కేసీఆర్ సైనికులం


Mon,March 25, 2019 11:53 PM

- పాటిల్‌కు సీఎం మరోసారి అవకాశం ఇచ్చారు...
- భారీ మెజార్టీతో గెలిపించుకుందాం
- టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో దేశమే తెలంగాణ వైపు చూస్తున్నది
- 16 ఎంపీ సీట్లు గెలిపించుకోవడం మన బాధ్యత
- 3న కేసీఆర్ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలి
- సభకు 2లక్షల మంది తరలిరావాలి
- జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మనది సీఎం కేసీఆర్ వర్గం, మనం కేసీఆర్ సైనికులం. ఆయన ఆదేశాలను పాటించాలి. జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్‌ను సీఎం కేసీఆర్ బరిలో పెట్టారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉన్నది. 2014 ఎన్నికల్లో పాటిల్‌కు 1.42 లక్షల మెజార్టీ వచ్చింది. ఈసారి మెజార్టీ 2.50 లక్షలు రావాలి. అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశమే ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నది. ఈ పథకాలు దేశ వ్యాప్తం కావాలంటే 16 ఎంపీ స్థానాలను గెలింపించుకోవాలి. కేంద్రంలో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తే అనుకున్నది సాధిస్తామని రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని బాలాజీ మంజీరా గార్డెన్స్‌లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మంత్రి మాట్లాడారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రితో పాటు ఇతర నేతల ప్రసంగాలు వారి మాటల్లోనే...కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి భరత్‌కుమార్, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దఫ్తేకర్ రాజు, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మురళీయాదవ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారులు భాస్కర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డిలతో పాటు పార్లమెంట్ పరిధిలోని జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దేశం తెలంగాణ వైపు చూస్తుంది...
సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో భారతదేశమే ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నది. నాలుగున్నరేండ్లుగా అమలవుతున్న పథకాలు, అభివృద్ధి ప్రజల అనుభవంలోకి వచ్చాయి. అభివృద్ధి ఫలాలను అన్నివర్గాల ప్రజలు అనుభవిస్తున్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. 90 శాతం సర్పంచులు కూడా టీఆర్‌ఎస్ మద్దతు దారులే. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్టు, రైతుబీమా, రైతు బంధు, 24 గంటల విద్యుత్ సరఫరా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అనేక కార్యక్రమాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుని అక్కడ అమలు చేస్తున్నాయి. దేశమంతా ఇప్పుడు కేసీఆర్ మోడల్ పథకాలు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఉండాలని ఆయా రాష్ట్రల ప్రజలు కోరుకుంటున్నారు. మన పథకాలు దేశానికి అందాలంటే సీఎం కేసీఆర్ కేంద్రంలో కీలక పాత్ర పోషించాలి. అందుకోసం రాష్ట్రంలోని ఒక ఎంఐఎం స్థానంతో పాటు 16 టీఆర్‌ఎస్ ఎంపీ స్థానాలను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. 2014 ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసిన బీబీ పాటిల్ 1.42 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఐదేండ్ల పాటు నియోజకవర్గ అభివృద్ధి ఎంతో కృషి చేశారు. సౌమ్యుడు, అందరితో కలుపుగోలుగా ఉండే బీబీ పాటిల్‌కు సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. ఆయనను ఈసారి 2.50లక్షల మెజార్టీతో గెలిపించుకోవాలి. రైల్వేలు, జాతీయ రహదారులకు నిధులు తీసుకువచ్చారు. సీఎం గా కేసీఆర్ ఉన్నారు. ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ వారే ఉన్నారు. ఎంపీలను కూడా టీఆర్‌ఎస్ వారినే గెలిపించుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఈ విషయాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలి. అందరం కేసీఆర్ వర్గం, కేసీఆర్ సైనికులం. కష్టపడి పనిచేసి భారీ మెజార్టీతో పాటిల్‌ను గెలిపించుకుం దాం. వచ్చే నెల 3న అల్లాదుర్గంలో జరిగే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బహిరంగ సభకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావాలి. దాదాపు 2 లక్షల మందితో సభను సక్సెస్ చేయాలి.
- వేముల ప్రశాంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి

కేంద్రం నుంచి నిధులు సాధించుకుందాం
బీబీ పాటిల్‌ను జహీరాబాద్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకోవడం ద్వారా కేంద్రం నుంచి అధిక నిధులు సాధించుకోవచ్చునని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేశారు. ఈ ఎన్నికల్లో అంతకు మించి పనిచేసి పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకురావాలని కోరారు. ఓటర్లందరినీ ఒప్పించాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వారికి వివరించాలని సూచించారు.

