కుమారులను తీసుకుని వెళ్లాడని, తనకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని మునిపల్లి మండలానికి చెందిన ఒక ఫిర్యాదురాలు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించింది. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...