మోగిన నగారా


Sat,April 20, 2019 11:41 PM

- జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- మూడు విడుతల్లో మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్
- ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు
- 22 నుంచి మొదటి విడుత నామినేషన్ల స్వీకరణ
- జిల్లాలో 25 మండలాలు, గ్రామాలు 647..
- 25 జడ్పీటీసీ, 295 ఎంపీటీసీ స్థానాలు
- పోలింగ్ స్టేషన్లు 1,648, పోలింగ్ లొకేషన్లు 685...

సంగారెడ్డి, నమస్తేతెలంగాణ ప్రధానప్రతినిధి : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటీఫికేషన్ విడుదలైంది. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. జిల్లాలో 25 మండలాల్లో 647 గ్రామ పంచాయతీలుండగా 25 జడ్పీటీసీ, 295 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు 1648 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. 685 లోకేషన్లను గుర్తించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 7,66,183 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో మొదటి, రెండో విడతలో 9 మండలాల చొప్పున, మూడో విడతలో 7 మండలాల్లో మే 6,10,14 తేదీల్లో పోలింగ్ నిర్వహించడానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సిద్దం చేసి పెట్టారు. పోలింగ్ సామాగ్రి కూడా జిల్లాకు చేరుకుంటున్నది. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుకు శిక్షణ కూడా ఇచ్చారు. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. కాగా ఇప్పటికే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు వెల్లడించారు.

ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం..
ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు నేతృత్వంలో వేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నారు. ఇప్పటికే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ కూడా పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల కమిషన్ సమీక్షలో కూడా పాల్గొని వచ్చారు. జిల్లాలో ఐదు శాసన సభ స్థానాలకు, అలాగే పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే, రెండు ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో పూర్తి చేశారు. ఆ ఎన్నికల స్ఫూర్తితోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతం వాతావరణంలో నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 1648 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. 685 వరకు పోలింగ్ లొకేషన్లను గుర్తించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. నామినేషన్లను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనుండగా, నామినేషన్ల ఉపసంహరణ రోజు మాత్రం మధ్యాహ్నం 3 గంటల లోపే నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని హనుమంతరావు నమస్తేతెలంగాణప్రతినిధితో చెప్పారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...