వ్యర్థ రహితంగా తీర్చిదిద్దుతాం


Thu,December 5, 2019 04:02 AM

-జీరోవేస్ట్ నగరంగా హైదరాబాద్
-నిత్యం వెలువడుతున్న వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ, ఎరువుల ఉత్పత్తి
-చెత్త ట్రాన్స్‌ఫర్ కేంద్రాలు 17 నుంచి 60కి పెంపు
-ప్రత్యేక డ్రైవ్‌లో 13,821 టన్నుల వ్యర్థాల తరలింపు
-ఈనెల 10 నుంచి ప్రైవేటు సంస్థలకు రోడ్ల నిర్వహణ బాధ్యతలు
-ఫిబ్రవరిలో 9వేల డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ
-మరో 65వేలు జూన్ నాటికి పూర్తి
-ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి 3 నుంచి 5 వరకు ఆఫీసుల్లోనే ఏసీపీలు
-ప్రతి జోన్‌లో 10 కిలోమీటర్ల మేర కొత్త ఫుట్‌పాత్‌లు
-ప్రతి నియోజకవర్గంలో 10కిలోమీటర్ల వీడీసీసీ రోడ్లు
-52 చోట్ల పాదచారుల వంతెనలు
-జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ వెల్లడి

హైదరాబాద్ నగరాన్ని వ్యర్థ తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా కసరత్తు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. నగరంలో ప్రతిరోజూ ఉత్పత్తి అవుతున్న 6,300 టన్నుల వ్యర్థాలను విద్యుత్, ఎరువుల తయారీకి వినియోగించనున్నట్లు వెల్లడించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరహాలో నగరంలో మరో మూడు, నాలుగు వ్యర్థాల తరలింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలో చెత్త ట్రాన్స్‌ఫర్ కేంద్రాలను 17 నుంచి 60 కేంద్రాలకు పెంచుతామన్నారు. గతనెల 23 నుంచి చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఇప్పటివరకు 13, 821మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించామని తెలిపారు. 709 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారుల నిర్వహణ బాధ్యతలను ఈనెల 10న నుంచి ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నామన్నారు. వచ్చే ఫిబ్రవరిలో 9వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లను పంపిణీ చేయనున్నట్టు, మరో 65వేల ఇండ్లను జూన్ కల్లా పూర్తి చేయనున్నట్టు కమిషనర్ వెల్లడించారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనులు, పౌరసేవా కార్యక్రమాలపై బుధవారం కమిషనర్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, నగరంలో ప్రస్తుతం రోజుకు 6400 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు చెప్పారు. వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిచేసే ప్లాంటు జవహర్‌నగర్‌లో సిద్ధమైందని, వచ్చే ఏడాది జనవరిలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. దీనికి రోజుకు 900మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వినియోగిస్తామన్నారు. అలాగే, వచ్చే జూన్ నాటికి మరో పవర్ ప్లాంటు కూడా అందుబాటులోకి వస్తుందని, దానికి మరో 1400మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సరఫరాచేస్తామని చెప్పారు. విద్యుత్, ఎరువుల తయారీ, రీసైక్లింగ్ తదితర చర్యల ద్వారా వ్యర్థాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసేందుకు, తద్వారా నగరాన్ని జీరో వేస్ట్ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామన్నారు.

జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు తరహాలో నగరానికి నలుమూలలా చెత్త డంపింగ్ కోసం మరో మూడు, నాలుగు డంపింగ్ కేంద్రాలను ఏర్పాటుచేస్తామన్నారు. అంతేకాకుండా చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్లను ప్రస్తుతం ఉన్న 17నుంచి త్వరలో 60కి పెంచుతామని, భవిష్యత్తులో స్థలాల లభ్యతనుబట్టి 300లకు విస్తరిస్తామన్నారు. ప్రతి 25నుంచి 30మెట్రిక్ టన్నుల వ్యర్థాలకు ఒక ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. సీఅండ్‌డీ(కన్‌స్ట్రక్షన్, డెమాలిషన్) వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంటు జీడిమెట్లలో సిద్ధమైందని, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించేందుకు ప్రతి మూడు నెలలకోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు లోకేశ్‌కుమార్ చెప్పారు. గత నెల 23నుంచి చేపట్టిన నిర్మాణ వ్యర్థాల తొలగింపు ప్రత్యేక డ్రైవ్ విస్తృతంగా కొనసాగుతుందన్నారు. ఈ డ్రైవ్ ద్వారా ఇప్పటివరకు 13821మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించామన్నారు.

