20 స్టాపుల వరకు పెంపు..


Tue,December 3, 2019 02:41 AM

-కనీస టికెట్‌.. పది రూపాయలు
-చిల్లర ఇబ్బందులు లేకుండా 10, 15, 20, 25లుగా నిర్ణయిస్తూ ధరలు
-కిలోమీటర్ల ప్రాతిపదికన రూట్‌ బస్సుపాస్‌లు
-స్వల్పంగా పెరిగిన విద్యార్థుల బస్‌పాస్‌ రేట్లు
-పెరిగిన చార్జీలు నేటి నుంచి అమల్లోకి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యను అధిగమించేందుకు గతంలో ఒకసారి స్వల్పంగా చార్జీలను పెంచిన ప్రభుత్వం.. చాలా ఏండ్ల తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీకి జవసత్వాలు నింపేందుకు టికెట్‌ ధరలను కొద్దిగా సవరిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సు చార్జీలను పెంచింది. వీటితోపాటు జనరల్‌ మంత్లీ , క్వార్టర్లీ, విద్యార్థుల బస్‌పాస్‌ల మొత్తంలో కూడా మార్పులు చేసింది. ఈ నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది.

మినిమం చార్జీ రూ.10

గతంలో ఉన్న సిటీ ఆర్డినరీ బస్సు మినిమం చార్జీని రూ.5 నుంచి రూ.10కి పెంచారు. ఇదే క్రమంలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ చార్జీని పెంచలేదు. గతంలో ఉన్న రూ.10లో మార్పులు లేకుండా యథావిధిగా కొనసాగిస్తున్నారు. మెట్రో డీలక్స్‌ మినిమం చార్జీని రూ.10 నుంచి 15 చేశారు. ఏసీ లగ్జరీ బస్సు చార్జీల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా సిటీ ఆర్డినరీ టికెట్‌ను మొదటి స్టేజీకే పరిమితం చేయకుండా రెండో స్టేజీ వరకు 10 రూపాయలతో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. కాగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సులలో రెండో స్టేజీకి టారీఫ్‌ మారుతుంది. 2 కిలోమీటర్లకు స్టేజీని పరిగణలోకి తీసుకుని ఆపరేషన్స్‌ నిర్వహించే గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో టికెట్‌ను ప్రయాణికుడు ప్రామాణికంగా తీసుకుని 20 స్టేజీల వరకు కేవలం రూ.5 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే మినిమం టికెట్‌తోపాటు 40వ స్టేజీ దగ్గరకువచ్చే సరికి ఆర్డినరీ బస్సులో ప్రయాణించినా, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించినా టికెట్‌ ధర ఒకేలా ఉండేలా నిర్ణయించారు. 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించేవారు ఆర్డినరీ లేదా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించినా రూ.35 చెల్లించాల్సి ఉంటుంది.

అదేవిధంగా 22 కిలోమీటర్లు లేదా 11వ స్టేజీ వరకు ప్రయాణించేవారికి ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల టికెట్‌ ధర సమానంగా ఉంది. ఎందులో ప్రయాణించినా రూ.25 చెల్లిస్తే సరిపోతుంది. అదేవిధంగా 15,16,17 స్టేజీల వరకు ప్రయాణించేవారికి కూడా ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు సమానంగా రూ.30గా ఉంది. అదేవిధంగా 13 స్టేజీ వరకు ప్రయాణించే ప్రయాణికులకు ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ చార్జీలు ఒకేరకంగా
రూ.30గా నిర్ణయించారు. అదేవిధంగా మినిమం టికెట్‌ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు ఒకే విధంగా రూ.10 ఉంది. రెండో స్టేజీ విషయానికి వస్తే డీలక్స్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు సమానంగా రూ.15గా నిర్ణయించారు. మూడవ స్టేజీ విషయానికి వస్తే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు సమానంగా రూ.15 ఉంది. ఇలా చాలా స్టేజీలకు అన్ని బస్సుల టికెట్ల ధరలు సమానంగా ఉన్నాయి. అదేవిధంగా 113ఎం రూట్‌ నంబర్‌ బస్సు విషయానికి వస్తే డీలక్స్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుకు సమానంగా రూ.25గా నిర్ణయించారు. అయితే మెట్రో, ఏసీ, లగ్జరీ బస్సు చార్జీలు తగ్గనున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. టికెట్‌ ధరలో దాదాపు 30 శాతం తగ్గే అవకాశమున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

