భార్యపై అనుమానం హంతకుడిని చేసింది


Wed,April 17, 2019 11:35 PM

రామచంద్రాపురం : కన్నబిడ్డలనే తండ్రి కడతేర్చిన వైనం భారతీనగర్ డివిజన్‌లోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాకు చెందిన కుమార్ మేస్త్రీ పని చేస్తు జీవనం సాగించేవాడు. 12 సంవత్సరాల క్రితం శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు జన్మించారు. పెద్ద కూతురు మల్లీశ్వరి (10), కుమారుడు అఖిల్ (6), కూతురు శరణ్య (4) ఉన్నారు. పెండ్లి అయిన సంవత్సరం వరకు భార్యభర్తలు సంతోషంగా ఉన్నప్పటికీ తర్వాత ఆమెపై కుమార్ అనుమానం పెంచుకుని మానసికంగా, శారీరకంగా వేదించసాగాడు. ప్రతిరోజు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యను, పిల్లలను కొట్టేవాడు. పిల్లలు తనకు పుట్టలేదని అనేవాడు. ప్రతిరోజు అతను పెడుతున్న బాధలను భరించలేక నెలరోజుల క్రితం అతని భార్య పటాన్‌చెరులోని చిన్నకంజర్లలో ఉండే అమ్మగారి ఇంటికి వెళ్లింది. ఆమె అమ్మగారి ఇంటికి వెళ్తుందని తెలిసి కుమార్ మార్గమధ్యలో అడ్డుపడి తనవద్ద నుంచి పిల్లలను బలవంతంగా తీసుకుని ఆర్సీపురానికి తీసుకుని వచ్చాడు. మంగళవారం రాత్రి 8గంటల సమయంలో శిరీష అమ్మకు ఫోన్‌చేసి ఆమెతో గొడవపడ్డాడు. ఎవరికో పుట్టిన పిల్లలను నా వద్ద విడిచిపెట్టి పోయిందని, నీ కూతురిని, ఈ పిల్లలను ఏదో ఒకరోజు చంపుతానని బెదిరించాడు. కాగా మంగళవారం రాత్రి కుమార్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు.

అప్పటికే పిల్లలు నిద్రిస్తున్నారు. చిన్నకూతురు శరణ్య(4)ను తాడుతో ఉరితీసి చంపి ఆమెను తన పక్కన పడుకోబెట్టాడు. తర్వాత కొడుకు అఖిల్(6) గొంతును కత్తితో కోసి చంపాడు. అనంతరం పెద్ద కూతురు మల్లీశ్వరీని కత్తితో పొడువబోతుండగా వెంటనే తేరుకుని తప్పించుకుంది. ఆ సమయంలో ఆ పాపకు మెడవద్ద గాయం అయింది. వెంటనే ఆ అమ్మాయి ఇంటి పక్కన వాళ్లకు చెప్పడంతో వాళ్లు వచ్చి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇంటి పక్కన వాళ్లు అతని భార్య శిరీషకు ఫోన్ చేసి జరిగిన విషయం తెలియజేశారు. అక్కడకు చేరుకున్న శిరీష అర్తనాథాలను ఆపడం ఎవరితరం కాలేదు. కాగా భార్య శిరీష ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ రాంచందర్‌రావు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని ఏసీపీ సంక్రాంతి రవికుమార్ పరిశీలించారు. ఇదిలావుంటే ఈ ఘటన ఇక్రిశాట్ పెన్సింగ్ ఏరియాలో సంచలనం సృష్టించింది. కన్నపిల్లలనే తండ్రి కిరాతంగా చంపిన వైనం ఆ ఏరియాలోని ప్రతిఒక్కరి మనస్సును కలిచివేసింది.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...