సిట్టింగులకే


Fri,March 22, 2019 04:25 AM

-కొత్త ప్రభాకర్ రెడ్డి, బీ పాటిల్‌కే ఎంపీ టిక్కెట్లు
-బీఫారాలు అందించిన సీఎం కేసీఆర్
-సమర్థవంతంగా పనిచేసి గుర్తింపు పొందిన ఇద్దరు...
-సీఎంకు సన్నిహితుడిగా కొత్తకు గుర్తింపు
-కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కృషి
-నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు
-గెలుపు ఖాయం... భారీ మెజార్టీయే లక్ష్యం...

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి :అధికార టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులుగా సిట్టింగులకే మరోసారి అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఎంపీలుగా పనిచేస్తున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌ల అభ్యర్థిత్వాలనే పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి ఇద్దరికీ సీఎం కేసీఆర్ పార్టీ బీఫారాలు అందించారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొత్త ప్రబాకర్‌రెడ్డిలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. గత ఐదేండ్లుగా సమర్థవంతంగా తమ బాధ్యతలు నిర్వహించడంతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో సన్నిహితంగా ఉండి మంచి పేరుతెచ్చుకున్నారు. సౌమ్యులుగా ఇద్దరికీ పేరున్నది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సీఎం కేసీఆర్ సన్నిహితుడుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎంపీగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ, పార్టీ శ్రేణులను సమన్వయ పరిచే బాధ్యతలను సీఎం కేసీఆర్ ప్రభాకర్‌రెడ్డికి అప్పగించారు. కాగా ఉచిత వైద్య శిబిరాలు, స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి ఎంపీ బీబీ పాటిల్ సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. మొత్తంగా మొదటి నుంచి అనుకున్నట్లుగానే అధిష్టానం సిట్టింగులకే తిరిగి అవకాశం కల్పించింది. కాగా మెదక్ కలెక్టరేట్‌లో కొత్త, సంగారెడ్డిలో బీబీ పాటిల్‌లు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసుకున్నారు. నామినేషన్లు దాఖలైన వెంటనే ఇద్దరూ ప్రచారం మొదలుపెట్టనున్నారు.

గజ్వేల్ ఇన్‌చార్జ్‌గా కొత్తకు గుర్తింపు...
మెదక్ ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తూనే కొత్త ప్రభాకర్‌రెడ్డి సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. నియోజవర్గంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయ పరచే బాధ్యతలను సీఎం అప్పగించిన విషయం తెలిసిందే. గజ్వేల్‌లో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయించడంలో తన వంతు కృషి చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కొత్త గజ్వేలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారాన్ని నిత్యం పర్యవేక్షించారు. రోజువారీగా స్వయంగా ఆయన గ్రామాల్లో ప్రచారం చేస్తూ పరిస్థితిని సమీక్షించారు. ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సూచనలు, సలహాలు తీసుకుంటా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశారు. గజ్వేల్‌తో పాటు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సిద్దిపేట, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో కూడా విస్త్రతంగా పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అధికారులతో కూడా సమీక్షలు జరిపారు. గజ్వేల్‌లో నాయకులు, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలిసేలా అందరితో సానిహిత్యం పెంచుకున్నారు. 2014లో మెదక్ ఎంపీ స్థానం నుంచి గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేసిన విషయం తెలిసిందే. సీఎం పదవి చేపట్టిన తరువాత సీఎం మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంలో అప్పుడు ఉపఎన్నిక అనివార్యమైన విషయం కూడా విధితమే. 2014లోనే జరిగిన ఉప ఎన్నికలో కొత్త ప్రభాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్ నుంచి విజయం సాధించారు.

ఎంపీలిద్దరూ సౌమ్యులే...
టీఆర్‌ఎస్ నుంచి రెండోసారి పోటీచేస్తున్న ప్రస్తుత ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌లు సౌమ్యులుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. వివాదాలకు దూరంగా ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ శ్రేణులతో కలిసి పనిచేశారు. విభేదాలకు ఏమాత్రం తావివ్వకుండా ఐదేండ్లు అందరితో కలిసి సమర్థవంతంగా పనిచేశారు. కేంద్రం నుంచి వివిధ శాఖలకు రావాల్సిన నిధులు రాబట్టడంలో కూడా ఇద్దరూ తమవంతు కృషి చేశారు. జాతీయ రహదారులు, రైల్వేలైన్ల పనులు వేగంగా పూర్తి చేయించడంతో పాటు కేంద్రీయ విద్యాలయాలు, పాస్‌పోస్టు కేంద్రాలను తీసుకువచ్చారు. సౌమ్యులుగా అందరితో సన్నిహితంగా ఉండటంతోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు బహిరంగ సభల్లోనే మెచ్చుకునేవారు.

తక్కువ మాట్లాడుతారు.. ఎక్కువ పనిచేస్తారంటూ కితాబిచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత స్టడీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా బీబీ పాటిల్ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ వ్యాపార వేత్త అయిన పాటిల్ వీరశైవ లింగాయత్ పౌండేషన్‌కు చైర్మన్‌గా, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 2014లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసిన పాటిల్ భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

జహీరాబాద్, మెదక్ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్ ఇద్దరికీ పార్టీ బీఫారాలు అందించిన వెంటనే నామినేషన్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నామినేషన్లను సంగారెడ్డి కలెక్టరేట్, మెదక్ నామినేషన్లను మెదక్ కలెక్టరేట్‌లో దాఖలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఉదయం 10 గంటలకు కొత్త ప్రభాకర్‌రెడ్డి మెదక్‌లోని పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఆ తరువాత సిద్దిపేట నియోజకవర్గంలోని పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా బీబీ పాటిల్ కూడా శుక్రవారం సంగారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులతో కలిసి రానున్నారు. ఇప్పటికే మెదక్‌లో మెదక్ పార్లమెంట్ సన్నాహక, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.

కాగా దాదాపు టిక్కెట్ తమకై ఖరారు అవుతుందని ముందే తెలియడంతో ఇద్దరు ఎంపీలు ఇప్పటికే ప్రచార రథాలను సిద్ధం చేసుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అధిష్టానం అభ్యర్థులకు అందించింది. రైతుబంధు చెక్కుల పంపిణీ, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా, గొర్రెలు, బర్రెల పంపిణీ వంటి వివరాలు అందులో పొందుపరిచారు. వాటినే ప్రచార హస్ర్తాలుగా శ్రేణులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయనున్నారు.

గెలుపు ఖాయమే... మెజార్టీయే లక్ష్యం
రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ బలమైన శక్తిగా ఉన్నది. ఈ క్రమంలో ఇద్దరు ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌ల గెలుపు ఖాయమే అయినప్పటికీ భారీ మెజార్టీయే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 65 శాతానికి పైగా ఓట్లు టీఆర్‌ఎస్‌కు రావాలని ఇందుకు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ సూచించారు. ప్రణాళిక బద్ధంగా ప్రచారం చేయడంతో పాటు ఓటింగ్ శాతం పెంచడాన్ని కూడా పార్టీ శ్రేణులు సవాల్‌గా తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు ప్రచార ప్రణాళికలు రూపొందించారు. వాటి ఆదారంగా అభ్యర్థ్ధులతో ప్రచారం చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు..

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...