నేడే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు


Mon,March 25, 2019 11:51 PM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీకి జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం తేలనున్నాయి. రెండు స్థానాలకు హోరా హోరీగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది ఎవరోనని ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం సాయంత్రం ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

కరీంనగర్ కేంద్రంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 22న ఎన్నికలు జరిగాయి. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది, ఉపాధ్యాయ నియోజవకర్గం నుంచి ఏడుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. పట్టభద్రుల స్థానంలో 1,95,581 ఓట్లు ఉండగా 1,16,156 ఓట్లు పోలైనాయి. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 23,160 ఓట్లు ఉండగా 19,376 ఓట్లు పోలైనాయి. ఈ ఓట్లను లెక్కించేందుకు అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు 14, పట్టభద్రుల ఓట్ల లెక్కింపునకు మరో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌లో వెయ్యి ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. అయితే లెక్కింపు సిబ్బందిని ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రం వద్ద రిపోర్ట్ చేయాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు 7 గంటల వరకు రావాలని కోరారు. 7.15 గంటలకు స్ట్రాంగ్ రూం ల తాళాలు తెరుస్తారు. 7.30 గంటలకు బ్యాలెట్ బాక్స్‌లు తెరుస్తారు. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు.

ప్రతి రౌండ్‌కు వెయ్యి ఓట్లు..
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తి కరంగా మారింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం వేరు వేరుగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లపై ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. మొత్తం 409 బ్యాలెట్ బాక్స్‌లు ఉన్నాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి 220 కామన్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఒకే బ్యాలెట్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో పడిన ఓట్లను అభ్యర్థులు, వారి ఏజెంట్ల ద్వారా ముందుగానే వేరు చేస్తారు. ఒక్కో టేబుల్‌పై ప్రతి రౌండ్‌కు వెయ్యి ఓట్ల లెక్కన లెక్కిస్తారు. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో తక్కువగా అంటే 19,376 ఓట్లు మాత్రమే పోలవడంతో రెండో రౌండ్‌లోనే లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పిలిమినరీ కౌంటింగ్‌లో ఫలితాలు తేలక పోతే సబ్ పార్సిల్ సిస్టమ్ లో ఓట్లు లెక్కించి ఫలితాలు తేల్చుతారు. ఈ లెక్కన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు మధ్యాహ్నం వరకు అందే అవకాశాలు ఉన్నాయి. ఇక పట్టభద్రుల స్థానానికి 1,16,156 ఓట్లు పోలైనందునా 9 రౌండ్లలో లెక్కింపు జరిగే అవకాశం ఉంది. పిలిమినరీ రౌండ్‌లోనే ఫలితాలు తేలితే అర్థరాత్రి వరకు ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకా శం ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక వేళ ఫలితం లేలని పక్షంలో సబ్ పార్సల్ సిస్టమ్‌లో తిరిగి లెక్కింపు ప్రారంభిస్తారు. దీంతో ఫలితం మరింత ఆలస్యం కావచ్చని భావిస్తున్న అధికారులు అందుకు కావల్సిన ముందస్తు ఏర్పాట్లను చేసుకున్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...