ప్రత్యేక అధికారులకు పూర్తిస్థాయి బాధ్యతలు


Sat,September 8, 2018 11:38 PM

-గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో ముందుండాలి
-ప్రత్యేకాధికారులకు కలెక్టర్ హనుమంతరావు దిశానిర్దేశం
సంగారెడ్డి చౌరస్తా: గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులు పూర్తి స్థాయి అధికారులుగా వ్యవహరించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా చేసేందుకు గల అడ్డంకులు తొలగించడం, హరితహారం లక్ష్యాన్ని సాధించడం, ప్రత్యేకాధికారుల గురుతర బాధ్యతలు, కంటి వెలుగు కార్యక్రమం పురోగతి, ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్ష జరిపి అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.

జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి జిల్లాను అక్టోబర్ 2న స్వచ్ఛ జిల్లా, బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ముఖ్యంగా జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో వెనుకబడ్డామని, ఎంపీడీవోలు చాలెంజ్‌గా తీసుకుని సరియైన ప్రణాళికతో మరుగుదొడ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఆయా మండలాల్లో ఉన్న మేస్త్రీలను గుర్తించి, వారి రేటును నిర్ణయించాలన్నారు. ఆసక్తిగల నిరుద్యోగయువతకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై చిన్నపాటి శిక్షణ ఇస్తే నేర్చుకుంటారని, దాంతో వారికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏ పని చేసినా పారదర్శకంగా ఉండాలన్నారు. ఉద్యమంలా చేపట్టి ఒక డ్రైవ్‌గా పూర్తి చేయవచ్చని సూచించారు.

హరితహారం లక్ష్యాలను సాధించాలి
జిల్లాలో చేపట్టిన నాల్గో విడుత హరితహారం లక్ష్యాలను సాధించడానికి ఆయా శాఖల అధికారులు నిబద్ధతతో బాధ్యతగా పనిచేయాలన్నారు. వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాల పురోగతిపై కలెక్టర్ సమీక్షిస్తూ వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా శాఖలు లక్ష్యాలను పూర్తి చేయడంపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వచ్చే ఏడాదికి అవసరమైన మొక్కలకు సంబంధించిన నర్సరీల ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పరిధిలో సర్వే చేసి ఏ మొక్కలు కావాలో ఆ మేరకు ప్రణాళిక చేసుకోవాలన్నారు. ప్రజలు కోరే మొక్కలను అందించే విధంగా నర్సరీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అందరి భాగస్వామ్యంతో అన్ని గ్రామాల్లో మొక్కలు నాటాలన్నారు.

చిత్త శుద్ధితో పనిచేయాలి
ప్రత్యేకాధికారులు గ్రామ పంచాయతీల్లో తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని వేళలా గ్రామ సమస్యలను పరిష్కరించడంలో చొరవచూపాలన్నారు. ప్రతి సోమవారం, శుక్రవారం ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. గ్రామం మొత్తం తిరిగి గ్రామంలో నెలకొన్న సమస్యలను నేరుగా పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. చిన్నచిన్న సమస్యలను తీర్చడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

తమ పరిధిలో చేయగల అన్ని పనులను చేయాలన్నారు. గ్రామ పరిస్థితిపై పూర్తి అవగాహనతో పాటు పట్టు కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డంపు యార్డులను గుర్తించాలని కలెక్టర్ సూచించారు. అందుకు సంబంధించిన డంపు షేడ్స్‌ను చేపట్టాలన్నారు. ప్రణాళికతో వెళ్తే గ్రామ పంచాయతీలు బాగుంటాయని కలెక్టర్ హితవు చేశారు. గ్రామ పంచాయతీలలో నిధులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవలని పేర్కొన్నారు. ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయాలని సూచించారు. ఇంటింటికీ ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించి ప్రణాళిక చేయాలన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మాణాలు చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలను ప్రత్యేకాధికారులు ఏ విధంగా పరిష్కరించాలి, ఏవిధంగా ఫలితాలు సాధించవచ్చునో కలెక్టర్ అధికారులకు వివరించారు.

కంటి వెలుగుపై అవగాహన కల్పించాలి
జిల్లాలో కొనసాగుతున్న కంటి వెలుగుపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. శిబిరాలకు నేరుగా వెళ్లి పరిశీలించాలని తెలిపారు. ప్రత్యేకాధికారులు గ్రామ ప్రజలకు నమ్మకాన్ని కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యం చేస్తే సహించబోమని, ప్రజల సమస్యలు పట్టించుకోకపోయిన ఉపేక్షించేదిలేదని కలెక్టర్ హెచ్చరించారు.

ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చు
ప్రభుత్వం రద్దు నేపథ్యంలో సాధారణ ఎన్నికలు ఏ క్షణంలోనైనా రావచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుందని, అందుకు అందరూ సంసిద్ధంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా ఎన్నికల్లో ఈవీఎం యంత్రాల్లో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపాట్)లను వినియోగించనున్నట్టు కలెక్టర్ వివరించారు. ఎన్నికల నిర్వహణలో నిక్కచ్చిగా, నిస్పక్షపాతంగా పని చేయాలన్నారు. ప్రత్యేకాధికారులు గ్రామంలోని బూత్‌స్థాయి అధికారులు, ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలు, ఏఏ లోకేషన్లలో ఉన్నవి తదితర వివరాలు సేకరించి పెట్టుకోవాలన్నారు. జీఎల్‌వో వారీగా ఓటర్ల జాబితాను సేకరించాలన్నారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి కనీస సౌకర్యాలు ఉన్నది లేనిది పరిశీలించాలని ప్రత్యేకాధికారులకు సూచించారు.

సమావేశానికి రాని
అధికారులు సంజాయిషీ ఇవ్వాల్సిందే
అయితే కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేకాధికారుల సమావేశానికి హాజరుకాని ఆయా అధికారులను సంజాయిషీ కోరాల్సిందిగా జిల్లా రెవెన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. అధికారి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ సమయపాలన పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. తాను ఎప్పుడైనా ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఆ సమయంలో విధుల్లో లేని సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రత్యేక డ్రైవ్‌గా చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ మరోసారి స్పష్టం చేశారు. అనంతరం అధికారులతో కలెక్టర్ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో జేసీ నిఖిల, డీఆర్వో అంబదాస్, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

156
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...