కాంగ్రెస్ ఖల్లాస్...!


Thu,March 21, 2019 12:01 AM

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : హస్తం పార్టీ జిల్లాలో అంపశయ్యపై కొట్టుమిట్టాడుతున్నది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకులు సైతం గులాబీ సునామీకి కనుమరుగయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత పదవులు పొందిన దామోదర రాజనరసింహ, గీతారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డిలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమితో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా ఒక్క సంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి గెలుపొందినా, చిక్కడు దొరకడు అనే విధంగా నియోజకవర్గానికి, పార్టీకి దూరంగానే ఉంటున్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉన్నది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సన్నాహక, ప్రచార సభలతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరిస్తే కాంగ్రెస్‌లో ఎలాంటి ఉత్సాహం కనిపించడం లేదు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పటికీ ఇంకా ఎలాంటి సందడి కనిపించడం లేదు. సీనియర్ నేతలందరూ పోటీకి దూరంగా ఉండడం, కింది స్థాయి కార్యకర్తలు ఇతర పార్టీలకు వలసలు వెళ్లడంతో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది.

ఒకప్పుడు ఓ వెలుగు వెలిసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంపశయ్యపై కొట్టుమిట్టాడుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ పార్టీ కడు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నది. హేమా హేమీలైన జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు టీఆర్‌ఎస్ జోరు, గులాబీ హోరులో కొట్టుకుపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఏలిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఒకరు, పార్టీలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన సీనియర్ మంత్రులు గీతారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డిలు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమిలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఓ వైపు పార్లమెంట్ సన్నాహక, మరో వైపు ఎన్నికల ప్రచార సభలతో అధికార టీఆర్‌ఎస్ ఎన్నికల శంఖారావం పూరిస్తే ఉమ్మడి జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌లో ఎలాంటి ఉత్సాహం కనిపించడం లేదు. మెదక్, జహీరాబాద్ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ పెద్దగా స్పందన లేకపోవడం గమనార్హం. అయితే సీనియర్ నేతలందరూ పోటీకి దూరంగా ఉండడం కూడా ఆ పార్టీలో చర్చ జరుగుతున్నది. మరోవైపు గులాబీ దళంలోకి చేరికల వలసల పరంపర కొనసాగుతుండడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితిపై నమస్తే తెలంగాణ విశ్లేషణాత్మక కథనం.

కూలిన గీత కోట..
కాంగ్రెస్‌లో సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన గీతారెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్‌లో ఓటమి చెందకతప్పలేదు. జహీరాబాద్‌ను తన కోటగా మార్చుకున్న ఆమెకు గత ఎన్నికల్లో ఫలితాలు కోలుకోలేని షాక్‌నిచ్చాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఇక్కడి నుంచి కూడా తన గెలుపు ఖాయమని ఆమె భావించగా ప్రజలు మాత్రం టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. అధికార పార్టీ నుంచి పోటీ చేసిన మాణిక్‌రావును భారీ మెజార్టీతో గెలిపించారు. తన ఓటమిని ఆమె ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందే నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు జహీరాబాద్ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. రోజువారీగా వరుసపట్టి టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతోనే కాంగ్రెస్ ఇక ఆగమైనట్లేనని అందరూ నిర్ణయించుకున్నారు. ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ టీఆర్‌ఎస్ బలమైన శక్తిగా ఆవిర్భవించగా కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలకు మించి ఫలితాలు రానున్నాయని టీఆర్‌ఎస్ శ్రేణులు లెక్కలు వేస్తున్నాయి.

కారు జోరుకు నర్సాపూర్ విలవిల...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో నర్సాపూర్‌లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌లో ఇప్పుడు చిమ్మచీకట్లు అలుముకున్నాయి. ఇదే తరుణంలో ఊహించని స్థాయిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడంతో కాంగ్రెస్ షాక్‌కు గురైంది. మాజీ మంత్రి, పార్టీలో సీనియర్ అయిన సునీతాలకా్ష్మరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి చిత్తుగా ఓటమి చెందారు. ముమ్మాటికి తన గెలుపు ఖాయమని ప్రచారం చేసుకున్నారు. కానీ ప్రజలు మాత్రం రెండోసారి టీఆర్‌ఎస్ పాలనకే పట్టం కట్టారు. వయసు మీదపడినప్పటికీ నిత్యం జనంలోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మదన్‌రెడ్డి మంచి తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు ఆయనను గెలిపించుకున్నారు. ఓటమి తరువాత సునీతాలకా్ష్మరెడ్డిలో ఉత్సాహం తగ్గింది. మెదక్ జిల్లాకు డీసీసీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు కూడా. అధ్యక్షురాలిగా పార్టీ కార్యక్రమాలు కూడా పెద్దగా నిర్వహించలేదు. జిల్లాలోనే ఉన్నవే మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు. మెదక్ పార్టీలో గ్రూపులు కొనసాగుతున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, సునీతాలకా్ష్మరెడ్డి రెండు గ్రూపుల మధ్య ఉన్న కొద్ది మంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కూడా ఇప్పటికీ మదన్‌రెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుండగా టీఆర్‌ఎస్ బలమైన శక్తిగా ముందుకు సాగుతున్నది. ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌కు అద్భుతమైన ఫలితాలుంటాయని టీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.

ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా ఒక్క సంగారెడ్డిలో చావుతప్పి కన్నులొట్టపోయినట్లు కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి గెలుపొందారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఒక్కసీటైనా వచ్చిందని సంతోషపడాలో..? రోజు వారీగా కాంగ్రెస్ పార్టీపైనే ఆరోపణలు చేస్తున్న జగ్గారెడ్డి వైఖరితో ఏడవాలో ఆ పార్టీ శ్రేణులకు ఆర్థం కావడం లేదు. ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జగ్గారెడ్డి కేవలం మీడియాకే పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో పెద్దగా పర్యటించడం లేదు. హైదరాబాద్‌లోనే ఎక్కడో ఓ చోట ప్రెస్‌మీట్లు పెట్టి సీఎం కేసీఆర్‌ను మెచ్చుకుంటున్నారు. సంగారెడ్డి అభివృద్ధికి సీఎంను కలుస్తానంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో పైరవీ కారులకే స్థానం ఉన్నదని, ఢిల్లీ చుట్టూ రాజకీయాలు చేసినవారిది హవా ఉన్నదని కూడా విమర్శలు చేస్తున్నారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగగా అదేమీ లేదని ఆయన ఖండించారు. జరుగుతుందంతా చూస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయన ప్రజల్లోకి రాకుండా పట్నానికి పరిమితమైపోయారని ఆగ్రహిస్తున్నారు. తాను ఆరునెలల వరకు ఎవరికి అందుబాటులో ఉండనని, భార్య విజయనిర్మల అంతా చూసుకుంటుందని జగ్గారెడ్డి కార్యకర్తలకు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఏ నిర్ణయం తీసుకోనున్నారు..? ఏం చేయబోతున్నారనేది చర్చగా మారింది. ఇదిలా ఉండగా జగ్గారెడ్డి వైఖరితో కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితులుండగా అధికార టీఆర్‌ఎస్‌లో మాత్రం జోరు కొనసాగుతున్నది. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణలతో పాటు పార్టీ శ్రేణులంతా జనంలోనే ఉంటూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయ్యారు.

సిద్దిపేట గులాబీ పూదోట..
ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేట గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ నియోజకర్గంలోనే ప్రతిపక్షమే లేదు. అంతా గులాబీ మయమే. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును అసెంబ్లీ ఎన్నికల్లో 1.18 లక్షల మెజార్టీతో ప్రజలు గెలిపించుకున్న విషయం తెలిసిందే. సిద్దిపేట కూడా అభివృద్ధికి నమూనా, అవార్డులకు కేంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. నియోజకవర్గ అభివృద్ధి కోసం హరీశ్‌రావు ఎంతో కృషి చేస్తున్నారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ప్రభావమే లేదు. ఎన్నికల సమయంలో ఎవరో ఒకరు పేరుకోసం పోటీ చేయడం తప్ప పెద్దగా ఓట్లు వచ్చేది ఉండదు. యేటికేడు ఎన్నికల్లో హరీశ్‌రావుకు మెజార్టీ పెరుగుతూ రావడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్‌గౌడ్ పనిచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తులో భాగంగా సిద్దిపేటను టీజేఎస్‌కు కేటాయించారు. కారు జోరుతో ఆ రెండు పార్టీలు తిరిగి కోలుకోలేని దారుణమైన ఓటమిని మూటగట్టుకుని కనుమరుగయ్యాయి. ఇప్పట్లో ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు బలపడే పరిస్థితులు లేవు. జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి తిరుగులేని మెజార్టీ రానున్నదని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

