గులాబీ శంఖారావం


Sat,March 23, 2019 01:09 AM

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధానప్రతినిధి : అధికార టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు శుక్రవారం కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌లకు సంబంధించి నామినేషన్లు దాఖలు అయ్యాయి. మెదక్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌లతో కలిసి వచ్చి ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో బీబీ పాటిల్ తరఫున ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, కాంత్రి కిరణ్, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దిన్‌లు నామినేషన్ వేశారు. కాగా నామినేషన్ల దాఖలకు చివరి రోజైన 25న బీబీ పాటిల్ స్వయంగా మరో సెట్టు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా కొత్త ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం చిన్నకోడూరు నుంచి ప్రచారం మొదలుపెట్టారు. 25న జహీరాబాద్‌లో కార్యకర్తల సమావేశంతో బీబీ పాటిల్ ప్రచారం మొదలుకానున్నది. అదే రోజు ఆయన కేతకీ సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాగా శనివారం మధ్యాహ్నం సంగారెడ్డి పట్టణంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌లు హాజరుకానున్నారు. ప్రణాళిక బద్ధంగా విస్త్రత ప్రచారానికి టీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసుకుంటున్నారు. గెలుపు ఖాయమేనని భారీ మెజార్టీయే తమ లక్ష్యమని టీఆర్‌ఎస్ నాయకులు ధీమాతో ప్రచారంలో నిమగ్నం అయిపోయారు.

కొత్త ప్రచారం షురూ...
మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేసిన ఆయన ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, రామలింగారెడ్డిలతో కలిసి సిద్దిపేటకు వెళ్లారు. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు నుంచి సాయంత్రం ప్రచారాన్ని ప్రారంభించారు. రోడ్‌షోతో పాటు కార్యకర్తల బహిరంగసభ నిర్వహించారు. మొదటి రోజు సిద్దిపేట జిల్లాలో ప్రచారం చేసిన ఆయన రెండో రోజూ శనివారం సంగారెడ్డి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశంతో పాటు ఇతర కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

నేడు సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశం..
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సంగారెడ్డిలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణంలో మల్కాపూర్ చౌరస్తాలోని గోకుల్ గార్డెన్స్‌లో కార్యక్రమం ఉన్నది. ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్, ఎమ్మెల్సీలు ఫారుక్‌హుస్సేన్, భూపాల్‌రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణలు హాజరుకానున్నారు. భారీ మెజార్టీ లక్ష్యంగా ఎన్నికల ప్రచార వ్యూహాలు, ఇంటింటి ప్రచారంపై గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలకు ముఖ్య అతిథులు దిశా నిర్ధేశం చేయనున్నారు.

సోమవారం నుంచి పాటిల్ ప్రచారం...
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బీబీ పాటిల్ సోమవారం నుంచి ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. శుక్రవారం ఆయన తరుఫున ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేయగా నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన 25న పాటిల్ స్వయంగా వచ్చి నామినేషన్ వేయనున్నారు. ఆరోజు కూడా ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులు హాజరుకానున్నారు. అదే రోజు ముందుగా పాటిల్ ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నామినేషన్ వేసిన తరువాత జహీరాబాద్ పట్టణంలో నిర్వహించే నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.

నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ సభ...
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి భారీ బహిరంగసభకు సన్నాహాలు చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోకజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరానున్నారు. సీఎం కేసీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఈ సభను ఏడు నియోజకవర్గాల మధ్యలో ఉండే నర్సాపూర్ పట్టణంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఏ రోజు సభ ఉంటుందో త్వరలోనే పార్టీ వెల్లడించనున్నది. ఇదిలా ఉండగా ఇప్పటికే మెదక్ పార్లమెంట్‌కు సంబంధించి మెదక్ పట్టణంలో సన్నాహక సమావేశం జరిగిన విషయం తెలిసిందే. కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్య కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తరలివెళ్లిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సీఎం సభ ఎక్కడ ఉంటుందో తెలియాల్సి ఉన్నది. ఇటీవలే సన్నాహక సభను కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలం మాగీలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీఎం సభను సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తారా..? కామారెడ్డి జిల్లాలోఉంటుందో పార్టీ అధిష్టానం వివరాలు వెల్లడించనున్నది.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...