ఫేజ్-2 వచ్చేస్తోంది...


Tue,April 23, 2019 11:36 PM

-ఫలించనున్న ఆర్సీపురం ప్రజల నిరీక్షణ..
-ప్రస్తుతం లింగంపల్లి వరకు మాత్రమే ఎంఎంటీఎస్ సౌకర్యం
-రూట్‌లైన్ పెంపుతో రామచంద్రాపురం వరకు...
-పూర్తయిన ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు
-ప్రారంభోత్సవానికి సిద్ధం..
-సంతోషం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు
రామచంద్రాపురం: ఎంఎంటీఎస్ ఫేజ్-2లో భాగంగా తెల్లాపూర్ నుంచి ఆర్సీపురం కారిడార్‌లో రైల్వే అధికారులు కమర్షియల్ ఆపరేషన్స్‌ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రైల్వే ట్రాక్‌లు, సిగ్నల్స్, స్టేషన్ భవన నిర్మాణాలు, ట్రాక్ లింకింగ్, సిగ్నల్ లింకింగ్‌లకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం లింగంపల్లి వరకు మాత్రమే ఉన్న ఎంఎంటీఎస్ సౌకర్యం త్వరలోనే ఆర్సీపురం వరకు రానుంది. హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్) రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. 2012-13లో రూ.817 కోట్ల వ్యయంతో ఆరు కారిడార్లల్లో 84.05 కి.మీ రూట్‌లైన్, 96.25 కి.మీ ట్రాక్‌లైన్‌తో ఫేజ్-2 ప్రాజెక్ట్‌ను చేపట్టారు. తెల్లాపూర్ నుంచి ఆర్సీపురం కారిడార్ వరకు 5.75 కిలోమీటర్లు ఉంది.

ఈ కారిడార్‌ను రూ.37 కోట్ల ఖర్చుతో నిర్వహించారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులకు అయిన మొత్తం వ్యయంలో 2/3వ వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించగా 1/3వ వంతు ఇండియన్ రైల్వే భరించింది. తెల్లాపూర్ నుంచి ఆర్సీపురం కారిడార్‌లో 7 బ్రిడ్జిలు, 3 స్టేషన్‌లు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించుకోవడంతో ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు వేగంగా పూర్తయ్యాయి. పట్టాల లింకప్, సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటుతో పాటు కమిషనర్ రైల్వే సేఫ్టీ ఇన్స్‌పెక్షన్ (సీఆర్‌ఎస్) కూడా పూర్తయ్యాయి. అధికారులు ఇంజన్ రోలింగ్‌ను నిర్వహించి పట్టాలు, సిగ్నల్స్ వ్యవస్థను పర్యవేక్షణ చేశారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు పూర్తికావడం జరిగిందని, ప్రారంభోత్సవం తేదీ ఖరారు కావాల్సి ఉన్నదని రైల్వే అధికారి తెలిపారు. ఇదిలావుంటే ఎంఎంటీఎస్ కమర్షియల్ ఆపరేషన్స్ మొదలైతే ఇక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా ఎంతో మంది ఇక్కడి నుంచి జంట నగరాలకు వెళ్లివస్తుంటారు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యలకు సతమతమయ్యే ఉద్యోగులు, విద్యార్థులకు ఎంఎంటీఎస్ రాకతో ఊరట లభిస్తుంది. ట్రాఫిక్ సమస్యలు తెలియకుండా ప్రజలు ఎంఎంటీఎస్‌లో సంతోషంగా ప్రయాణం చేస్తారు.

రవాణా సౌకర్యవంతం..
తెల్లాపూర్ నుంచి ఆర్సీపురంకు ఎంఎంటీఎస్ రైలు వస్తుండటంతో ఈ ప్రాంతంలో కొత్తశోభ సంతరించుకోనుంది. నగరానికి చేరువలో ఉన్న ఆర్సీపురం వాణిజ్యపరంగా అభివృద్ధి చెందింది. ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధికి ఈ ప్రాంతం నోచుకోనుంది. ఆర్సీపురం మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు, ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్ల ప్రజలు సొంత పనుల నిమిత్తం జంట నగరాలకు వెళ్లేందుకు ఎంఎంటీఎస్‌తో రవాణా సౌకర్యవంతంగా ఉంటుంది. సొంత వాహనాల్లో జంట నగరాలకు వెళ్లి ఇంధనం, డబ్బు, సమయం వృథా చేసుకోకుండా ఎంఎంటీఎస్‌లో ఆనందంగా ప్రయాణం చేసే వెసులుబాటు ఇక్కడి ప్రజలకు త్వరలో రానుంది.

ప్రజల నిరీక్షణ ఫలిస్తుంది..
ఎంఎంటీఎస్ రాక కోసం ఇక్కడి ప్రజలు ఎప్పుడెప్పుడాని ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంగానే కాకుండా వాణిజ్యపరంగా ఆర్సీపురం, పటాన్‌చెరు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంతంలో బీహెచ్‌ఈఎల్, బీడీఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇక్రిశాట్, పలు పెద్ద, చిన్నతరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకులు, ఇంజినీరింగ్, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉండటంతో పాటు జనాభా కూడా ఎక్కువగా పెరిగింది. ఈ ప్రాంతం నుంచి నగరానికి వెళ్లేవారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. బస్సుల్లో, వాహనాలపై ప్రయాణం చేసేందుకు ట్రాఫిక్ సమస్యల కారణంగా నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. సమయం వెసులుబాటుని బట్టి ఉద్యోగులు, విద్యార్థులు, ఇతరులు లింగంపల్లి వరకు వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటీఎస్‌లో ప్రయాణం చేస్తుంటారు. ఆర్సీపురం నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్ వరకు సుమారుగా 10 కి.మీల దూరం ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాయి. దీంతో ఇక్కడి ప్రజలు ఆర్సీపురం వరకు ఎంఎంటీఎస్ ఎప్పుడెప్పుడు వస్తుందాని నిరీక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ పనులు పూర్తికావడంతో త్వరలో ఈ ప్రాంతానికి రైలు వస్తుండడంతో ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తైన పనులు..
ఎంఎంటీఎస్ ఫేజ్-2లో భాగంగా తెల్లాపూర్ నుంచి ఆర్సీపురం వరకు ఉన్న కారిడార్‌లో పనులు పూర్తయ్యాయి. రైల్వే ట్రాక్ పనులు, సిగ్నల్స్ పనులతో పాటు స్టేషన్ భవనాలు, బ్రిడ్జ్ పనులను పూర్తిచేశారు. ట్రాక్, సిగ్నల్స్ లింకింగ్ పనులతో పాటు సీఆర్‌ఎస్ ఇన్స్‌పెక్షన్ కూడా పూర్తయింది. ఇక రైళ్ల రాకపోకలు మొదలుకావాల్సి ఉంది. త్వరలో కమర్షియల్ ఆపరేషన్స్‌ను మొదలుపెట్టేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెల్లాపూర్ నుంచి ఆర్సీపురం వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తికావడం జరిగింది.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...