మరోసారి దీవించండి
ఐదేండ్లలో పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన. కేంద్రం నుంచి రైల్వే, రహదారులకు నిధులు తీసుకువచ్చా. సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలోని ఎంపీల కేంద్రంలో పట్టుబట్టడంతోనే హైకోర్టు, బయ్యారం స్టీల్ ప్లాంట్లు మంజూరయ్యాయి. పార్లమెంట్ పరిధిలోని కామారెడ్డి జిల్లాకు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని తీసుకువచ్చాం. ఝరాసంగానికి కేంద్రీయ విద్యాలయం వచ్చింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే పనులు చేపట్టాం. 708 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేసుకుంటున్నాం, నిమ్జ్ పూర్తైతే దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారంతోనే కేంద్రం నుంచి నిధులు సాధించగలిగాం. పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎంతో సహకారం అందించారు. తిరిగి ఎంపీగా గెలిపిస్తే మరింత అభివృద్ధికి కృషి చేస్తా. కేంద్రం నుంచి అధిక నిధులు సాధించుకోవాలంటే అన్ని ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుకోవాల్సి ఉన్నది. ఇందుకు పార్టీ శ్రేణులంతా టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేలా ప్రజలకు విస్త్రృతంగా ప్రచారం చేయాలి. రానున్న రోజుల్లో పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తా.
- బీబీ పాటిల్, ఎంపీ అభ్యర్థి, జహీరాబాద్

డబుల్ మెజార్టీతో గెలిపిద్దాం
గత ఎన్నికల్లో కంటే డబుల్ మెజార్టీతో బీబీ పాటిల్‌ను గెలిపించుకోవాలి. సర్కారు పెన్షన్లను రెట్టింపు చేసినప్పుడు మనం మెజార్టీ కూడా రెట్టింపు ఇవ్వాలి. ఇందుకు నాయకులు, కార్యకర్తలు బాగా కష్టపడాలి. అన్ని గ్రామాల్లో తిరిగి ప్రచారం చేయాలి. సీఎం కేసీఆర్ సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం. సర్పంచ్‌లు మనవాళ్లే. ఇప్పుడు ఎంపీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.
- భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే నారాయణఖేడ్

మెజార్టీ ఇవ్వడం మన బాధ్యత
జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్‌ను మంచి మెజార్టీతో గెలిపించడం పార్లమెంట్ పరిధిలోని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల బాధ్యత. మంచి చేసే వారిని, మంచి సర్కారును గెలింపించుకోవాలని కార్యకర్తలు ప్రచారం చేయాలి. ఇప్పుడు బాగా కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలుచుకుని సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం. రాష్ట్ర స్థాయి నాయకుడు మొదలుకుని బూత్‌స్థాయి కార్యకర్త వరకు కష్టపడాలి.
- ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి

మైనార్టీలు టీఆర్‌ఎస్ వెంటే...
ముస్లిం, మైనార్టీలు అంతా కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెంటే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులకే ఓట్లు వేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులకే ఓట్లు వేస్తారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి రూ.4వేల కోట్ల బడ్జెట్ పెడితే, రాష్ట్ర ప్రభుత్వం రూ. 2వేల కోట్లు పెట్టింది. రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో కేవలం రూ.38 కోట్లు మాత్రమే మైనార్టీల బడ్జెట్ ఉండేది. ఒక్క ఓటు కూడా పోకుండా మైనార్టీలు మొత్తం టీఆర్‌ఎస్‌కే వేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలను గెలిపించుకున్నట్లే పార్లమెంట్ సభ్యులను గెలిపించుకుందాం.
- ఫరీదుద్దీన్, ఎమ్మెల్సీ, జహీరాబాద్

15 రోజులు కష్టపడాలి...
ఎన్నికలకు ఇంకా 15 రోజుల సమయమే ఉన్నది. ఈ తక్కువ సమయాన్ని ఏ మాత్రం వృథా చేయకుండా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రచారం చేయాలి. నాయకులు, కార్యకర్తలు కష్టపడాలి. శాసన సభ, సర్పంచ్ ఎన్నికల్లో బాగా పనిచేయడం వల్లే భారీ మెజార్టీలతో ఎమ్మెల్యేలు గెలుపొందారు. మెజార్టీ సర్పంచ్‌లు మనవాళ్లే ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంతకుమించి పనిచేయాలి. భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఎంపీ బీబీ పాటిల్‌కు సీఎం కేసీఆర్ రెండో సారి అవకాశం కల్పించారు. పాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం.
- హనుమంతు షిండే, ఎమ్మెల్యే జుక్కల్

సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం
జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇతర రాష్ర్టాలు కూడా మన పథకాలను ప్రవేశపెట్టడం కేసీఆర్ ఘనతగా చెప్పుకోవచ్చు. ప్రజలంతా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ ఇచ్చారు. ఎమ్మెల్యేలందరినీ గెలిపించారు. బీబీ పాటిల్‌ను గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాలి. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి.
- మాణిక్‌రావు, ఎమ్మెల్యే జహీరాబాద్

కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు పదవులే ముఖ్యం...
ప్రజా సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుంటే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులే కేవలం పదవుల కోసమే పనిచేశారు. కానీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. ఈక్రమంలోనే కాంగ్రెస్, బీజీపీ, ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వరదలా టీఆర్‌ఎస్‌లో చేరిపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను గెలిపించడం ద్వారా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి. 3న అల్లాదుర్గంలో జరిగే సీఎం కేసీఆర్ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా నాయకులు ఏర్పాట్లు చేయాలి. సభను గ్రాండ్ సక్సెస్ చేయాలి.
- చంటి క్రాంతి కిరణ్, ఎమ్మెల్యే అందోలు

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...