ఆన్‌లైన్‌లోనే అన్ని దరఖాస్తులు


Wed,September 19, 2018 11:45 PM

సంగారెడ్డి చౌరస్తా : వచ్చే ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల దరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలోనే ఉంటాయని, ఈ విషయా న్ని భారత ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింద ని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, కంప్యూటర్ ఆపరేటర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. చనిపోయిన, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, మండలం వారీగా వచ్చిన ఫారం6, ఫారం 7ల వివరాలు, ఆయా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ నమోదు, అప్‌లోడ్, ఈపీ రేషియో తదితర అంశాలపై సుధీర్ఘంగా సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఎన్నికలలో అన్నింటిని ఆన్‌లైన్‌లోనే దరాఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. సంబంధిత విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆయా యాప్‌లలో వచ్చిన దరఖాస్తులను ఏ విధంగా పరిశీలించాలి అనే పలు అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఓటరు జాబితాపై ఈఆర్‌వోలు దృష్టి సారించాలన్నారు. తొలగించిన జాబితాను గ్రామ పంచాయతీలో ప్రదర్శించాలన్నారు.

అధికారులు పనిచేస్తున్న కేంద్రాల్లోనే ఉండాలి
జిల్లాలో పని చేస్తున్న తహసీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్న హెడ్ క్వార్టరులోనే ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదని స్పష్టం చేశారు. తొలగించిన ఓటరు జాబితాలో దివ్యాంగులు, వీఐపీలు తదితరుల ఓట్లు ఉన్నది లేనిది, బీఎల్‌వో నుంచి ఏఈఆర్‌వో వరకు సరిచూడాలని పేర్కొన్నారు. అశ్రద్ధ, అజాగ్రత్తతో అర్హుల ఓట్లు తొలగించినట్టయితే సంబంధితులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫారం6, ఫారం 7లకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లతో ఫైలు ఉండాలన్నారు. సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలన్నారు. అందుకు అవసరమైన కంప్యూటర్లు, ఆపరేటర్లను పెంచాలని తహసీల్దార్లకు సూచించారు. కంప్యూటర్ ఆపరేటర్లు తహసీల్దార్లకు తెలియకుండా ఎలాంటి తొలగింపులను చేయరాదని కలెక్టర్ హెచ్చరించారు. బీఎల్‌వోల వివరాలను అప్‌లోడ్ చేయాలని సూచించారు. దివ్యాంగుల ఓటరు జాబితా అందుబాటులో ఉన్నందున వారు ఓటరు జాబితాలో ఉన్నదిలేనిది పరిశీలించాలని, తొలగింపు జాబితాతో ఇంటింటికి వెళ్లి పరిశీలించాలని కలెక్టర్ వివరించారు. తొలగింపులకు సంబంధించి బీఎల్‌వో క్షేత్ర పరిధిలో పూర్తి స్థాయి పరిశీలన చేసి విచారణ నివేదిక ఇచ్చిన వెంటనే చెక్‌లిస్ట్ జనరేట్ చేసి నోటీసులు ఇవ్వాలని తెలిపారు. నేషనల్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ విదానంలో వచ్చిన దరఖాస్తులు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి వీవీ ప్యాడ్‌లపై అవగాహన కల్పించేందుకు శిక్షణ షెడ్యూలును రూపొందించాలని ఈఆర్‌వోలకు సూచించారు.

ముగ్గురు తహసీల్దార్లకు మెమోలు జారీ
జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఆయా పనులు వేగవంతం అయిన నేపథ్యంలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. ఒక్కో అధికారిపై ప్రత్యేక దృష్టిని సారించి వారి పని తీరును తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓటరు జాబితా పరిశీలన, నమోదు, ఈపీ రేషి యో, బీఎల్‌వోలపై పర్యవేక్షణ లేకపోవడం, పనులలో అశ్రద్ద జాప్యం చేస్తున్న ముగ్గురు తహసీల్దార్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురికీ మెమోలు జారీ చేశారు. ఈ సమీక్షలో ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...