మల్లన్న ఆలయంలో హుండీల లెక్కింపు


Thu,May 16, 2019 11:08 PM

నమస్తే తెలంగాణ : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారికి ఖజానాకు భక్తులు సమర్పిస్తున్న కానుకలతో కాసులు కురుస్తున్నాయి. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయ హుండీలను మహా మండపంలో ఆలయ చైర్మన్‌ సెవెల్లి సంపత్‌, ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్‌, సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో విశ్వనాథశర్మ, పాలక మండలి పర్యవేక్షణలో లెక్కింపులు జరిగాయి. ఆలయ సిబ్బంది, అర్చకులు, రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన శ్రీరామకృష్ణ భజన మండలి భక్తులు 200 మంది లెక్కింపులు జరిపారు. గురువారం జరిపిన లెక్కింపులో రూ.59లక్షల, 25వేల,195నగదు, మిశ్రమ బంగారం 114 గ్రాములు, మిశ్రమ వెండి 7కిలోల, 200 గ్రాముల, 1450 కిలోల మొక్కుబడి బియ్యం, 26 విదేశీ కరెన్సీ నోట్లు, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నోట్లు రూ.34,000 వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆలయంలో చైర్మన్‌, డీసీ విలేకరులతో మాట్లాడుతూ ఆలయంలోని 14 హుండీల ద్వారా లభించిన నగదును స్ధానిక ఏపీజీవీబీలో జమచేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు ముత్యం నర్సింహులు, తలసాని శంకర్‌యాదవ్‌, ఉడుత మల్లేశ్‌యాదవ్‌, జూకంటి కిష్టయ్య, రాపాక సిద్దారెడ్డి, బండి తిరుపతిరెడ్డి, ఏఈవో రావుల సుదర్శన్‌, పర్యవేక్షకుడు నీల శేఖర్‌, ఆలయ సిబ్బంది బ్రహ్మండ్లపల్లి అంజయ్య, బత్తిని పోచయ్య, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, వైరాగ్యం జగదీశ్వర్‌, మేకల పోచయ్య, సార్ల విజయ్‌కుమార్‌, మాధవి, ఏఈ ప్రతాప్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

హుండీ లెక్కింపులో చోరీకి యత్నం
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో గురువారం జరిపిన హుండీ లెక్కింపులో చోరీ యత్నం జరిగింది. స్వామి వారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్న 30గ్రాముల బంగారు ఆభరణం, బంగారాన్ని తస్కరించి పోలీసులకు ఇద్దరు స్వర్ణకారులు పట్టుబడ్డారు. స్వామివారి హుండీ లెక్కింపుల సందర్భంగా భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలను తూకం వేసేందుకు వచ్చిన ఇద్దరు స్వర్ణకారులు చోరీకి పాల్పడి దొరికిపోయారు. కొమురవెల్లి గ్రామానికి చెందిన స్వర్ణకారులు బూరుగుల శ్రీనివాస్‌, బూరుగుల కిషన్‌ స్వామివారి హుండీ లెక్కింపులో భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారు, వెండి ఆభరణాలను తూకం వేసి ఆలయ అధికారులకు అప్పగిస్తారు.

ఇదేక్రమంలో గురువారం ఆలయంలో జరిపిన హుండీ లెక్కింపుల సందర్భంగా ఇరువురు స్వర్ణకారులలో ఒకరు బంగారు ఆభరణాన్ని తూకం సామగ్రి బ్యాగులో వేసుకోగా, మరో స్వర్ణకారుడు బంగారాన్ని ప్యాంట్‌ జేబులో వేసుకున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు ఇరువురిని సోదా చేయడంతో బంగారంతో పాటు మరో ఆభరణం వారి వద్ద లభించింది. దీంతో ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్‌ చోరీ విషయమై కొమురవెల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు కొమురవెల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...