కాంబీ టికెట్‌ ధర యథాతథం.. బస్‌ పాసులకు స్వల్పంగా పెంపు

ఆర్డినరీ బస్‌పాస్‌ ఉండి ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణించే వారికి సంబంధించి కాంబినేషన్‌ టికెట్‌ ధర రూ.10లో ఎటువంటి మార్పులేదు. దీనిని యథాతథంగా కొనసాగించనున్నారు. జనరల్‌ బస్‌పాస్‌లతోపాటు, విద్యార్థుల బస్సుపాస్‌లకు సంబంధించి స్వల్పంగా పెంచారు. రూట్‌ బస్సు పాస్‌లను కిలోమీటర్ల ప్రాతిపాదికన నిర్ణయించారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పిల్లల బస్‌పాస్‌ల చార్జీలను అతి స్వల్పంగా పెంచుతూ ఆర్టీసీ నిర్ణయించింది. కేవలం రూ.10 నుంచి 20 వరకు పెంచారు. ఇలా రూట్లు, నెలలు, క్వార్టర్లీ నిష్పత్తిలో పెంచారు.

ఆర్టీసీని గట్టెక్కించేందుకే చార్జీల పెంపు


-ప్రతి నెలా రూ.45 కోట్లు నష్టం
-గ్రేటర్‌లో కిలోమీటరుకు రూ.16 నష్టం
-సీఎం ఆదేశాలు తూ.చ. తప్పకుండా అమలు
-మిగితా ఉద్యోగుల్లానే సంఘాల నాయకులు
-గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు

ఆర్టీసీని గట్టెక్కించేందుకు బస్‌ చార్జీల పెంపు తప్పదని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.వెంకటేశ్వర్లు అన్నారు. గ్రేటర్‌ ఆర్టీసీ విషయానికి వస్తే ప్రతి నెలా రూ.45 నుంచి 48 కోట్ల నష్టం వస్తున్నదని, గట్టెక్కాలంటే నిర్ణయాలు తప్పవని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను తూ.చ తప్పకుండా అమలు చేస్తామని, మహిళా ఉద్యోగులకు సౌకర్యాలు కల్పిస్తామని ఈడీ స్పష్టం చేశారు. సోమవారం బస్‌చార్జీల పెంపు నిర్ణయంపై జేబీఎస్‌లోని తన కార్యాలయంలో సీటీఎం జానకీరాంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి నెలా రూ.96 కోట్ల రెవెన్యూ వస్తున్నదని, 145 కోట్ల రూపాయల నిర్వహన ఉంటుందని ఆయన వెల్లడించారు. వచ్చే ఆదాయంతో పోల్చితే గ్రేటర్‌ ఆర్టీసీకి ఖర్చులే ఎక్కువని అన్నారు. ఇందుకోసం బస్‌చార్జీలతోపాటు ఆర్టీసీ బస్‌ ఆపరేషన్‌ టైమింగ్‌లో మార్పులు తెస్తామని తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి కాకుండా 6 గంటల నుంచి బస్సులు నడిపిస్తామని అన్నారు. రద్దీ వేళల్లో బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. మధ్యాహ్నం సమయాల్లో రద్దీ తక్కువగా ఉంటుందని, ఖాళీగా బస్సులను తిప్పబోమని, ప్రయాణికులను పెంచేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. రాత్రి 9.30 గంటల తర్వాత ప్రయాణికుల అవసరాల మేరకు బస్సులు తిప్పుతామని అన్నారు. మహిళా ఉద్యోగులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా నిర్ణీత సమయంలోగా విధుల నుంచి తిప్పి పంపుతామని తెలిపారు.

