వైభవంగా జోగినాథ స్వామి రథోత్సవం


Tue,April 16, 2019 11:03 PM

అందోల్, నమస్తే తెలంగాణ: జోగిపేట పట్టణంలో జోగినాథ స్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. జోగినాథ స్వామి జాతరలో భాగంగా ఆదివారం రాత్రి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. రథం వద్ద పట్టణానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు, ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. రథం ఎదుట పటం వేసి అన్నం రతిపోసి, పూజారి భద్రప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు రథోత్సవం ఆదివారం రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించినప్పటికీ, అర్ధరాత్రి 12:30 గంటల తర్వాత ప్రారంభం కావడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జోగిపేట పట్టణంలో జరుగుతున్న జోగినాథ రథోత్సవాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాలకు చెందిన వారు, పట్టణానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ, రథోత్సవం ఆలస్యం కావడంతో నిర్వాహకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రథోత్సవం జరిగే సమయంలో అనుకున్న స్థాయిలో భక్తులు కన్పించలేదు.

రథోత్సవం సందర్భంగా రథాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించారు. పట్టణంలోని గౌని నుంచి రథం ఊరేగింపు ప్రారంభంకాగా, పోచమ్మ దేవాలయం, పబ్బతి హనుమాన్ దేవాలయాల మీదుగా జోగినాథ స్వామి ఆలయం వరకు చేరుకుంది. జోగినాథ స్వామికి జై, ఓం నమఃశివాయ అంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జోగిపేట పట్టణమంతా శివ నామస్మరణతో మారుమోగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ నాగభూషణంతో పాటు భక్త జనమండలి సభ్యులు ఆట-పాటల మధ్య రథాన్ని ముందుకు సాగింది. రథాన్ని భక్తులు శివ నామస్మరణ చేస్తూ తాళ్లతో లాగుతూ జోగినాథ ఆలయం వరకు తెల్లవారు జామున 3:30 గంటల వరకు చేరుకుంది.

రథోత్సవం సందర్భంగా రాత్రివేళలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. రథోత్సవానికి విచ్చేసిన భక్తుల దాహార్త్తిని తీర్చేందుకు మై హెర్త్ ఆర్గనైజేషన్ వారు ఏర్పాటు చేసిన ఉచిత నీటిని పంపిణీ కేంద్రాన్ని డాకూర్ మాజీ సర్పంచ్ శంకరయ్య, మున్సిపల్ కౌన్సిలర్ పిట్ల లక్ష్మణ్‌లు ప్రారంభించారు. జోగిపేట పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కవితా సురేందర్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ అల్లె శ్రీకాంత్, మాజీ ఎంపీపీ హెచ్ రామాగౌడ్, మాజీ ఎంపీటీసీలు ఎస్ సురేందర్‌గౌడ్, చిట్టిబాబు, వెంకటేశం, ఆకుల శంకర్, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు చాపల వెంకటేశం, చేనేత సంఘం మాజీ అధ్యక్షుడు పడిగె సత్యం, నాయకులు చింతకుంట భిక్షపతి, డాకూరి శంకర్, అల్లె గోపాల్, మహేశ్ యాదవ్, శంకర్ యాదవ్, అనిల్‌రాజ్, గాజుల అనిల్ పాల్గొన్నారు.

ఘనంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు..
జోగినాథ స్వామి ఉత్సవాల్లో భాగంగా సోమవారం జోగిపేట పట్టణంలో ఘనంగా ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలోని క్లాక్‌టవర్ మీదుగా గౌని, పోచమ్మ దేవాలయం, పబ్బతి హనుమాన్ దేవాలయం మీదుగా జోగినాథ స్వామి ఆలయం వరకు డప్పుచప్పుళ్లతో, యువకుల నృత్యాలతో ఎడ్లబండ్ల ఊరేగింపు కొనసాగించారు. జోగినాథ స్వామి ఆలయం చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షిణలను చేశారు. ఎడ్లబండ్లను ఆకట్టుకునే విధంగా చక్కటి రంగులతో అలంకరించి, ఊరేగింపు చేపట్టారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...