కారుజోరుకు ఖేడ్‌లో కాంగ్రెస్ ఖాళీ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన నారాయణఖేడ్ నియోజకవర్గ దశ మార్చింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటు, ఆ తరువాత జిల్లాలు, రెవెన్యూ డివిజన్, కొత్త పంచాయతీల ఏర్పాటుతో ఖేడ్ పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ఖేడ్ ఇతర నియోజకవర్గాలతో అభివృద్ధిలో పోటీ పడుతున్నది. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగానే ఉన్నది. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్ చిత్తుగా ఓటమి చెందారు. విచిత్రంగా అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి బీజేపీలో చేరిపోయిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీలోకి వెళ్లడంతోనే దాదాపుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. అంతకుముందే మెజార్టీ స్థాయి నాయకులు, కార్యకర్తలు ప్రస్తుత ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి టిక్కెట్ రాకపోవడంతో బీజేపీలో చేరిపోయి పోటీ చేసిన సంజీవరెడ్డి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సురేష్‌షెట్కార్‌లు తమ దారుణ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరిద్దరి వైఖరితోనే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందని కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. భూపాల్‌రెడ్డి మాత్రం నిత్యం జనంలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తండాను పంచాయతీలను చేయడంతో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 90శాతానికి పైగా సర్పంచ్‌లు టీఆర్‌ఎస్ బలపర్చిన వారు గెలుపొందారు. ఈ లెక్కన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి భారీ మెజార్టీ రానున్నుట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

ఉన్నారు... కానీ ఎవరూ కనిపించరు..
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కనుమరుగైంది. ఇద్దరు ముగ్గురు నాయకులున్నా వారు జనాలకు ముఖం చాటేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి సోదరుడు ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. శశిధర్‌రెడ్డి కూడా నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి పోటీ చేశారు. తాను పోటీలో ఉన్నప్పటికీ చివరి క్షణంలో తమ్ముడికి సపోర్టు చేశారు. వారు ఇద్దరు ఏకమైనా నియోజకవర్గ ప్రజలు మాత్రం కర్రుకాల్చి వాత పెట్టినట్లుగా ఓడించారు. ప్రస్తుతం ఇద్దరు నాయకులు పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మరో నేత తిరుపతిరెడ్డిలు కూడా పార్టీలో ఉన్నప్పటికీ వారి ఉనికి పెద్దగా కనిపించడం లేదు. జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ మెదక్‌లో నేతలు, నాయకులు లేని కాంగ్రెస్ పార్టీగా మారిపోయిందని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వైపు కాంగ్రెస్ పరిస్థితి ఇలా దయనీయంగా ఉండగా మరోవైపు అధికార టీఆర్‌ఎస్ రెట్టింపు ఉత్సాహంతో జనంలోకి వెళ్తున్నది. పద్మాదేవేందర్‌రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మెదక్‌కు చెందిన శేరి సుభాష్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం కూడా విధితమే. ఇద్దరూ కలిసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారని పార్టీ శ్రేణులు మురిసిపోతున్నారు. ఇటీవలే మెదక్ పట్టణంలోనే మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఉత్సాహంతోనే నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నారు కూడా. కాంగ్రెస్‌లో మాత్రం నేతలు, ఎన్నికల వాతావరణం కనిపించడం లేదు.

గులాబీ దళానికి అండగా... మినీ ఇండియా
పారిశ్రామిక ప్రాంతంగా, మినీ ఇండియాగా పేరుపొందిన పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ ప్రభావం కనిపించడం లేదు. పటాన్‌చెరులోని అమీన్‌పూర్‌కు చెందిన గాలి అనీల్‌కుమార్‌ను కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు టీఆర్‌ఎస్‌లో ఉన్న ఆయన తనకు టిక్కెట్ ఇవ్వలేదని కాంగ్రెస్‌లో చేరిపోయారు. చివరకు ఆ పార్టీలో కూడా అనీల్‌కు అప్పుడు టిక్కెట్ ఇవ్వకుండా అమీన్‌పూర్‌కు చెందిన కాట శ్రీనివాస్‌గౌడ్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా ఇతర పార్టీలకు చెందిన నేతలంతా కాంగ్రెస్‌లో చేరారు. గోదావరి అంజిరెడ్డి, గాలి అనీల్‌కుమార్, వడ్డెర రాములు, సపాన్‌దేవ్, కాట శ్రీనివాస్‌గౌడ్, ఇతర నాయకులంతా కలిసికట్టుగా కాంగ్రెస్‌లో పనిచేశారు. అయినా మినీ ఇండియా ప్రజలు మాత్రం టీఆర్‌ఎస్ వెంటే నడిచారు. మహిపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారు. టీఆర్‌ఎస్ విజయం కాంగ్రెస్ నాయకులకు పెద్ద షాక్‌నిచ్చింది. అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి ఇప్పటి వరకు నాయకులంతా కనిపించకుండా పోయారు. ఈ తరుణంలో పార్టీలో సీనియర్ నాయకులు పోటీకి ముందుకు రాకపోవడంతో చివరకు అనీల్‌కుమార్‌కు టిక్కెట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ నుంచి జిన్నారం జడ్పీటీసీ కుంచాల ప్రభాకర్, ఎంపీపీ కొలన్ రవీందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొలన్ బాల్‌రెడ్డిలతో పాటు పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కారు జోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ రానున్నట్లు స్పష్టం అవుతుండగా కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోనున్నదో చూడాల్సి ఉన్నది.

