దోస్త్‌ పిలుస్తోంది....


Sat,May 18, 2019 11:38 PM

22న నోటిఫికేషన్‌ విడుదల
-23 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్లు షురూ..
-జిల్లాలో 7 ప్రభుత్వ,17 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు
-ఆసక్తి మేరకు ఆప్షన్ల ఎంపిక విద్యార్థులదే
-ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు
-అన్ని జిల్లా కేంద్రాల్లో సాధారణ హెల్ప్‌లైన్‌ సెంటర్‌
-ఎన్నో సవరణలతో వస్తున్న దోస్త్‌ నోటిఫికేషన్‌

సంగారెడ్డి చౌరస్తా: డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ ఈ నెల 22న విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఆ మరుసటి రోజు 23 నుంచే విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలుకానున్నది. మూడేండ్లుగా రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీలలో ఒకే రకమైన ప్రవేశాలను కల్పించడంతో పాటు రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎక్కడైనా చదువుకునే సౌకర్యం కల్పించడమే ‘దోస్త్‌' ప్రత్యేకత. ఆరు యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలను విద్యార్థులు ఎంపిక చేసుకునే సౌలభ్యం ఏర్పడింది. మన జిల్లా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న నేపథ్యంలో ఈ జిల్లా విద్యార్థులు ఓయూ పరిధిలోని కళాశాలలను మాత్రమే ఎంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. దోస్త్‌ ద్వారా ఆయా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాలకు సంబంధించిన నియమ నిబంధనలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. తొలుత ఈనెల 15న ‘దోస్త్‌' నోటిఫికేషన్‌ విడుదల చేసి, 16 నుంచి రిజిష్ర్టేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ నెల 22కు నోటిఫికేషన్‌ను వాయిదా వేశారు. రెండు మూడేండ్లను నుంచి విద్యార్థులు పేరు నమోదు చేసుకున్న దగ్గరి నుంచి కళాశాలలో ప్రవేశం పొందేవరకు ఎదురైన పలు సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఈ సారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నత విద్యా మండలి చర్యలు తీసుకున్నది. అంతే కాకుండా విద్యార్థులకు మరో గొప్ప అవకాశాన్ని కల్పించింది. మొదటిసారి ప్రవేశం పొందిన కళాశాలలో సీటును రద్దు చేసుకుని రెండో దఫాలో పేరు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.

ప్రత్యేక హెల్ప్‌లైన్‌ కేంద్రాల ఏర్పాటు...
అయితే గతేడాది తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మూడు విధాలుగా హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థుల సమస్యలకు సంబంధించి ఈ సెంటర్లలో పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు తమ పేరును నమోదు చేసుకునే సమయంలో అనుకోని విధంగా ఎలాంటి తప్పులు దొర్లినా వాటిని తిరిగి మార్పు చేసే అధికారం ఈ ప్రత్యేక కేంద్రాలకు కల్పించనున్నారని సమాచారం. గతంలో ఇలాంటి తప్పులు దొర్లినపుడు విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. కొందరు విద్యార్థులు యూనివర్సిటీకి వెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విధిలేని పరిస్థితిలో తాము ఎంపికైన ఇతర కళాశాలలు, ఇతర కోర్సులలో అలాగే ఉండాల్సిన పరిస్థితులు కూడా లేకపోలేవు. ఈ క్రమంలో మన ఉమ్మడి జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. దీంతో మన జిల్లా విద్యార్థులకు కలిసిరానున్నది. అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాలలోని ఐడీ కళాశాలల్లో ఏర్పాటు చేసే సాధారణ హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో విద్యార్థులు చేసే చిన్నపాటి పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని 15 కళాశాలల్లో విద్యార్థులు నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

ఫీజు చెల్లింపులోనూ సులభతరం...
అయితే ఈ సారి ప్రవేశాలలో భాగంగా విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించి తమ సీటును కన్ఫామ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. గతంలో సంబంధిత కళాశాలకు విద్యార్థులు వెళ్లి ఫీజు చెల్లించేవారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించి తమ సీటును పక్కా చేసుకోవచ్చు. అంతేకాకుండా కులం, ఆదాయ ధ్రువపత్రాలు జతపరిచే విద్యార్ధులకు ఫీజు మినహాయింపు కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ సౌకర్యంతో విద్యార్థులకు ఫీజు చెల్లించే విషయంలో ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. దీంతో గతంలో వివిధ కళాశాలలో వివిధ రకాల ఫీజులను చెల్లించిన విద్యార్థులకు ఒకే రకమైన ఫీజు చెల్లించే వీలు ఏర్పడుతుంది. అన్ని యూనివర్సిటీల పరిధిలో కామన్‌ ఫీజును నిర్ణయించే అవకాశాలు కూడా లేకపోలేవు.

జిల్లాలో 24 డిగ్రీ కళాశాలలు...
ఇదిలా ఉండగా జిల్లాలో మొత్తం 24 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కాగా, 17 ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి. అయితే గతేడాది నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే ఎక్కువ ప్రవేశాలు పొందేలా ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో అని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులను భర్తీ చేసేందుకు సీట్ల సంఖ్య పెద్దఎత్తున పెంచారు. దీంతో వారు అనుకున్న మేరకు కొంత విజయాన్ని సాధించారు. అయినా పెంచిన విధంగా పూర్తిస్థాయి సీట్లు భర్తీ కాకపోవడంతో ఈ ఏడాది సీట్లను కొంతమేరకు కుదించారు. ఉదాహరణకు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్‌ కళాశాలలో గతంలో 1,020 సీట్లు ఉండగా, గతేడాది సీట్ల సంఖ్యను 1,420కి పెంచారు. అయితే ప్రవేశాలు పూర్తిస్థాయిలో కాకపోయినా అంతకు ముందు కంటే వందల సంఖ్యలో విద్యార్థులు ఎక్కువగా ప్రవేశం పొందారు. గతంలో 800 దాటని సీట్ల భర్తీ గతేడాది 1000కి పైగా భర్తీ అయ్యాయి. ఈ ఏడాది తారా కళాశాలలో 1,320కి సీట్ల సంఖ్యను కుదించారు. అదేవిధంగా జిల్లాలోని ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా కొంతమేర సీట్ల సంఖ్యను తగ్గించినట్టు తెలిసింది.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...