జోగిపేటలో చైన్‌ స్నాచింగ్‌


Sat,May 18, 2019 11:19 PM

అందోల్‌, నమస్తే తెలంగాణ: మహిళ మెడలో రూ.3 లక్షల విలువైన బంగారు నగలను గుర్తు తెలియని దుండగులు అపహరించుకుని వెళ్లిన సంఘటన జోగిపేట పట్టణంలోని వాసవి నగర్‌ కాలనీలో శనివారం సాయత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం జోగిపేట పట్టణానికి చెందిన డీజీ.చంద్రకళ మల్లయ్య యాదవ్‌ అనే మహిళ వాసవి నగర్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం అందోలులోని తన బంధువుల ఇంటికి వెళ్లి సాయంత్రం జోగిపేటలోని ఆమె నివాసానికి నడుచుకుంటూ వస్తుండగా, సాయంత్రం 6:20 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమె మెడలోని నగలు లాగడంతో, ఆమె కింద పడిపోగా, మెడలోని 6 తులాల పుస్తేల తాడు, 3.50 తులాల నల్లపూసల తాడు తెగిపోవడంతో, వాటిని తీసుకుని ఆ దుండగులు అక్కడి నుంచి బైకుపై పారిపోయారు. బాధితురాలు కింద పడడంతో ఆమె చేతికి, మెడకు గాయమైంది. బాధితురాలి ఇంటి వెనుక భాగం వైపున ఈ ఘటన జరుగగా, మరో రెండు నిమిషాల్లోపు ఆమె ఇంట్లోకి చేరుకునే అవకాశం ఉండగా, ఇంతలోనే బంగారం దోపిడికి గురికావడంతో ఆమె రోధిస్తున్నది. కాలనీలోని కొందరు మహిళలు చూస్తుండగానే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీస్‌ స్టేషన్‌ వెనుక కాలనీలో సాయంత్రం వేళలో దుండగులు ఇలాంటి దారుణానికి పాల్పడడంపై కాలనీ వాసులు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై జోగిపేట ఎస్‌ఐ వెంకటా రాజా గౌడ్‌కు ఆమె భర్త రిటైర్డ్‌ సీఐ మల్లయ్య సమాచారాన్ని అందించారు. దీంతో ఎస్‌ఐ కాలనీలోని ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి, బాధితురాలి, కాలనీ వాసులతో మాట్లాడి చైన్‌ స్నాచింగ్‌ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బ్లాక్‌ కలర్‌ బైకుపై ఒకరు హెల్మెట్‌ను ధరించగా, మరోకరు సగం వరకు ముఖానికి టవల్‌ను కట్టుకున్నారని, ఒకరు బైకు నడుపుతుండగా, వెనుకాల కూర్చున్న వ్యక్తి మహిళ మెడలో నుంచి చైన్‌ను లాక్కొని ఎత్తుకెళ్లారని కాలనీ వాసులు ఎస్‌ఐకు వివరించారు. సదరు దుండగులు రెండు, మూడు పర్యాయాలు కాలనీలో బైకుపై అటు ఇటు తిరిగారని కాలనీ వాసులు చెప్పారు. కాలనీలోని వ్యాపారి ప్రభు ఇంటికి అమర్చిన సీసీ కెమోరాలను ఎస్‌ఐ వెంకట రాజాగౌడ్‌ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. చైన్‌ స్నాచింగ్‌ సంఘటనలు జరిగి జోగిపేట పట్టణంలో ఇది నాల్గవ సంఘటన కావడంతో పట్టణ వాసులు భయాందోళనలను గురవుతున్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...