ముగిసిన ప్రచార పర్వం


Thu,March 21, 2019 12:00 AM

సంగారెడ్డి చౌరస్తా : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. 22వ తేదీన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌మ మెదక్ ఉమ్మడి జిల్లాలో పరిధిలోని ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. ఒకే రోజు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచే మద్యం దుకాణాలు బంద్ చేశారు. తిరిగి 22వ తేదీన సాయంత్రం, పోలింగ్ పూర్తైన తరువాత మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా జిల్లాలో జోరందుకున్న అభ్యర్థుల ప్రచార పర్వం బుధవారం సాయంత్రానికి ముగిసింది. దీంతో అటు పట్టభద్రులు, ఇటు ఉపాధ్యాయుల్లో ఎన్నికలపై ఉత్కంఠత నెలకొన్నది. పట్టభద్రుల స్థానానికి సంబంధించి మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఉపాధ్యాయ స్థానిక పోటీ చేస్తున్నవారిలో ప్రధానంగా పాతూరి సుధాకర్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మోహన్‌రెడ్డి, మామిడి సుధాకర్‌రెడ్డిల మధ్య పోటీ ఉన్నదని మేధావి వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే పాతూరి సుధాకర్‌రెడ్డికి 24 సంఘాలు మద్దతు తెలిపాయి. కూర రఘోత్తంరెడ్డికి పీఆర్టీయూ టీఎస్ మద్దతు తెలుపగా, తాజాగా మంజీరా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ఉత్తర్పల్లి మాణయ్య రఘోత్తంరెడ్డికి మద్దతు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా మోహన్‌రెడ్డి ప్రధానోపాధ్యాయుల సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. మామిడి సుధాకర్‌రెడ్డికి ఎస్టీయూ తదితర సంఘాలు తమ మద్దతు తెలుపుతున్నాయి. మొత్తం మీదా ఆ నలుగురు మధ్య రసవత్తర పోటీ నెలకొన్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.

పట్టభద్రుల స్థానానికి...
ఇదిలా ఉండగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌మ మెదక్ ఉమ్మడి జిల్లాలో పరిధిలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానినానికి కూడా తీవ్ర పోటీ నెలకొన్నది. ఆయా పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వకపోయినా, పరోక్షంగా తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నిన్న మొన్నటి దాక ప్రచారం చేశారు. పట్టభద్రుల స్థానానికి 17 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ప్రధానంగా చంద్రశేఖర్‌గౌడ్, సుగుణాకర్‌రావు, జీవన్‌రెడ్డి, రాణిరుద్రమల మధ్య పోటీ ఉన్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత పక్షం రోజులుగా జిల్లాలోని ఆయా పట్టణాలు, గ్రామాలలో అభ్యర్థులు తమ ప్రచారం నిర్వహించారు. వారి మద్దతుదారులు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి తమ అభ్యర్థికే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలనే ప్రచారం చేపట్టారు.

మండలానికో కేంద్రం...
కాగా, జిల్లాలోని అన్ని ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటు వేసే అభ్యర్థికి 15 కిలో మీటర్ల దూరం మించకుండా ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని దాదాపు అన్ని మండల కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మాత్రం అత్యధికంగా 6 పోలింగ్ కేంద్రాలను స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసి ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. జోగిపేట, సదాశివపేటలలో రెండు పోలింగ్ కేంద్రాల చొప్పున ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పత్రం విధానంలో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...