రూ.280కోట్లతో మరో ‘రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌ ’


Tue,December 10, 2019 12:20 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ ప్రజలకు సమృద్ధిగా నీటి సరఫరా చేయడమే లక్ష్యంగా జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు సేవల పరిధిని విస్తరించిన నేపథ్యంలో నీటి ఎద్దడి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా సింగూరు, మంజీరా జలాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలను మళ్లిస్తున్నారు. ఇప్పటికే రూ.420కోట్లతో ఘన్‌పూర్‌ నుంచి ముత్తంగి జంక్షన్‌ వరకు రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌ ద్వారా ఐటీ కారిడార్‌కు మెరుగైన నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసిన అధికారులు.. తాజాగా ముత్తంగి జంక్షన్‌ నుంచి కోకాపేట వరకు దాదాపు 18 కిలోమీటర్ల మేర భారీ రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌ విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. సింగూరు జలాలపై ఆధారపడిన ప్రాంతాల్లో ఎండాకాలంలో నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం ఈ రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌ వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చారు.

ఐటీ విస్తరిత ప్రాంతాల్లో నీటి లభ్యతను మరింత మెరుగుపర్చేందుకుగానూ రూ. 280 కోట్లతో ఈ రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ఇటీవల జరిగిన సమీక్షలో మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతూ తక్షణమే పనులను ప్రారంభించాలని మంత్రి కేటీఆర్‌ జలమండలి ఎండీ దానకిశోర్‌కు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ నిధులతో ఈ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు లభించిన వెంటనే పనులను చేపట్టి నిర్ణీత 3నెలల వ్యవధిలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. పటాన్‌చెరు, నల్లగండ్ల, కొల్లూరు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు, రాజేంద్రనగర్‌, కోకాపేట టౌన్‌షిప్‌ తదితర ప్రాంతాలకు వేసవిలోనూ సమృద్ధిగా నీటి సరఫరా కానున్నది.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...