సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి


Tue,April 16, 2019 11:02 PM

సంగారెడ్డి చౌరస్తా: ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు దవాఖానల్లో సిజేరియన్ ప్రసవాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని రాష్ట్ర వైద్య, కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్ యోగితా రాణా వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాకు వచ్చిన కమిషనర్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా వైద్యాధికారులతో జేసీ నిఖిలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ పీహెచ్‌సీ వైద్యాధికారులు, హెల్త్ సూపర్‌వైజర్లు ప్రతివారం హైరిస్క్ కేసులను పర్యవేక్షించి మాతృ మరణాలు సంభవించకుండా చూడాలన్నారు. ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. మొదటిదశలోనే హైరిస్క్ గర్భిణులను గుర్తించి వారికి అన్ని విధాల సహాయపడాలని స్పష్టం చేశారు. సబ్‌సెంటర్ వారిగా ప్రతి ఆరోగ్య కార్యకర్త తప్పనిసరిగా గర్భవతులను గుర్తించి కేసీఆర్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆశాల ద్వారా గర్భవతులను గుర్తించి ఏఎన్‌ఎం, మెడికల్ అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు.

అదేవిధంగా గుర్తించిన హైరిస్క్ కేసులను రిఫరల్ దవాఖానలకు ట్యాగింగ్ చేయాలన్నారు. ప్రతి గర్భవతికి సుఖమైన సాధారణ ప్రసవం జరిగేలా వారికి నమ్మకం కలిగించాలని పేర్కొన్నారు. ప్రతి వారం హై రిస్క్ గర్భవతులను సబ్‌సెంటర్‌కు పిలిచి వారికి బీపీ, షుగర్, మూత్ర పరీక్షల వంటి మొదలగు పరీక్షలు విధిగా చేయాలని వివరించారు. అత్యవసర సమయంలో గర్భవతిని రిఫర్ చేసేందుకు ప్రతి సబ్ సెంటర్ ఏఎన్‌ఎం దగ్గర రూ.2,000, మెడికల్ అఫీసర్ దగ్గర రూ.5,000లను ఉంచడం జరిగిందని కమిషనర్ వెల్లడించారు. అయితే ఈ డబ్బులను 108, 102 వాహనాలు అందుబాటులో లేని సమయంలో మాత్రమే వాడుకోవాలని స్పష్టం చేశారు. అంతకుముందు ఉమ్మడి జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల పీహెచ్‌సీల వారిగా సమీక్షించారు. అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సమావేశంలో జేసీ నిఖిల, జిల్లా నోడల్ అధికారి డాక్టర్ జగన్నాథరావు, సంయుక్త సంచాలకులు డాక్టర్ పద్మజ, ఎన్‌సీడీ రాష్ట్ర అధికారి జగన్నాథరెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌వో మోజీరాం రాథోడ్, వైద్యాధికారులు అమర్‌సింగ్, వెంకటేశ్వర్లు, గాయత్రీదేవి తదితరులుపాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...