85 ఎంపీటీసీ, 8 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు


Sun,April 21, 2019 11:19 PM

-మూడు విడుతల్లో పోలింగ్ నిర్వహణ
-448 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
-22 నుంచి నామినేషన్లు షురూ
-ముమ్మరమైన ఆశావహుల టికెట్ ప్రయత్నాలు
అందోల్, నమస్తే తెలంగాణ: మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విధి విధానాలను విడుదల చేసింది. మూడు విడుతల్లో ఎన్నికలను నిర్వహించేందుకు ఆదేశాలను జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్ జిల్లా పరిధిలో ఉన్న అందోలు నియోజకవర్గంలోని 8 మండలాలల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను మూడు విడుతలుగా నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది. నియోజకవర్గంలో 8 జడ్పీటీసీ, 85 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసింది. రిజర్వేషన్ల ప్రకారం ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, ఈ నెల 22 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుండటంతో టికెట్‌ల ప్రయత్నాల జోరు ఊపందుకుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను కలుస్తున్నారు. నియోజకవర్గంలో 2,31,490 మంది ఓటర్లుండగా, వీరిలో 1,14,939 మంది పురుషులు, 1,16,545 మంది మహిళలు, ఇతరులు 6 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో నగర పంచాయతీ మినహాయించి, మండలాల పరిధిలోని గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు.

మూడు విడుతల్లో ఎన్నికలు
అందోలు నియోజకవర్గంలోని 8 మండలాల్లో మూడు విడుతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడుతలో అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడు మండలాలు, రెండో విడుతలో అందోలు, పుల్కల్, వట్‌పల్లి మండలాలు, మూడో విడుతలో మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో ఎన్నికలు జరిపించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది.

448 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
అందోలు నియోజకవర్గంలో 8 మండలాల పరిధిలో 85 ఎంపీటీసీ, 8 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అల్లాదుర్గంలో 09, టేక్మాల్ 10, రేగోడు 07, వట్‌పల్లి 09, అందోలులో 11, పుల్కల్‌లో 15, మునిపల్లిలో 12, రాయికోడ్ 12 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా స్థానాలకు గాను ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుకూలంగా 448 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.

నేటి నుంచి నామినేషన్లు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఎన్నికల సంఘం మూడు విడుతల్లో చేపట్టేందుకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొదటి విడుత నామినేషన్లు ఈ నెల 22 నుంచి 24 వరకు, 25న పరిశీలన, 28న నామినేషన్‌ల ఉపసంహరణ, మే 6న పోలింగ్ జరుగుతుంది. రెండో విడుత నామినేషన్లు 26 నుంచి 28 వరకు, 29న నామినేషన్ల పరిశీలన, మే 2న నామినేషన్‌ల ఉపసంహరణ, మే 10న ఎన్నికలు. మూడో విడుత నామినేషన్లు ఈ నెల 30 నుంచి మే 2 వరకు, మే 3న నామినేషన్ల పరిశీలన, మే6న నామినేషన్ల ఉపసంహరణ, మే 14న ఓటింగ్ జరుగనుంది.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...