ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్టు


Sat,May 18, 2019 12:27 AM

-2012నుంచి అక్రమంగా స్థానికంగా నివాసం
-అల్ కబీర్ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్న వైనం
-నకిలీ ఆధార్, పాన్ కార్డులతో జీవనం

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ : బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి రుద్రారం అల్‌కబీర్ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్న ఐదుగురు బంగ్లాదేశీయులను పటాన్‌చెరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పటాన్‌చెరు సీఐ నరేశ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని అల్ కబీర్ పరిశ్రమలో కొందరు బంగ్లాదేశీయులు ఉపాధి పొందుతున్నారని నమ్మకమైన సమాచారం రావడంతో పోలీసులు కొంత కాలంగా ప్రత్యేక నిఘా వేశారు. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కార్మికుల వివరాలు వారికి లభ్యం అయ్యాయి. ఈ మేరకు గురువారం రోజు పోలీసుల ఐదుగురు బంగ్లాదేశీయులను అక్రమంగా నివసిస్తున్నారని అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్నవారిని విచారిస్తే కలీమ్, ఇస్లాం అనే వ్యక్తులు బంగ్లాదేశీయులను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతా సమీపంలో దేశం దాటించి తీసుకుని వస్తున్నారని తేలింది. వారు ఇండియాకు అక్రమంగా తీసుకుని వచ్చిన బంగ్లాదేశీయులను అల్ కబీర్ పరిశ్రమలో ఉపాధి కల్పిస్తున్నారు. ఇదే విధంగా మొహమ్మద్ బాబు (22), మొహమ్మద్ రిఫాన్ (25), గులామ్ హుస్సేన్ (40), ఎండీ సైఫుల్ ఇస్లామ్ (24), మొహమ్మద్ సైదుల్ ఖురేషీ (29)లను ఇండియా తీసుకుని వచ్చారు. వారికి 2012 నుంచి రుద్రారం అల్ కబీర్ పరిశ్రమలో ఉపాధి కల్పించారు. ఇక్కడే నకిలీ అడ్రస్ ప్రూఫ్స్ చూపించి ఆధార్‌కార్డు, పాన్ కార్డులను సైతం వారు పొందడం విశేషం. పటాన్‌చెరులోని అంబేద్కర్ కాలనీల్లో నివస్తున్నామని వారు అడ్రస్‌లు ఇచ్చి ఆధార్, ఓటర్, ఇతర కార్డులను పొందారు. వారిలో కొందరు ఇక్కడ వివాహాలు సైతం చేసుకుని అక్రమంగా జీవిస్తున్నారు. 2012 ఏడాది నుంచి దాదాపు 20 మంది వరకు ఈ ప్రాంతానికి వచ్చి వివిధ పనులు చేసుకుంటున్నారని గుర్తించారు. ఈ మేరకు వారిని తీసుకుని వచ్చిన కలీమ్, ఇస్లాం అనే వ్యక్తులు ఇప్పుడు బంగ్లాదేశ్‌లో వెళ్లిపోయారని విచారణలో నిందితులు పోలీసులకు తెలిపారు. కలీమ్, ఇస్లాం అనే వ్యక్తులు బంగ్లాదేశీయులను భారత్‌కు అక్రమంగా తీసుకుని వచ్చి ఉపాధి కల్పించడం అనే అక్రమ దందాను నిర్వహిస్తున్నారని గుర్తించారు. వారు ఇండియాకు తీసుకుని వచ్చిన వారు ఎక్కడెక్కడ ఉన్నారు తదితర అంశాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరితో పాటు మరో 15మంది వరకు స్థానికంగానే పరిశ్రమల్లో ఉన్నారనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే మరికొందరిని గుర్తించి అరెస్టు చేస్తామని సీఐ చెప్పారు. అరెస్టు చేసిన ఐదుగురు బంగ్లాదేశీయులపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని పోలీసులు పేర్కొంటున్నారు. పాస్‌పోర్టు లేకుండా నివసిస్తున్నందుకు వారిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. ఫారినర్ యాక్ట్ ప్రకారం వారిపై కేసు నమోదు చేస్తున్నామన్నారు. వారి వద్ద బంగ్లాదేశీయులుగా పాస్‌పోర్టుకానీ, ఇతర ధ్రువపత్రాలు లేవన్నారు. కార్యక్రమంలో క్రైమ్ సీఐ రాములు నాయక్, పటాన్‌చెరు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు సమాచారం ఇవ్వండి...
ప్రజలు విదేశీయులు ఎవరైనా మీకు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సీఐ నరేశ్ కోరారు. బంగ్లాదేశీయులు రుద్రారం పరిధిలో పట్టుపడటంతో పటాన్‌చెరు పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీకు అనుమానం ఉన్న వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పారు. అడ్రస్ లేనివారికి రూమ్‌లు అద్దేకు ఇవ్వవద్దని ప్రజలకు సూచించారు. విదేశీయుల సమాచారం ఇచ్చిన వారికి పారితోషికం ఇస్తామని చెప్పారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...