ఖాళీ స్థలాల్లో పార్కులు, టాయిలెట్లు

పార్కులు, ఖాళీజాగల్లో పార్కులు, టాయిలెట్లను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. సెంట్రల్ మీడియన్లు, జంక్షన్లలో పచ్చదనాన్ని ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 30-35ప్రాంతాల్లో బస్‌బేలను నిర్మించనున్నట్లు, వీటికి స్థలాలను ఇదివరకే సేకరించినట్లు తెలిపారు.

ఫిబ్రవరిలో 9000 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు పంపిణీ

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతున్నదని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 9000 ఇండ్లనను లబ్ధిదారులకు పంపిణిచేస్తామని కమిషనర్ చెప్పారు. వచ్చే జూన్ నాటికి మరో 60-65వేల ఇండ్లను పూర్తిచేస్తామని తెలిపారు. వీటి నిర్మాణానికి సంబంధించిన రూ.480కోట్ల బిల్లులకుగాను ఇటీవల రూ.147కోట్లు చెల్లించామన్నారు. ఆన్‌లైన్ ద్వారా క్రయవిక్రయాలు సాగించేందుకు టీడీఆర్ బ్యాంకును త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ చివరి గడువు అయినందున ఈలోగా అర్హతగల అన్ని దరఖాస్తులకు ధృవీకరణ పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికోసం ప్రతిరోజూ జోనల్ కార్యాలయాల్లో సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల మధ్య ఏసీపీలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా 28వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయన్నారు. అంతేకాకుండా కాల్ సెంటర్ ద్వారా దరఖాస్తుదారులకు సమాచారం అందిస్తున్నామని తెలిపారు.

ఎఫ్‌ఓబీలు, స్కైవాక్‌ల నిర్మాణానికి చర్యలు

సమగ్ర రోడ్ల నిర్వహణ ప్రాజెక్టు కింద వచ్చే డిసెంబర్ 10వ తేదీనుంచి 709కిలోమీటర్లమేర ప్రధాన రోడ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్నట్లు కమిషనర్ చెప్పారు. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. అలాగే, ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఉద్దేశించిన స్లిప్ రోడ్లు, లింకు రోడ్ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని, త్వరలోనే వీటిని కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి జోన్‌లో 10కిలోమీటర్లమేర కొత్త ఫుట్‌పాత్‌లను నిర్మిస్తామని, దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు. అంతేకాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10కిలోమీటర్ల వీడీసీసీ రోడ్లను నిర్మిస్తామన్నారు. 130నీరు నిచిచే ప్రాంతాల్లో వీడీసీసీ(వ్యాక్యూమ్ డీవాటర్డ్ సిమెంట్ కాంక్రీట్)రోడ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. 52ప్రాంతాల్లో పాదచారుల వంతెనలు, మరో ఎనిమిదిచోట్ల స్కైవాక్‌ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్లు, త్వరలోని వాటిని నిర్మిస్తామన్నారు. నగరంలో చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు వచ్చే మూడు నెలల్లో పూర్తవుతాయన్నారు. ఎస్‌ఆర్‌డీపీతోపాటు ఇతర అభివృద్ధి పనులకోసం రుణాలు సేకరించేందుకు ఆహ్వానించిన టెండర్లు ఈనెల ఏడవ తేదీన తెరవనున్నామన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...