వాయువేగం


Mon,May 20, 2019 03:38 AM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్ల కింద ముంపునకు గురవుతున్న గ్రామాలకు దీటుగా అధునాతన హంగులతో కొత్త కాలనీలను ప్రభుత్వం పునర్నిర్మిస్తున్నది. ముంపు గ్రామాల ప్రజలు కోరుకున్న తరహాలో ఈ మోడల్ కాలనీలు నిర్మించి నిర్వాసితులకు అందించేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై ఆరా తీస్తూ అధికారులకు సూచనలు, సలహాలు చేస్తున్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు గజ్వేల్ ఎడ్యుకేషనల్ హబ్ పక్కన ముట్రాజ్‌పల్లిలో, కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్వాసితులకు ములుగు మండలం తున్కిబొల్లారం, అనంతగిరి రిజర్వాయర్ నిర్వాసితులకు సిద్దిపేట శివారులోని లింగారెడ్డిపల్లి గ్రామ సమీపంలో నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఈ నెల 3 నుంచి 14 వరకు ముంపు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని భూనిర్వాసితులకు పంపిణీ చేశారు. 4,061 కుటుంబాలకు పరిహారం అందింది. ఇటీవలనే హైకోర్టు మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. ఈ నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలకు ఆర్‌అండ్‌ఆర్ కాలనీల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోనే తొలి సారిగా కొత్త చట్టం ప్రకారం పునరావాసం, పునరోపాధి కింద డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది. ఒక్కో ఇంటిని 250 గజాల విస్తీర్ణంలో రూ.5.04 లక్షలు వెచ్చించి నిర్మిస్తున్నది.

శరవేగంగా కొనసాగుతున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీలు
జిల్లాలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద 8 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. సిద్దిపేట డివిజన్ పరిధిలోని వేములగట్టు, ఏటిగడ్డ కిష్టాపూర్, బ్రాహ్మణబంజేరుపల్లి, రాంపూర్, లకా్ష్మపూర్, పల్లెపహాడ్, గజ్వేల్ డివిజన్ పరిధిలోని కొండపాక మండల పరిధిలోని ఎర్రవల్లి, సింగారం గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ ముంపు గ్రామాలకు గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ పక్కనే 460 ఎకరాల విస్తీర్ణంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 250 గజాల విస్తీర్ణంలో నిర్మాణ పనులు చేపడుతున్నారు. రెండు బెడ్‌రూంలు, కిచెన్, హాల్ తదితర సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. కాలనీల్లో 18 మీటర్ల వెడల్పుతో రోడ్లు నిర్మిస్తున్నారు. 12, 9 మీటర్ల వెడల్పుతో అంతర్గత రోడ్లు నిర్మాణం చేస్తున్నారు.

ఇక్కడ సుమారు 2 వేల ఇండ్ల వరకు నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం 600 ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని ఇండ్ల నిర్మాణ పనుల కోసం భూమి చదును చేసి పిల్లర్ల పనులు జరుగుతున్నాయి. కొండపోచమ్మ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న ములుగు మండలంలోని మామిడ్యాల, బైలాంపూర్, తానేదార్‌పల్లి నిర్వాసితుల కోసం తున్కిబొల్లారం వద్ద ఒకే చోట డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. 190 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం 600 ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరో 300 ఇండ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే భూనిర్వాసితులకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అనంతగిరి రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న కొచ్చగుట్టపల్లి భూనిర్వాసితులకు సిద్దిపేట పట్టణ శివారులోని లింగారెడ్డిపల్లి పరిధిలో 772 సర్వే నంబరులో 7 ఎకరాల 18 గుంటల విస్తీర్ణంలో 100 ఇండ్ల వరకు చేపట్టిన నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆయా ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో అంతర్గత రహదారులకు సీసీలు కూడా వేయనున్నారు. డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, నీటి వసతి, కాలనీల్లో పచ్చదనం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. గుడికి గుడి, బడికి బడి, పిల్లలకు ఆట స్థలాలు తదితర సౌకర్యాలు కూడా ఉండనున్నాయి.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...