మదిరనుంచి పంచాయతీగా గౌతాపూర్


Sat,September 8, 2018 11:34 PM

- సిద్ధమైన పంచాయతీ కార్యాలయం
- కొలువుదీరిన అధికారులు, తొలిగిన ఇబ్బందులు
- హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
వట్‌పల్లి: సంవత్సరాల తరబడి ఇతర గ్రామానికి ఆవాస(మదిర) గ్రామంగా ఉండి సమస్యలతో సహవాసం చేసిన గౌతాపూర్ ప్రజల కష్టాలు తొలిగిపోనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 500 జనాభా కలిగిన గ్రామాలు, గిరిజన తండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో గొర్రెకల్ మదిర గ్రామం గౌతాపూర్ ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. చిన్న రాష్ట్రం, చిన్న జిల్లాలు, చిన్న మండల్లాలతోనే పరిపాలనా సౌలభ్యం మెరుగు పడుతుందని సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు గ్రామాలు సైతం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మదిర గ్రామాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ప్రజలకు పరిపాలన వ్యవస్థ మరింత మెరుగుపడింది. గ్రామంలో పాలనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు పంచాయతీ కార్యాలయాన్ని సైతం సిద్ధం చేశారు. తాత్కాలికంగా పాఠశాల పాత భవనానికి రంగులు వేసి ముస్తాబు చేశారు. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కావడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి ప్రత్యేక అధికారిని నియమించారు.

కొన్ని దశాబ్దాలుగా వేరే గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉంటూ ప్రభుత్వ అధికారులు, సంక్షేమ పథకాల ఊసే లేకుండా ఏచిన్న అవసరం ఏర్పడినా పంచాయతీలకు పరుగులు పెట్టిన సందర్భాలు అనేకం. రేషన్‌కార్డులు, ఇతర ధ్రువపత్రాలు ఇలా ఏ అవసరం వచ్చినా ప్రజలు కిలో మీటర్ల దూరంలో ఉన్న పంచాయతీలకు వెళ్లాల్సిన దుస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్యమ సమయంలో మదిర గ్రామాలు, గిరిజన తండాల ప్రజల స్థితిగతులు, వారికి కావాల్సిన మౌలిక వసతులను గుర్తించిన కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే అందుకు తగిన ప్రణాళికలు రూపొందించారు. 500 జనాభా ఉన్న ప్రతి పల్లె, గిరిజన తండాను ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చెప్పిన విధంగానే కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత ప్రజల చేతుల్లో పెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.

500 జనాభా ఉన్న అన్ని గ్రామాలను, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో అనుబంధ గ్రామాలు, గిరిజన తండాల్లో ఇకపై ఎవరి ప్రమేయం లేకుండా తామే స్వయంగా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఏర్పడిందని ప్రజలు ప్రభుత్వం పై హర్శం వ్యక్తం చేస్తున్నారు. 528 జనాభా కలిగిన గౌతాపూర్‌లో 275 మంది పురుషులు, 253 మంది మహిళలున్నారు. కాగా గ్రామంలో 292 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషుల ఓట్లు 154 కాగా, మహిళా ఓటర్లు 138 మంది ఉన్నారు. గ్రామంలో మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. వర్షాధార పంటలనే రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. బోర్లు, నీటి సౌకర్యం ఉన్న రైతులు మాత్రం వరి, ఇతర కూరగాయాల పంటలను సాగుచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకంలో గ్రామానికి చెందిన దళితులకు తొలివిడతలో భూ పంపిణీ చేసి బోర్లు వేయించి వ్యవసాయానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడంతో రైతులు ఆనందంగా పంటలు సాగుచేస్తున్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...