ముత్తూట్ మినీ కేసులో దోషులకు శిక్ష ఖరారు


Wed,September 19, 2018 11:44 PM

రామచంద్రాపురం: ఆర్సీపురం డివిజన్‌లోని రామచంద్రారెడ్డినగర్ కాలనీలోని ముత్తూట్ మినీ గోల్డ్‌లోన్‌లో 2015 ఫిబ్రవరి 4 ఉదయం 10 గంటలకు భారీ దోపిడీ జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులోని దోషులకు బుధవారం జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు శిక్షను ఖరారు చేసింది. అయితే 2015 ఫిబ్రవరి 4న రామచంద్రారెడ్డినగర్ కాలనీలోని ముత్తూట్ మినీ గోల్డ్‌లోన్‌లోకి దోపిడీ దొంగలు చొరబడి మేనేజర్‌తో పాటు సిబ్బందిని మారణాయుధాలతో బెదిరించి వారిని స్ట్రాంగ్ రూంలో బంధించి లాకర్‌లో ఉన్న నాలుగు కేజీల బంగారు ఆభరణాలు, రూ.86 లక్షల నగదును దోచుకుని తెలుపు రంగు స్కార్పియో వాహనంలో పారిపోయారు. ఈ ఘటన ఉమ్మడి మెదక్ జిల్లా, సైబరాబాద్ పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. 65వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న ముత్తూట్ మినీగొల్డ్ లోన్‌లో పట్టపగలే దోపిడీ జరిగిన విషయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

దోపిడీకి సంబంధించి దుండగులు ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా జాగ్రతలు తీసుకోవడంతో పోలీసులు సిమి ఉగ్రవాదుల పనిగా భావించారు. హైదరాబాద్ రేంజ్ ఐజీ నవీణ్‌చంద్, నిజామాబాద్ రేంజ్ డీఐజీ గంగాధర్, ఎస్పీ సుమతి ఛాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు చర్యలు ప్రారంభించారు. అయితే ముత్తూట్ మినీ కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే సరిగ్గా పది నెలలకు పక్కనే ఉన్న ముత్తూట్ ఫైనాన్స్‌లో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. 2016 డిసెంబర్ 28న దొంగలు ముత్తూట్ ఫైనాన్స్‌లోకి సీబీఐ అధికారుల వేషధారణలో ప్రవేశించి మేనేజర్‌కు ఐడీ కార్డులు చూపించి స్టాంగ్‌రూం లాకర్‌ను తెరిపించారు. ఆపై మేనేజర్, సిబ్బందిని తూపాకితో బెదించి 42 కేజీల బంగారు ఆభరణాలను దోచుకుని నలుపు రంగు స్కార్పియో వాహనంలో దుండగులు పారిపోయారు. ఈ దోపిడీని అప్పటి సైబరాబాద్ సీపీ సందీప్‌శ్యాండిల్యా సీరియస్‌గా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలు కర్ణాటక, ముంబై, పలు రాష్ర్టాల్లో గాలింపు చర్యలు చేపట్టి 2017 జనవరి 13న లక్ష్మణ్‌నారాయన్ ముద్దంగ్, గణేశ్‌పాండురంగ్ బోన్‌స్లే, మురుగన్ సుబ్రహ్మణ్యంపూజారి, కుమార్‌పౌల్ త్రిలోక్‌చంద్‌షాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పట్టుకున్న నలుగురు దుండగులను హైదరాబాద్‌కు తీసుకువచ్చి విచారణ చేశారు.

ఆ విచారణలో పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ముత్తూట్ మినీ గోల్డ్‌లోన్ కేసుకు పరిష్కారం దొరికింది. 2015లో ముత్తూట్ మినీ గోల్డ్‌లోన్‌లో దోపిడీకి పాల్పడింది తామేనని ఆ దుండగులు పోలీసుల విచారణలో అంగీకరించారు. దీంతో ఏ1గా లక్ష్మణ్‌నారాయన్ ముద్దంగ్, ఏ2గా గణేశ్‌పాండురంగ్ బోన్‌స్లే, ఏ3గా మురుగన్ సుబ్రహ్మణ్యంపూజారి, ఏ4గా కుమార్‌పౌల్ త్రిలోక్‌చంద్‌షాలను పేర్కొంటు వారి వద్ద నుంచి 3.5కేజీల బంగారంను స్వాధినం చేసుకుని నింధుతులను సంగారెడ్డి జిల్లా కోర్టుకు పంపించారు. కేసుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు పక్కాగా అభియోగ పత్రాలను దాఖలు చేశారు. ఈ కేసులో అప్పటి సీపీ సందీప్‌శ్యాండిల్యాతో పాటు జాయింట్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, డీసీపీ విశ్వప్రసాద్, డీసీపీ క్రైమ్ షర్మిలా, ఏసీపీ రవికుమార్, ఇన్‌స్పెక్టర్‌లు భాస్కర్, రాంచందర్‌రావులు కేసు దర్యాప్తులో ప్రత్యేక దృష్టిసారించారు. కేసును పీపీ శ్రీనివాస్‌రెడ్డి వాధించారు. కేసు పుర్వాపరాలను పరిశీలించిన జిల్లా కోర్టు జడ్జి సాయి కల్యాణ చక్రవర్తి దోషులైన నలుగురికి 6 ఏండ్ల జైలు శిక్షతో పాటు ఒకొక్కరికి రూ.10 వేల జరిమానను విధిస్తూ తీర్పును వెల్లడించారు. ఇదిలావుంటే ముత్తూట్ ఫైనాన్స్‌లో జరిగిన దోపిడీకి సంబంధించి కేసు దర్యాప్తులో ఉంది. దోపిడీకి సంబంధించి మరికొంత మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...