గింజ గింజకూ... మద్దతు


Wed,April 17, 2019 11:36 PM

- ఏ గ్రేడ్‌కు మద్దతు ధర రూ.1,770, సాధారణానికి రూ.1,750
- జిల్లాలో 68 కొనుగోలు కేంద్రాల్లో ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్న కొనుగోళ్లు
- దళారుల వద్దకు వెళ్లి నష్టపోవద్దంటున్న అధికారులు
- ధాన్యాన్ని ఆరబెట్టి పూర్తి మద్దతు ధర పొందాలని సూచన
- మొబైల్‌లోనూ కొనుగోలు కేంద్రాల సమాచారం
- ఎక్కడినుంచైనా ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌కు అవకాశం
- జిల్లాలో 40వేల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా
- అన్ని సౌకర్యాలతో కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు

సంగారెడ్డి చౌరస్తా : తెలంగాణ సర్కార్ రైతన్నలకు మద్దతుగా నిలుస్తున్నది. రైతులు పండించే పంటకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కోసం 68 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధీనంలో పనిచేస్తున్న ఐకేపీ ద్వారా 32 కేంద్రాలు నిర్వహించనుండగా, పీఏసీఎస్ ద్వారా 36 కేంద్రాల్లో కొనుగోలు మొదలుకానున్నది. ఈ మేరకు ఈ నెల 20వ తేదీ నుంచి ఆయా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై జేసీ నిఖిల సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు మార్గనిర్దేశం చేశారు. కాగా, మద్దతు ధర గ్రేడ్ ఏ ధాన్యానికి క్వింటాలుకు రూ.1,770లను, సాధారణ రకం క్వింటాలుకు రూ.1750 నిర్ణయించారు. రైతులు దళారుల వద్దకు వెళ్లి నష్టపోకూడదనే కొనుగోళ్లు త్వరగా ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. జిల్లాలో ఈ సీజన్‌లో 40 వేల టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, సెల్ ఫోన్ నుంచి కొనుగోలు కేంద్రాల సమాచారం తెలుసుకోవచ్చని, ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ధాన్యాన్ని ఆరబెట్టి పూర్తి మద్దతు ధర పొందాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రైతులు దళారుల వద్దకు వెళ్లి మోసపోకుండా వారు పండించిన ధాన్యానికి మద్దతు ధరను చెల్లించేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతి సీజన్‌లో జిల్లాలో అవసరమైన మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కోసం మొత్తం 68 కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం సేకరణకు అధికారులు నిర్ణయించారు. పంట చేతికొచ్చిన సమయం ఆసన్నం కావడంతో జిల్లాలో ఈ నెల 20 నుంచి వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై జిల్లా సంయుక్త కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులతో సమావేశమై రైతుల వద్ద వరి ధాన్యం కొనుగోలు సంబంధించి మార్గనిర్దేశం చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధీనంలో పనిచేస్తున్న ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ద్వారా 32 కేంద్రాలు నిర్వహించనుండగా, ప్రాథమిక సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) ద్వారా 36 కేంద్రాల్లో కొనుగోలు మొదలుకానున్నది.

ఈ మేరకు జిల్లాలో మొత్తం 68 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి సకాలంలో వరి ధాన్యం సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలస్యమైతే రైతులు దళారుల వద్దకు వెళ్లి నష్టపోయే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో రైతులకు అలాంటి అవకాశం లేకుండా త్వరితగతిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే మద్దతు ధర గ్రేడ్ ఏ వరి రకం క్వింటాలుకు రూ.1,770లను, సాధారణ రకం క్వింటాలుకు రూ.1750లను నిర్ణయించిందని అధికారులు స్పష్టం చేశారు. సేకరించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను కూడా సకాలంలో సంబంధిత రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో సుమారు 40 వేల టన్నుల వరి ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా వరి ధాన్యాన్ని సేకరించనున్నారు. అదేవిధంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని 15 బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు.

విస్తృతం కానున్న జియో ట్యాగింగ్ సేవలు
రైతులు నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో జియో ట్యాగింగ్ సేవలను పౌర సరఫరాలశాఖ విస్తృతం చేసింది. ధాన్యం కొనుగోళ్లతో పాటు వారికి కనీస మద్దతు ధర చెల్లించేందుకు సంబంధించి రైతులకు మేలు జరిగేలా ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. ఈ క్రమంలో ఆన్‌లైన్ ప్రోక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఓపీ ఎమ్మెస్) సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల సమాచారం రైతులకు మొబైల్ ద్వారా అందించే వీలు కలుగుతుంది. మొబైల్ ఫోన్‌లో కొనుగోలు కేంద్రాల వివరాలను తెలుసుకోవడంతో పాటు రైతులు ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చని, బ్యాంకు ఖాతా వివరాలను కూడా నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా ధాన్యం సేకరించిన ఏడు రోజుల్లోగా మిల్లుల నుంచి సమాచారం అందని పక్షంలో అధికారులను అప్రమత్తం చేస్తూ సంక్షిప్త సందేశాలు పంపడం ఈ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకత. జియో ట్యాగింగ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లులపై నిఘా ఉంటుంది. మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యం కేటాయించేలా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. రైతుల కోసం ఓపీఎమ్మెస్ మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పౌర సరఫరాల అధికారులు వెల్లడించారు.

కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు
ఇదిలా ఉండగా, అసలే మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల కోసం అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులైన తాగినీరు, టెంట్, టార్ఫాలీన్లు, గన్నీ బ్యాగులు మొదలైన సౌకర్యాలు కల్పించాలని ఇప్పటికే జేసీ సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

17 శాతం తేమ మించకుండా చూడాలి
అయితే రైతులు తాము పండించిన వరి ధాన్యం తేమ 17 శాతం మించకుండా చూడాలని అధికారులు సూచిస్తున్నారు. పంట కోసిన తరువాత అవసరమైన మేరకు వరి ధాన్యాన్ని ఎండబెట్టాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అప్పుడే రైతులకు మద్దతు ధర వచ్చే అవకాశం ఉన్నదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఎండకాలం సీజన్ అయినందున వరి ధాన్యంలో తేమను అవసరమైన మేరకు తగ్గించుకునే అవకాశం ఉన్నది. అధికారులు సూచించిన మేరకు వరి ధాన్యం తేమ 17 శాతం మించకుండా చూసుకోవడం సులభతరమే అయినప్పటికీ ఈ విషయంలో రైతులు కాస్త జాగ్రత్తలు పాటిస్తే వారు అనుకున్న ధరను పొందుతారని అధికారులు సూచిస్తున్నారు.

బయట అమ్ముకుని మోసపోకండి...
జిల్లాలోని రైతులందరూ తమ వరి ధాన్యాన్ని సంబంధిత కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి కనీస మద్దతు ధరకు ధాన్యం విక్రయించాలి. దళారులు, ఇతరుల మోసపూరిత మాటలు విని నష్టపోకూడదు. రైతుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు తాము పండించిన వరి ధాన్యం 17 శాతం తేమ మించకుండా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అందుకు కనీస మద్దతు ధర లభిస్తుంది. ధాన్యం విక్రయించిన వెంటనే సకాలంలో రైతులకు డబ్బులను కూడా చెల్లించడం జరుగుతుంది. మీ కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.
- శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...