పురపాలనపై నజర్..!


Sat,May 18, 2019 12:27 AM

- పట్టణ సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే శ్రద్ధ
-దశలవారీగా చర్యలకై అధికారులకు ఆదేశం
- తాగునీటి సరఫరాకు తొలి ప్రాధాన్యం
నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ: గతంలో మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న నారాయణఖేడ్ ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. సుమారు 18వేల పై చిలుకు జనాభా గల నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో నారాయణఖేడ్ పట్టణంతో పాటు మంగల్‌పేట్, మన్సూర్‌పూర్, చాంద్‌ఖాన్‌పల్లి గ్రామాలున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని ఆయా గ్రామాలు, కాలనీల్లో ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు సమకూరాలనే ఉద్దేశంతో అధికారులను సమాయత్తం చేస్తున్నారు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి. ఇందులో భాగంగానే దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. తాగునీటి సరఫరాకు తొలి ప్రాధాన్యతనిస్తూ గత బుధవారం నారాయణఖేడ్ పట్టణంలో ఎమ్మెల్యే స్వతహాగా విస్తృతంగా పర్యటించి తాగునీటి సమస్యలపై ఆరాతీసి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకున్నారు. అదేవిధంగా అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్ష జరిపి గుర్తించిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. నీటి ట్యాంకులకు కనెక్షన్లు, పైప్‌లైన్ లీకేజీలు, బోరుమోటార్ల పునరుద్ధరణ వంటి పనులను నాల్గు రోజుల్లోగా పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. కాగా ఇదే తరహాలో ఎమ్మెల్యే ఇతర సమస్యలపైనా క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి తదనుగుణంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రధానంగా పారిశుధ్యంపై దృష్టి సారించనున్నారు. రోడ్లు, కాలనీలు, మినీట్యాంకులతో పాటు ఇతర ప్రదేశాల వద్ద పారిశుధ్య సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టే దిశగా అధికారులను సన్నద్ధం చేయనున్నారు. అంతేకాకుండా పట్టణంలో ప్రధాన రహదారులపై ఉన్న లైట్లతో పాటు ఆయా గ్రామాలు, కాలనీల్లోనూ పూర్తిస్థాయిలో వీధి దీపాలు ఏర్పాటు చేయడంపైనా ఎమ్మెల్యే దృష్టి పెట్టనున్నారు. ఇవేకాకుండా పట్టణంలో దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను సైతం గుర్తించి సకాలంలో వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ఆయా సమస్యల పరిష్కారంలో భాగంగా ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ, సమీక్షలు జరుపుతూ త్వరితగతిన పనులు పూర్తయ్యే విధంగా కృషి చేయనున్నారు. ఎమ్మెల్యే పురపాలనపై నజర్ పెట్టి ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు నడుం బిగించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...