‘సాంకేతిక’ సహకారంతో ఆస్తిపన్ను మదింపు


Wed,October 23, 2019 01:20 AM

- అధికారుల సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌
- జీఐఎస్‌తో భవనాల మ్యాపింగ్‌

ఆస్తిపన్ను వసూళ్లు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జియో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(జీఐఎస్‌) శాటిలైట్‌ మ్యాప్‌లను ఉపయోగించనున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై మేయర్‌ సమీక్ష నిర్వహించారు. గ్రేటర్‌లో ఆస్తిపన్ను పరిధిలోకి రాని భవనాలు, తక్కువ పన్ను చెల్లిస్తున్న ఆస్తులను జియో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(జీఐఎస్‌) విధానం ద్వారా ఆస్తిపన్ను సవరణలు చేపట్టనున్నట్లు వివరించారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆస్తిపన్ను వసూళ్లు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జియో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(జీఐఎస్‌) శాటిలైట్‌ మ్యాప్‌లను ఉపయోగించనున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. అంతేకాకుండా దోమల ఉత్పత్తికి కారణమవుతున్న ఖాళీ జాగాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, నవంబర్‌ మొదటి వారంలోగా రోడ్లపై గుంతలను పూడ్చివేయాలని కోరారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై మేయర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అన్ని సర్కిళ్లలో వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలిగించేందుకు ప్రతి సర్కిల్‌కు ప్రత్యేకంగా నాలుగు టిప్పర్లు, రెండు బాబ్‌కాట్‌లను అదనంగా అందజేసినట్లు గుర్తు చేశారు. ఓపెన్‌ గార్బేజ్‌ పాయింట్లను ఎత్తివేయడంతోపాటు జీరో గార్బేజ్‌ సర్కిళ్లుగా రూపొందించాలని స్పష్టం చేశారు. కమర్షియల్‌ మార్గాల్లో ప్రతిరోజు రెండు, మూడుసార్లు గార్బేజ్‌ను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, 25 కిలోల గార్బేజ్‌ ఉత్పత్తి చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, ఇతర వాణిజ్య సంస్థల నుంచి ప్రత్యేకంగా గార్బేజ్‌ను తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

గార్బేజ్‌ పాయిం ట్లు, దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారిన ఖాళీ స్థలాల యజమానులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని, అవసరమైతే నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని మేయర్‌ స్పష్టం చేశారు. పారిశుధ్య నిర్వహణపై వార్డు, సర్కిల్‌, జోన్‌ల వారీగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్లాస్టిక్‌ నిషేధాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అక్రమంగా భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేసే వాహనాలకు మొదటిసారి రూ.25 వేలు, రెండోసారి రూ.50వేలు, మూడోసారి రూ. ఒక లక్ష జరిమానా విధించాలని, మళ్లీ పట్టుబడితే వాహనాన్ని సీజ్‌ చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగరాన్ని ఓడీఎఫ్‌++గా మరోసారి ప్రకటించేందుకు స్వచ్ఛ భారత్‌ బృందాలు నగరంలో పర్యటించనున్నందున క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పారిశుధ్య పనులను మరింత సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వహించాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని, అందుకే ప్రత్యేకంగా అధికారిని నియమించినట్లు మేయర్‌ తెలిపారు.

రెవెన్యూ పెంపునకు జీఐఎస్‌
గ్రేటర్‌ పరిధిలో ఆస్తిపన్ను పరిధిలోకి రాని భవనాలు, తక్కువ పన్ను చెల్లిస్తున్న ఆస్తులను జియో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(జీఐఎస్‌) విధానం ద్వారా ఆస్తిపన్ను సవరణలు చేపట్టనున్నట్లు మేయర్‌ చెప్పారు. ఈ విధానం ద్వారా 15 లక్షలకుపైగా భవనాలను మ్యాపింగ్‌ చేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా కొత్త ఆస్తులను గుర్తించడం, అండర్‌ అసెస్‌మెంట్‌ ఆస్తులను గుర్తించి సరిచేయడం వంటి చర్యలు కూడా జీఐఎస్‌ ద్వారా చేపడుతామన్నారు. ఇప్పటికే మూసాపేట్‌లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించినట్లు, డిసెంబర్‌ చివరి నాటికి నగరమంతా మ్యాపింగ్‌ పూర్తిచేసి జనవరి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. ఈ విధానాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు కమిషనర్‌, విజిలెన్స్‌ విభాగం పర్యవేక్షణ ఉంటుందన్నారు.

బయోమెట్రిక్‌ యంత్రాలకు జియో ఫెన్సింగ్‌
జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికుల హాజరుకై ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌ యంత్రాలకు జియో ఫెన్సింగ్‌ పరిధిని అనుసంధానం చేయనున్నట్లు మేయర్‌ చెప్పారు. దీనివల్ల పారదర్శకత చోటుచేసుకుంటుందని, ఇంటి వద్ద ఉండి హాజరు వేయడం కుదరదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉదయం షిఫ్టు కార్మికుల హాజరును ఉదయం ఐదున్నర నుంచి ఏడు గంటలలోపు ఒకసారి, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల లోపు మరోసారి నమోదు చేయనున్నట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం షిఫ్టు కార్మికుల హాజరును రెండు నుంచి మూడు గంటల మధ్య ఒకసారి, రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మరోసారి నమోదు చేస్తామన్నారు. రాత్రి షిఫ్టు కార్మికుల హాజరును రాత్రి పది నుంచి 11గంటల మధ్య, తిరిగి తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల మధ్య మరోసారి నమోదు చేయనున్నట్లు మేయర్‌ వివరించారు. ఈ సమావేశంలో కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌తోపాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు, జోనల్‌, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...