ఓటరు జాబితా సవరణకు సహకరించాలి


Tue,September 11, 2018 11:26 PM

-రాజకీయ ప్రతినిధులతో కలెక్టర్ హన్మంతరావు
సంగారెడ్డి చౌరస్తా: ఓటరు జాబితా సవరణకు సహకరించి మంచి జాబితా రూపొందించేందుకు తోడ్పడాలని కలెక్టర్ హన్మంతరావు ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్‌స్థాయి నుంచి సహాయ సహకారాలను అందించాలని కోరారు. ఓటరు జాబితా సవరణకు తమ వంతు బాధ్యతగా సహకరించాలన్నారు. 2018 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారందరినీ ఓటరు జాబితాలో చేర్చాలని, చనిపోయిన ఓటర్లను తొలగించాలన్నారు. ఎన్నికల కమిషన్ పారదర్శకంగా ఎప్పటికప్పుడు అన్ని ప్రక్రియలను పొలిటికల్ పార్టీల ప్రతినిధుల ముందుంచుతుందని గుర్తు చేశారు. అన్ని పార్టీల వారు ప్రతి బూత్‌కు బూత్ స్థాయి ఏజంట్‌ను నియమించి రేపు సాయంత్రంలోగా వారి జాబితాను సంబంధిత ఈఆర్‌వోలకు అందించాలని సూచించారు.

ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఈ నెల 15,16 తేదీల్లో బూత్‌స్థాయిలో నిర్వహిస్తారని, ఆ శిబిరాలను కొత్త ఓటర్లు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ముసాయిదా ఓటరు జాబితా ఈ నెల 10న ప్రచురితమైందని, సెప్టెంబర్ 25 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తారని, అక్టోబర్4లోగా ఫిర్యాదులు అభ్యంతరాలను పరిష్కరించి, అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితాను ప్రచురించస్తారన్నారు. 18 ఏళ్లు పూర్తయిన యువత ఓటర్ల నమోదు, అర్హత ఉండి జాబితాలో లేకపోయినా నమోదు చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా అందుబాటులో ఉండి సహకరించాలన్నారు. వీవీపాట్‌పై కలెక్టర్ వివరించారు. ఏ విషయంలోనైనా అనుమానాలున్నా ఎప్పటికప్పుడు తమ కార్యాలయ ఎన్నికల సెల్‌లో నివృత్తి చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రవికుమార్, ఆర్డీవోలు శ్రీను, హమీద్, ఆయా పార్టీల ప్రతినిధులు ప్రదీప్, యాకున్‌అలీ, వజీర్, జయరాజ్, శ్రీనివాస్‌రెడ్డి, సాయిలు పాల్గొన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...