మినిమం టికెట్‌ ధర రూ.10

పెరిగిన చార్జీల విషయానికి వస్తే ఆర్డినరీ బస్సు మినిమం టికెట్‌ను రూ.5 నుంచి 10కి పెంచామని, ఎక్స్‌ప్రెస్‌ మినిమం టికెట్‌లో మార్పులు లేవని అన్నారు. 20 స్టేజీల వరకు టికెట్‌పై రూ.5 మాత్రమే చార్జీ పెరిగిందని, 21వ స్టేజీ నుంచి రూ.10 పెంచామని, బస్‌పాస్‌ల చార్జీలు కూడా పెంచామని తెలిపారు. ఇవన్నీ పెంచినా లాభాల్లోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. నెలకు అంచనాగా రూ.18 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉందని అన్నారు. వీటిని కూడా సమకూర్చుకునేలా రూట్లను డిజైన్‌ చేయడం వంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సమ్మె కాలంలో రూ.165 కోట్ల నష్టం

సమ్మె సమయంలో రూ.165కోట్ల నష్టం గ్రేటర్‌ ఆర్టీసీకీ వచ్చిందని అన్నారు. సమ్మెకు ముందు వరకు సగటున రోజుకు రూ.3.06 కోట్ల ఆదాయం వచ్చేదని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ రీజియన్‌లో బస్సుల ఆపరేషన్స్‌ వల్ల ఆదాయం మెరుగ్గా ఉన్నప్పటికీ నగర శివారులైన ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్‌ వంటి మార్గాల్లో కనీస ఆదాయం కూడా రావడం లేదన్నారు. కిలోమీటరుకు కనీసం రూ.17 కూడా రావడం లేదన్నారు. కనీసం రూ.27 రెవెన్యూ వస్తే నిర్వహణ సాధ్యమని స్పష్టం చేశారు. వీటన్నింటినీ గాడిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంఘాల నాయకులను కూడా మిగతా ఉద్యోగుల మాదిరిగానే చూస్తామని , చర్యలుంటాయని అన్నారు.

20వ స్టేజీ వరకు రూ.5 మాత్రమే పెంపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుడిపై భారం వేయకుండా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో 20వ స్టేజీ వరకు కేవలం గతంలో ఉన్న టికెట్‌ ధరకు అదనంగా రూ.5 మాత్రమే పెంచారు. (ఉదాహరణకు రూ.10 ఉంటే 15గా.., 30 ఉంటే 35గా.. పెంచారు.) 21వ స్టేజీ నుంచి ఒక్కో ప్రయాణికుడి టికెట్‌పై రూ.10 మాత్రమే పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే దూరానికి కాకుండా కేవలం ఒక్కో ప్రయాణికుడి టికెట్‌పై రూ.5 పెంచారు. అరుదుగా సుదూర ప్రాంతాలకు వెళ్లే వారిపై కేవలం టికెట్‌పై రూ.10 పెంచారు. 20 స్టేజీలుంటే 40 కి.మీటర్ల దూరం ఉంటుంది. నగరంలో ప్రయాణికులు 40 కిలోమీటర్ల కన్నా తక్కువ ప్రయాణించేవారే ఎక్కువగా ఉంటారు. గతంలో ఉన్న టికెట్‌ ధరతో పోల్చితే కేవలం రూ.5 మాత్రమే అదనంగా ఉంటుంది. బస్సు చార్జీలకు చిల్లర ఇబ్బందులు లేకుండా రౌండ్‌ ఫిగర్‌ చేశారు. గతంలో కూడా చిల్లర సమస్యను దృష్టిలో ఉంచుకుని కండక్టర్లకు, ప్రయాణికులకు మధ్య గొడవలకు ఆస్కారం లేకుండా రూ.5,10,15 ,20 విలువ గల టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇదే విధానంలో మళ్ళీ పెరిగిన చార్జీలను కూడా సవరించారు. ఇప్పటికే పెరిగిన చార్జీలకు అనుగుణంగా టీమ్స్‌ మిషన్లలో సాఫ్ట్‌వేర్‌ను సవరించారు.
bus-charges

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...