పరిశ్రమలకు రాచబాట


Fri,September 21, 2018 11:27 PM

- టీఆర్‌ఎస్ సర్కారు రెడ్‌కార్పెట్
- టీఎస్‌ఐపాస్‌తో అనుమతులు సులభతరం
- నాలుగున్నరేళ్లలో జిల్లాలో 424 పరిశ్రమల ఏర్పాటు
- రూ.6,634 కోట్ల పెట్టుబడి
- 62,594 మందికి ఉపాధి
- జిల్లాలో మొత్తం 4732 పరిశ్రమలు
సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పరిశ్రమల ఖిల్లాగా మారుతోంది. ఇప్పటికే ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా గుర్తింపు పొందిన పటాన్‌చెరుతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాచబాట వేసింది. దేశంలోని ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఎస్‌ఐపాస్‌ను తీసుకువచ్చి పారిశ్రామికవేత్తలకు రెడ్‌కార్పెట్ వేస్తున్నది. దరఖాస్తు చేసినప్పటి నుంచి 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తుండడంతో పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. టీఆర్‌ఎస్ సర్కారు చేపడుతున్న చర్యల వల్ల జిల్లాకు కొత్త పరిశ్రమలు భారీగా వచ్చాయి. ఈ కొత్త పరిశ్రమల స్థాపనతో దాదాపు 62 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ క్రమంలో జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధిపై నమస్తే తెలంగాణ స్టేటస్ రిపోర్టు...

పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాచబాట వేసింది. టీఎస్ ఐపాస్ తీసుకువచ్చి రెడ్‌కార్పెట్ వేయడంతో పారిశ్రామిక వేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లాను పరిశ్రమల ఖిల్లాగా చెప్పుకోవచ్చు. జిల్లాలోని పటాన్‌చెరు ప్రాంతం ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్‌తో రూ.వేలకోట్ల పెట్టుబడులతో జిల్లాకు కొత్త పరిశ్రమలు వచ్చాయి. కొత్త పరిశ్రమల స్థాపనతో 62 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. మరిన్ని పరిశ్రమలు నెలకొల్పడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధిపై స్టేటస్ రిపోర్టు ఇది.

రూ.6073 కోట్లతో భారీ పరిశ్రమలు...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 2న అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ నెల సెప్టెంబర్ 15 వరకు జిల్లాలో కొత్తగా 424 పరిశ్రమలు నెలకొల్పగా అందులో 119 మధ్యతరగతి, భారీ పరిశ్రమలు. రూ.6073.62 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన ఈ పరిశ్రమల్లో 42,434 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అదే విధంగా మరో 305 చిన్న తరహా పరిశ్రమలు రూ.560.47 కోట్లతో జిల్లాలో ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 20,160 మంది కార్మికులకు ఉపాధి లభించింది. ఇలా మొత్తం రూ.6634.09 కోట్లతో 424 పరిశ్రమలు జిల్లాకు కొత్తగా రాగా వాటి ద్వారా 32,594 మందికి ప్రత్యక్షంగా మరో 30వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించింది.

జిల్లాలో 4,732 కు
చేరిన పరిశ్రమల సంఖ్య...
జిల్లాలో పరిశ్రమల సంఖ్య 4,732కు చేరింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేండ్లలో వచ్చిన 424 కొత్త పరిశ్రమలతో కలిపి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం మొత్తం రూ.15,406 కోట్ల పెట్టుబడులతో జిల్లాలో పరిశ్రమలు తమ కార్యకలాపాలు కొసాగిస్తున్నాయి. వీటిలో 1,91,846 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరితో పాటు మరో 2లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నట్లు పరిశ్రమల శాఖ లెక్కలు చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా చూస్తే రూ.10,203.93 కోట్ల పెట్టుబడులతో 118 భారీ పరిశ్రమలు, రూ.1000.76 కోట్ల పెట్టుబడులతో 76 మధ్యతరహా, రూ.4201.71 కోట్లతో 4538 చిన్న పరిశ్రమలు పనిచేస్తున్నాయి. భారీ పరిశ్రమల్లో 94,295 మంది, మధ్యతరహా పరిశ్రమల్లో 14,284 మంది, చిన్న పరిశ్రమలల్లో 83,264 మంది ఉపాధి పొందుతున్నారు.

పవర్‌కట్ నుంచి పవర్‌పుల్ వరకు...
గతంలో జిల్లాలో పరిశ్రమలకు కరెంట్ కష్టాలు ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంట్ కష్టాలతో పరిశ్రమల యజమానులు రోజువారీగా రోడ్లపై ధర్నాలు చేసేవారు. వారంలో రెండు రోజులు పవర్ హాలీడేలు ఇచ్చేవారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరుచడంతో పరిశ్రమల్లో కొత్త వెలుగులు నిండాయి. 24 గంటల పాటు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా అవుతుండడంతో ప్రస్తుతం కార్మికులు ఓటీలు చేసుకుంటున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పరిశ్రమల యాజమాన్యాలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా టీఎస్ ఐపాస్‌తో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా పరిశ్రమల స్థాపనకు అనుమతులు లభిస్తుండడంతో పారిశ్రామిక వేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...