నా గెలుపు బాధ్యత మీదే..!


Fri,September 7, 2018 11:56 PM

గజ్వేల్ నియోజకవర్గ నేతలతో సీఎం కేసీఆర్
గజ్వేల్, నమస్తే తెలంగాణ : గజ్వేల్ ప్రజల అభీష్టం మేరకు మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేయాలనుకున్నా.. ఇక్కడ జరిగిన అభివృద్ధి చారాణా మాత్రమే.. ఇంకా బారాణా అభివృద్ధి చేయాల్సి ఉన్నది. నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. మీరు అనుమతిస్తే పోటీ చేస్తా.. నా గెలుపు బాధ్యత మీకే అప్పజెప్తున్నా.. ఎన్నికల్లో మీరే పోరాడి గెలిపించాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తలతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గజ్వేల్ ప్రజలు ధర్మంవైపు నిలుస్తారని, వారి దీవెనలు మనకు ఉంటాయని పేర్కొన్నారు. గత పాలకులు గజ్వేల్‌ను ఓ పరంపోగు భూమి చేసి వాడుకున్నారని, ఓ తొవ్వకు తెచ్చేందుకు ఇంత సమయం పట్టిందని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు.

జూన్ లోగా కొండ పోచమ్మ రిజర్వాయర్ పూర్తి ..
వచ్చే జూన్‌లోగా కొండపోచమ్మ రిజర్వాయర్‌ను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పారు. వ్యవసాయం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నదని కొండపొచమ్మ ప్రాజెక్ట్ నీళ్లొస్తే సాగునీరు పుష్కలంగా అందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఏడాదిలో మూడు పంటలు పండించుకునే వీలు కలుగుతున్నదన్నారు. గతంలో కాంగ్రెసోళ్లు కొండపోచమ్మ ప్రాజెక్ట్‌ను అర టీఎంసీ సామర్థ్యానికే పరిమితం చేశారని, దీన్ని 15టీఎంసీల సామర్థ్యానికి పెంచుకున్నామని, త్వరలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందుబాటులో వస్తుందన్నారు. ఏడాదిలో మూడు పంటలు పండించుకునే వీలుందని, స్వల్పకాలిక రకాల సాగుతో మంచి దిగుబడులు పొందవచ్చని సూచించారు. తానూ రైతునేనని, మక్కజొన్న పంట వేశానన్నారు. వర్షాలు లేక రెండో పంట వేయడానికి వీలు లేకుండా పోయిందని, పెద్ద బాయి తోడినా లాభం లేదన్నారు. కొండపోచమ్మ పూర్తయితే ఏడాదికి మొత్తం చెరువుల్లో నిండా నీళ్లుంటాయని, వర్షం పడ్డప్పుడల్లా అలుగులు పారుతాయని, భూగర్భజలాలు పెరిగి బావులు పొంగిపొర్లుతాయని చెప్పారు.

రెండేండ్లలో ఊహించని విధంగా పరిశ్రమలు
పరిశ్రమలు ఏర్పాటై స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు శాశ్వతంగా అందించాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. నాయకులు ఎప్పుడు తన పని అయిపోయిందని విశ్రమించవద్దని, ఇంకా ప్రజల కోసం చేయాల్సింది ఉందని నిరంతంరం కృషి చేస్తూనే ఉండాలని చెప్పారు. గజ్వేల్‌కు రెండేండ్లలో ఊహించని విధంగా భారీ పరిశ్రమలు వస్తాయని, ఈమేరకు పారిశ్రామిక వేత్తలతో తాను మాట్లాడినట్టు చెప్పారు. మనోహరాబాద్ నుంచి పొన్నాల వరకు రైలు మార్గం త్వరలో పూర్తవుతున్నదని, దీంతో గజ్వేల్‌కు రైలు సౌకర్యం ఏర్పడుతుందన్నారు.

కంటివెలుగుకు పునాది ఎర్రవల్లి
రాష్ట్రంలో 50శాతం మంది కంటి సమస్యతో బాధపడుతున్నారని, ఇందులో వృద్ధులతో పాటు చిన్న పిల్లలు, యువకులు కూడా ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో ఉచిత కంటి శిక్షణ శిబిరం నిర్వహిస్తే 227మందికి అద్దాలు, చికిత్స అవసరమైందన్నారు. దీనిని గుర్తించి తాను స్వయంగా మూడు నెలలు దృష్టి పెడితే కంటి వెలుగు కార్యక్రమం రూపుదిద్దుకున్నదన్నారు.

త్వరలో గజ్వేల్‌లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం..
గజ్వేల్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రింగురోడ్డు, మార్కెట్‌యార్డుతో పాటు పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఇవన్నీ పూర్తయినట్లు అధికారులు చెప్పారని, వాటిని త్వరలో ప్రారంభించడానికి వస్తానని తెలిపారు. పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.100కోట్లు మంజూరు చేశానన్నారు. పట్టణంలో అండర్‌డ్రైనేజీ నిర్మించుకొని పట్టణాన్ని ఆదర్శంగా మార్చుకుందామని వివరించారు. గజ్వేల్‌లో జంగల్ కండ్లముందే నాశనమైందని, కోట్లాది రూపాయలు పెట్టి మళ్లీ చెట్లను పెంచుకుంటున్నామన్నారు. గజ్వేల్ పట్టణం హైదరాబాద్‌కు కౌంటర్‌మాగ్నెట్‌గా మారుతుందని, శాటిలైట్ టౌన్‌గా మార్చాలన్నది మనందరి లక్ష్యం కావాలన్నారు. పారిశ్రామిక కారిడార్‌గా మారుతున్నదని చెప్పారు. సమావేశంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, భాస్కర్, చిట్టి దేవేందర్‌రెడ్డి, జహంగీర్, అరుణ భూపాల్‌రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

167
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...