అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్ల అభివృద్ధి


Fri,December 6, 2019 01:20 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వాహనదారులు, పాదచారులు సౌకర్యవంతంగా ప్రయాణం సాగించడమే లక్ష్యంగా నగర రోడ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. ట్రాఫిక్‌ వ్యవస్థను శాస్త్రీయ పద్ధతుల్లో క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. గురువారం బుద్ధభవన్‌లో జీహెచ్‌ఎంసీ, పోలీసు, వాటర్‌బోర్డు, టీఎస్‌ఐఐసీ, విద్యుత్‌ తదితర విభాగాల ఉన్నతాధికారులతో మంత్రి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజా రవాణాకు ఆదరణ ఉండగా, మన నగరంలో మాత్రం వ్యక్తిగత వాహనాలను ఎక్కువ వినియోగిస్తున్నారని చెప్పారు. ముంబైలో 72 శాతం మంది పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగిస్తుండగా, మన నగరంలో ఈ సంఖ్య 34 శాతం మాత్రమేనన్నారు. నగరంలో గడిచిన ఐదేండ్లలో వాహనాల సంఖ్య 73 లక్షల నుంచి 1.2 లక్షలకు పెరిగిందన్నారు. ప్రజలను ప్రజా రవాణావైపు మళ్లించే విధంగా రవాణా వ్యవస్థను మెరుగుపర్చనున్నట్లు తెలిపారు. మెట్రోరైలు, ఎంఎంటీఎస్‌ మార్గాలు, స్టేషన్లున్న ప్రాంతాలతోపాటు వివిధ ప్రధాన రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, లైనింగ్‌, సైకిల్‌ వేలు, గ్రీనరీ తదితర వాటిని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

పార్కింగ్‌ సమస్యను పరిష్కరించేందుకు మరిన్ని పార్కింగ్‌ ప్రదేశాలను, ఇందులో భాగంగా ఖాళీ జాగలను పార్కింగ్‌కు ఉపయోగించుకునే విధంగా వాటి యజమానులతో మాట్లాడాలని మంత్రి అధికారులకు సూచించారు. దీనివల్ల స్థల యజమానులకు ఆదాయం కూడా సమకూరుతుందన్నారు. లేఔట్‌ ఓపెన్‌ స్పేస్‌లను ప్రజల అవసరాలకు అనుగుణంగా టాయిలెట్లు, బస్‌ షెల్టర్ల నిర్మాణానికి ఉపయోగిస్తామన్నారు. అలాగే, స్కైవాక్‌ల నిర్మాణం, గ్రీనరీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమగ్ర రోడ్ల నిర్వహణ ప్రాజెక్టు(సీఆర్‌ఎంపీ) కింద 709కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తున్నామని, ఈనెల 9వ తేదీ నుంచి వారి ఆధ్వర్యంలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఐదేండ్లపాటు రోడ్ల నిర్వహణ బాధ్యత వారిపైనే ఉంటుందన్నారు. పైప్‌లైన్లు, కేబుళ్లు, డ్రైనేజీ తవ్వకాలు, మరమ్మతులే కాకుండా పునరుద్ధరణ పనులు కూడా సంబంధిత ఏజెన్సీ ద్వారానే చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఏజెన్సీలు చేపట్టే పనులకు ప్రభుత్వంతోపాటు జీహెచ్‌ఎంసీ, పోలీసు యంత్రాంగం పూర్తిగా సహకరిస్తాయని భరోసా ఇచ్చారు. కమర్షియల్‌ ఏరియాల్లోని సెట్‌బ్యాక్‌ స్థలాలను కూడా ఫుట్‌వేలకు వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...