కమనీయం సీతారాముల కల్యాణం


Sun,April 14, 2019 11:57 PM

-సందడిగా రామాలయాలు...
-స్వామివారి కల్యాణానికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ప్రజాప్రతినిధులు..
అందోల్, నమస్తే తెలంగాణ: అందోలు నియోజకవర్గంలో ఆదివారం సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీతో పాటు అందోలు, పుల్కల్, మునిపల్లి, వట్‌పల్లి, నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని హత్నూర మండలాల పరిధిలోని గ్రామాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ రామనవమి సందర్భంగా రామాలయాలు, హనుమాన్ దేవాలయాలను నాలుగైదు రోజుల ముందు నుంచే ముస్తాబు చేశారు. జోగిపేటలో నిర్వహించిన కల్యాణ వేడుకల్లో అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. పుల్కల్ మండలంలోని ముదిమాణిక్యంలోని రామాలయంలో కన్నుల పండుగగా కల్యాణాన్ని జరిపించారు.

అందోలు-జోగిపేట పట్టణంలో..
పట్టణంలోని వీరహనుమన్, పబ్బతి హనుమాన్ దేవాలయాలలో సీతారాముల కల్యాణ మహోత్సవం కమనీయంగా జరిపించారు. ఆయా దేవాలయాల ముందు మండపాలను ఏర్పాటు చేసి, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. వీరహనుమాన్ దేవాలయం వద్ద పట్టణానికి చెందిన దయాకర్, సంగమేశ్వర్, గాజుల అనిల్, రాము, సుమన్‌ల దంపతులు కల్యాణాన్ని నిర్వహించారు. పబ్బతి హనుమాన్ దేవాలయం వద్ద చాపల వెంకటేశం, డాకూరి సురేశ్ దంపతులు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. మండల పరిధిలోని పోసానిపేట, తాలెల్మతో పాటు తదితర గ్రామాల్లో సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ఆలయ కమిటీ సభ్యులు పురం లక్ష్మణ్, మాణయ్య, పులుగం శ్రీనివాస్, రాఘవేందర్, చిట్టి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
జోగిపేట పట్టణంలోని వీర హనుమాన్, పబ్బతి హనుమాన్ దేవాలయాల వద్ద నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకల్లో అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పాల్గొన్నారు. సీతారాముల విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ కవితా సురేందర్‌గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు పిట్ల లక్ష్మణ్, గాజుల నవీన్, ప్రదీప్‌గౌడ్, మార్కెట్ డైరెక్టర్ మల్లికార్జున్, మాజీ ఎంపీపీ హెచ్.రామాగౌడ్, చేనేత సంఘం మాజీ అధ్యక్షుడు పడిగె సత్యం, ఉల్వల సురేశ్, మహేశ్ యాదవ్ పాల్గొన్నారు.

వట్‌పల్లి: వట్‌పల్లి మండల పరిధిలోని గ్రామాల్లో శ్రీ రామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని సాయిపేట, నిర్జిప్ల, మర్వేల్లి, ఖాదిరాబాద్ తదితర గ్రామాల్లో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపించారు. ఈ వేడుకల్లో మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు వీరారెడ్డి, సర్పంచ్ స్వర్ణలతరెడ్డి పాల్గొన్నారు.
మునిపల్లి: మండల పరిధిలోని చిన్నచెల్మెడలో శ్రీరామనవమి వేడుకలను ఆదివారం ఘనంగా చేపట్టారు. కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్ విజయ్ భాస్కర్, ఎంపీటీసీ దాచమ్మ, నాయకులు రాజశేఖర్, వీరన్న, నరేశ్, మొగులయ్య పాల్గొన్నారు.

హత్నూర: మండలంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండల పరిధిలోని నవపేట, హత్నూర, చింతల్ చెరువు, కాసాల, దౌల్తాబాద్, బోరుపట్ల గ్రామాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు.

పుల్కల్: మండల పరిధిలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మండల పరిధిలోని ముదిమాణిక్యం రామాలయంలో, చౌటకూర్, ఇటిక్యాల, కొర్పోల్, సుల్తాన్‌పూర్, శివ్వంపేట హనుమాన్ దేవాలయాలలో సీతా రామచంద్రుల కల్యాణాన్ని జరిపించారు. శ్రీరామ నవమి సందర్భంగా గ్రామాలలో ధార్మిక శోభ కనిపించింది. ఈ సందర్భంగా సీతారామ చంద్రుల ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...