అందోలులో ఆగమైపోయిన కాంగ్రెస్..
అందోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆగమైపోయింది. ఇక్కడ కూడా పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వరుసగా రెండు పర్యాయాలుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడాన్ని కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ జీర్ణించుకోలేకపోతున్నారు. తన గెలుపు ఖాయమని ధీమాతో ఉన్న ఆయన టీఆర్‌ఎస్ నుంచి చంటి కాంత్రి కిరణ్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ఖంగుతిన్నారు. రెండు పర్యాయాల ఓటమితో ఆయన చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గానికి కూడా పెద్దగా రావడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనడం లేదు. ఇక్కడ కూడా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ నాయకులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. క్రాంతి కిరణ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తున్నారు. జరుగబోయే ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మించి భారీ మెజార్టీ రాన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

కారెక్కిన ముత్యం... కాంగ్రెస్ ఖతం..
దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకమైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డిలు తమ అనుచరులతో కలిసి అసెంబ్లీ ఎన్నికల ముందే టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. దుబ్బాక కాంగ్రెస్‌కు పెద్దదిక్కు ముత్యం కాంగ్రెస్‌ను వీడడంతోనే ఆ పార్టీ మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంత కాలంగా పార్టీని వాళ్లే నడుపుతూ వచ్చారు. వారు టీఆర్‌ఎస్‌లోకి రావడంతో గులాబీ దళానికి మరింత బలం పెరిగింది. ప్రస్తుత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆధ్వర్యంలో దుబ్బాక అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సోలిపేట భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం కూడా విధితమే. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మద్దుల నాగేశ్వర్‌రెడ్డి దారుణ ఓటమి నుంచి కోలుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు దుబ్బాకలో కనిపించడం లేదు. ఓ వైపు టీఆర్‌ఎస్‌లో ఎన్నికల జోష్ కనిపిస్తుండగా కాంగ్రెస్ మాత్రం దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌కు చెందిన నాయకులు పట్నం నుంచి వచ్చిపోతుంటారని, ఎన్నికల తరువాత వారెవరూ ఇటుగారారని పార్టీ శ్రేణుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.

వంటేరుతోనే తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి నమూనాగా మారింది. ఇప్పుడు ఇక్కడంతా జై కేసీఆర్.. జై గజ్వేల్ నినాదమే వినిపిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కేసీఆర్ గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా ఎన్నికల తరువాత కాంగ్రెస్‌కు చెందిన వంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. వాస్తవానికి గజ్వేల్ కాంగ్రెస్ అంతో ఇంతో బతికి ఉందంటే వంటేరుతోనేనని చెప్పుకోవచ్చు. ఆయన పార్టీ మారడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు టీఆర్‌ఎస్‌లో ఉండి ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం కూడా విధితమే. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతాప్‌రెడ్డి, నర్సారెడ్డిలు కాంగ్రెస్‌లో పనిచేయగా ఇప్పుడు ప్రతాప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. పార్టీ, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా వంటేరు టీఆర్‌ఎస్‌లో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయనతో పాటే నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి కూడా పెద్దగా కనిపించడం లేదు. మొదట మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ చివరకు ఆయన తప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు పూర్తిగా వన్‌సైడే ఉండనున్నాయి. ప్రతిపక్షం లేని క్రమంలో ఏ స్థాయిలో మెజార్టీ రానున్నదనే లక్ష్యంతోనే కార్యకర్తలు పనిచేస్తున్నారు.



84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...