ఆశీర్వదించండి


Fri,September 7, 2018 12:34 AM

-మధ్యాహ్నం 2.30 గంటలకు హెలీకాప్టర్‌లో రానున్న సీఎం కేసీఆర్
-ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రులు హరీశ్‌రావు, ఈటల
-ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఆహ్వానించిన మహిళా నేతలు
-జనసమీకరణలో నిమగ్నమైన బాధ్యులు
-భద్రతా విధుల్లో 1250 మంది పోలీసులు
హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వేదికగా నేడు సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. స్థానిక బస్టాండ్ ప్రాంగణంలోని మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజల ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 65 వేల మందితో నిర్వహించే ఈ సభ విజయవంతానికి మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ కృషి చేస్తున్నారు. ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, పుట్ట మధు, రసమయి బాలకిషన్, విద్యాసాగర్‌రావు, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, వైస్ చైర్మన్ రాజిరెడ్డి జన సమీకరణలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీఎం సభపై మహిళా నేతలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఆహ్వానించారు. సీఎం హెలీకాప్టర్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు హుస్నాబాద్ చేరుకుంటారు. హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 1250 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. డాగ్ స్కాడ్, మెటల్ డిటెక్టర్లతో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు.

హుస్నాబాద్‌లో శుక్రవారం జరుగనున్న ప్రజల ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కలిసొచ్చిన గడ్డ నుంచే సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌లు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎంపీ వినోద్‌కుమార్, మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, పుట్ట మధు, రసమయి బాలకిషన్, విద్యాసాగర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, వైస్ చైర్మన్ రాజిరెడ్డి తదితరులు జనసమీకరణలో నిమగ్నమయ్యారు. రెండు రోజులుగా మండలాలు, గ్రామాల వారీగా ఇంటింటికీ తిరిగి సభకు రావాలని నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే జనాన్ని సభాప్రాంగణానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ రద్దయ్యాక జరిగే తొలిసభ కావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి 65వేల మందిని తరలించాలని మొదట్లో అనుకున్నప్పకిటీ అంతకన్నా ఎక్కువ జనాభాను సభకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు హుస్నాబాద్ సభాస్థలికి హెలీకాప్టర్‌లో సీఎం కేసీఆర్ చేరుకుంటారు. సభ అనంతరం హెలీకాప్టర్‌లోనే తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

వందమంది కూర్చునేలా సభావేదిక సిద్ధం...
సభకు సమీపంలో హెలీప్యాడ్..
ఎన్నికల శంఖారావ సభలో వంద మంది కూర్చునేలా సభావేదికను నిర్మించారు. గురువారం సాయంత్రం వరకే వేదిక నిర్మాణం పూర్తయింది. కళాకారుల కోసం ప్రత్యేక వేదికను నిర్మించారు. వేదిక ముందు భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సభకు కుడివైపు వీఐపీల గ్యాలరీ, ఎడమవైపు ప్రెస్ గ్యాలరీ ఏర్పాటు చేశారు.
వేదికకు ఇరువైపులా భారీ సౌండ్ బాక్సులను అమర్చారు. సభాప్రాంగణంతో పాటు పట్టణంలోని పలు వీధుల్లో కూడా సీఎం ప్రసంగం వినబడేలా మైకులు ఏర్పాటు చేశారు. సుమారు పదెకరాల స్థలంలో సభకు వచ్చిన ప్రజలు కూర్చునేందుకు, వేదిక ముందు భాగంలో సుమారు ఐదు వేల కుర్చీలను వేస్తున్నారు. సభాప్రాంగణానికి వందమీటర్ల దూరంలోనే సుమారు నాలుగెకరాల స్థలంలో హెలీప్యాడ్ సిద్ధం చేశారు. మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం రాత్రి 10గంటల వరకు సభాస్థలంలోనే ఉండి ఏర్పాట్లను సమీక్షించారు. సభాప్రాంగణం, హెలీప్యాడ్‌ను పరిశీలించారు. పలు మార్పులు చేయించి ఎవరికీ ఇబ్బంది జరుగకుండా దిశానిర్దేశం చేశారు.

1,250 మంది పోలీసులతో భారీ బందోబస్తు...
హుస్నాబాద్‌లో జరుగబోయే ప్రజా ఆశీర్వాద సభకు మొత్తం 1,250మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డి, సిద్దిపేట సీపీ జోయెల్ డెవిస్ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పటికే పోలీసులు సభా వేదికను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్‌స్కాడ్, మెటల్ డిటెక్టర్లతో నిత్యం సభాస్థలం మొత్తాన్ని నిత్యం తనిఖీలు చేస్తున్నారు. సభకు వచ్చే వాహనాల కోసం నాలుగు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. సభకు వచ్చే నాలుగు మార్గాల నుంచి వచ్చే వాహనాలకు స్థలాలను ఖరారు చేశారు.
సిద్దిపేట వైపు నుంచి వచ్చే వాహనాల కోసం తిరుమల గార్డెన్ వద్ద, హన్మకొండ వైపునుంచి వచ్చే వాటికి మార్కెట్‌యార్డులో, కరీంనగర్ వైపునుంచి వచ్చే వాహనాలకు చిల్లింగ్ సెంటర్ వద్ద, అక్కన్నపేట నుంచి వచ్చే వాటికి స్థూపం వద్ద పార్కింగ్‌కు స్థలం కేటాయించారు. సభాప్రాంగణంలోకి వెళ్లేందుకు మూడు ద్వారాలను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరినీ పోలీసులు మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేసి పంపే ఏర్పాటు చేశారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...