40831 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం


Sat,April 20, 2019 11:41 PM

అందోల్, నమస్తే తెలంగాణ: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను సకాలంలో అందించేందుకే ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని జాయింట్ కలెక్టర్ నిఖిలా రెడ్డి అన్నారు. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 68 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నామని చెప్పారు. ఈ సీజన్‌లో 40831 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేయడమే లక్ష్యంగా ఉందన్నారు. శనివారం జోగిపేటలోని మార్కెట్ యార్డు ఆవరణలో అందోలు సహకార సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 68 కేంద్రాలను ఏర్పాటు చేసి, వీటిలో 32 ఐకేపీ, 36 సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. గడిచిన పంట సీజన్‌లో అందోలు సొసైటీ ద్వారా 900 మంది రైతుల నుంచి రూ.8.50 కోట్ల విలువ చేసే వడ్లను కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తమ వడ్లను తీసుకువచ్చేందుకు అవసరమైన గొనే సంచులను అందుబాటులో ఉంచామన్నారు. ఆమెతో పాటు మార్కెటింగ్ డీఎం సుగుణాబాయి, డీసీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, డీసీసీ ఏవో చంద్రశేఖర్, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ దశరథ్, ఆడిటర్లు శ్రీనివాస్, మురళీధర్, అందోలు సర్కిల్ ఇన్‌చార్జి పోమాసింగ్, రైస్‌మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, సొసైటీ కార్యదర్శి నర్సింహులు, డైరెక్టర్ మల్లేశం, రైతులు పాల్గొన్నారు.

17శాతంలోపు తేమ ఉండాలి
కొనుగోలు కేంద్రంలో వడ్లను విక్రయానికి తీసుకువచ్చే రైతులు వడ్లలో 17 శాతంలోపు తేమ వచ్చే విధంగా చూసుకోవాలన్నారు. 17 శాతంలోపు తేమ వచ్చిన వడ్లకు ఏ గ్రేడ్ రకం కింద క్వింటాలు ధర రూ.1770లను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. సాధారణ రకం (సన్నవడ్లు) క్వింటాలు ధర రూ.1750 మద్దతును అందిస్తుందని ఆమె తెలిపారు. వరి కోసిన తర్వాత మార్కెట్ యార్డులో ఒక్కరోజైనా ఆరబెట్టుకోవాలని ఆమె సూచించారు.

48 గంటల్లోపు రైతుల ఖాతాల్లోకి డబ్బులు
కొనుగోలు కేంద్రాలలో వడ్లను విక్రయించిన రైతులకు సకాలంలో పంట డబ్బులను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని జేసీ తెలిపారు. కొనుగోలు కేంద్రంలో విక్రయించిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లోకి పంట డబ్బులు వేస్తామన్నారు. ఈ సారి జియో ట్యాగింగ్ సిస్టమ్ ద్వారా కొనుగోలు జరుగుతాయని, ఆన్‌లైన్ విధానంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆమె స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి
హత్నూర: ప్రభుత్వం ఏర్పాటుచేసే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నిఖిలారెడ్డి సూచించారు. శనివారం హత్నూర మండలం సిరిపుర, చీక్‌మద్దూర్, హత్నూర, దౌల్తాబాద్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర అందడంతోపాటు తూకంలో మోసం జరుగకుండా ఉంటుందన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆశించినస్థాయిలో పంట దిగుబడి పొందలేకపోతున్నారని తెలిపారు. రైతులకు అందుబాటులో గోనె సంచులు ఉంచడంతోపాటు కొనుగోలు కేంద్రాలవద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ శ్రీనివాస్, డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, డీఎం సుగుణాబాయి, ఏపీడీ సూర్యరావు, డీటీసీఎస్ దస్తగిరి, ఏపీఎంలు శ్రీదేవి, యాదయ్య ఆయా గ్రామాల సర్పంచ్‌లు వీరస్వామిగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...