విపత్తుల నిర్వహణకు అత్యాధునిక పరికరాలు


Fri,November 22, 2019 01:50 AM

-ప్రమాదాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు
-రంగంలోకి దిగిన ఆధునిక వాహనాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అగ్నిప్రమాదాలు, భూకంపాలు, భవనాలు, చెట్లు వంటివి కూలడం, గాలివానలు, వరదలు తదితర విపత్తులను సమర్థవంతగా ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ అత్యాధునిక పరికరాలతోకూడిన వాహనాలను రంగంలోకి దింపింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) బృందాలు వచ్చేలోగానే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా వీటిని సిద్ధం చేశారు. ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాలు జరిగినప్పుడు సహజంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపడతాయి. అయితే అత్యంత భారీ సంఘటనలు జరిగినప్పుడే వీటిని రంగంలోకి దింపుతారు. మామూలు ఘటనలు జరిగినప్పుడు మాత్రం మున్సిపల్‌ సిబ్బంది, పోలీసు, ఫైర్‌ తదితర విభాగాలే సహాయక చర్యలు చేపడతాయి. ఆయా విభాగాలు సరియైన సమయంలో స్పందించకపోవడం, ఒకవేళ సమయానికి చేరుకున్నా వారివద్ద అవసరమైన యంత్ర సామగ్రి లేకపోవడంవల్ల సహాయక చర్యల్లో ఇబ్బందులు తలెత్తడం సహజం.

ఉదాహరణకు ఇటీవల కాచిగూడలో రైలు ప్రమాదం సంభవించగా అందులో చిక్కుకుపోయిన కోపైలెట్‌ను రక్షించడంతోపాటు సహాయక చర్యలు చేపట్టేందుకు రైల్వేశాఖ వద్ద సమయానికి యంత్రసామగ్రి కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీకి చెందిన డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే తమ యంత్ర సామగ్రితో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు నిర్వహించాయి. రైల్వే సహాయక సిబ్బంది సైతం జీహెచ్‌ఎంసీకి చెందిన డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది యంత్ర పరికరాలనే ఉపయోగించడం విశేషం. ఈ నేపథ్యంలో, జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్క్యూ బృందాలను మరింత పటిష్టంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక వాహనాలను సిద్ధంచేసుకున్నది. ఏ చిన్న ప్రమాదం జరిగినా.. నష్టం జరుగకుండా సరియైన సమయంలో స్పందించేందుకు ఇప్పటికే సిబ్బందికి తర్ఫీదునిచ్చిన జీహెచ్‌ఎంసీ, తాజాగా వారికోసం అత్యాధునిక యంత్ర సామగ్రితోకూడిన వాహనాలను సమకూర్చింది. గురువారం ఎనిమిది వాహనాలను మంత్రి కేటీఆర్‌ జెండా ఊపి ప్రారంభించారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...